Bengal Polls Violence : “పంచాయతీ” పోల్స్ రక్తసిక్తం.. తొమ్మిది మంది మృతి
Bengal Polls Violence : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల వేళ శనివారం హింసాగ్ని చెలరేగింది. పోలింగ్ జరుగుతుండగా పలుచోట్ల రాజకీయ వర్గాల మధ్య జరిగిన గొడవల్లో దాదాపు తొమ్మిది మంది మృతిచెందారు.
- By Pasha Published Date - 01:06 PM, Sat - 8 July 23

Bengal Polls Violence : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల వేళ శనివారం హింసాగ్ని చెలరేగింది.
పోలింగ్ జరుగుతుండగా పలుచోట్ల రాజకీయ వర్గాల మధ్య జరిగిన గొడవల్లో దాదాపు తొమ్మిది మంది మృతిచెందారు.
మరణించిన వారిలో ఐదుగురు టీఎంసీ కార్యకర్తలు, బీజేపీ, సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లకు చెందిన చెరో కార్యకర్త, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారు ఉన్నారని ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది.
కనీసం రెండు పోలింగ్ బూత్‌లలో బ్యాలెట్ బాక్సులు ధ్వంసమయ్యాయని(Bengal Polls Violence) తెలిపింది.
Also read : DRDO Scientist Vs Pak Spy : మిస్సైల్స్ సీక్రెట్స్ లీక్.. పాక్ మహిళా ఏజెంట్ కు చెప్పేసిన సైంటిస్ట్
- కూచ్ బెహార్ జిల్లాలోని ఫలిమరి గ్రామ పంచాయతీలో బీజేపీ పోలింగ్ ఏజెంట్ మాధబ్ బిశ్వాస్ హత్యకు గురయ్యాడు. బిశ్వాస్ పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, టీఎంసీ మద్దతుదారులు ఆయనను అడ్డుకున్నారని, పరిస్థితి చేయిదాటిపోవడంతో హత్య చేశారని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది.
- “పరగణాస్ జిల్లాలోని నార్త్ 24లో ఒక స్వతంత్ర ముస్లిం అభ్యర్థిని టీఎంసీ అభ్యర్థి హత్య చేశాడు. టీఎంసీకి హింస, హత్య, బూత్ క్యాప్చర్ భాష మాత్రమే తెలుసు. ఈ హత్యలకు బెంగాల్ ఎన్నికల అధికారితో పాటు, బెంగాల్ సీఎం బాధ్యులు” అని ఆరోపిస్తూ బీజేపీ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ట్వీట్ చేశారు.
- ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని కదంబగచి ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారుడు ఒకరు శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యాడు..
- పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఉన్న తారకేశ్వర్ ఏరియాలో ఒక స్వతంత్ర అభ్యర్థి కుమార్తె చందనా సింగ్ (20)పై ఓ పార్టీ కార్యకర్తలు కాల్పులు జరిపారు.
- “నదియాలోని చాప్రాలో మా పార్టీ కార్యకర్తను కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నరికి చంపారు. ఇదే ఘటనలో మా పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కేంద్ర బలగాలు ఏమయ్యాయి ?” అని పేర్కొంటూ సీఎం మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పార్టీ ట్వీట్ చేసింది. “నదియాలోని నారాయణపూర్-I గ్రామ పంచాయతీలో సీపీఐ(ఎం) కార్యకర్తలు మా అభ్యర్థి హసీనా సుల్తానా భర్తపై కాల్పులు జరిపారు. జల్పాయిగురిలోని సల్బారి-II గ్రామ పంచాయితీకి చెందిన మా కార్యకర్తపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు” అని తెలుపుతూ తృణమూల్ మరో ట్వీట్ చేసింది.
- “టీఎంసీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. పౌరుల ప్రాణాలను రక్షించడంలో కేంద్ర బలగాలు విఫలమయ్యాయి” అని పేర్కొంటూ పశ్చిమ బెంగాల్ మంత్రి శశి పాంజా ట్వీట్ చేశారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం)ల అపవిత్ర కూటమిలోని కార్యకర్తలు హస్నాబాద్, నార్త్ 24 పరగణాల్లోని తమ పార్టీ మద్దతుదారులపై బహిరంగంగా దాడి చేశారని ఆరోపించారు. కూచ్ బెహార్‌లోని దిన్‌హటాలో బీజేపీ అభ్యర్థి బ్యాలెట్ బాక్స్‌లోకి నీరు పోశారని తెలిపారు.
- నందిగ్రామ్-I బ్లాక్‌లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా బీజేపీ అడ్డుకుందని TMC నాయకుడు కునాల్ ఘోష్ ఆరోపించారు.
- “బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఉన్న పోలింగ్ స్టేషన్ల చుట్టూ బాంబులు విసిరారు. బెంగాల్ పోలీసులు స్పందించడం లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం.. దీదీ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నాయి. బెంగాల్ కు కేంద్ర బలగాలను పంపినప్పటికీ, రాష్ట్ర సర్కారు CAPFని మోహరించలేదు” అని పేర్కొంటూ బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు.