Afghanistan Thrashes SL: ఆఫ్ఘనిస్తాన్ చేతిలో శ్రీలంక చిత్తు
ఆసియా కప్ లో ఆఫ్గనిస్తాన్ గ్రాండ్ విక్టరీతో బోణీ కొట్టింది. అంచనాలకు మించి చెలరేగిన ఆ జట్టు తొలి మ్యాచ్ లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
- By Naresh Kumar Published Date - 11:51 PM, Sat - 27 August 22

ఆసియా కప్ లో ఆఫ్గనిస్తాన్ గ్రాండ్ విక్టరీతో బోణీ కొట్టింది. అంచనాలకు మించి చెలరేగిన ఆ జట్టు తొలి మ్యాచ్ లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ దశలోనూ లంక కనీస పోటీ ఇవ్వలేక పోవడంతో మ్యాచ్ వన్ సైడ్ గా ముగిసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక కేవలం 105 రన్స్ కే కుప్పకూలింది. ఒక దశలో ఆఫ్ఘన్ పేసర్ ఫరూఖీ విజృంభించడంతో శ్రీలంక ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గుణతిలక, రాజపక్స కలిసి శ్రీలంక స్కోర్ 50 పరుగులు దాటించారు. శ్రీలంక 80 పరుగుల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. అయితే చివర్లో కరుణ రత్నే శ్రీలంక పరువు కాపాడాడు. రాజపక్స 38, కరుణ రత్నే 31, గుణ తిలక 17 పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫరుఖీ మూడు, ముజీబ్ ఉర్ రహ్మన్, నబీ తలో రెండు వికెట్లు తీయగా నవీన్ ఉల్ హక్ ఒక్కో వికెట్ తీశాడు.
106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి ఆఫ్గనిస్తాన్‌కు ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ 83 పరుగుల భాగస్వామ్యం తొలి వికెట్‌కు నెలకొల్పి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తద్వారా ఆఫ్గనిస్తాన్ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని 10.1 ఓవర్లలో చేధించింది.
ఆఫ్ఘాన్ ఓపెనర్లు.. రహ్మనుల్లా గుర్బాజ్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 40, హజ్రతుల్లా జజాయ్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్లతో 37 నాటౌట్ అనుభవం లేని లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. మరో 59 బంతులు మిగిలుండగానే ఆఫ్ఘాన్ ఘన విజయాన్ని అందుకుంది.