Secunderabad Fire: సికింద్రబాద్ లో భారీ అగ్ని ప్రమాదం… 11 మంది సజీవదహనం..!
సికింద్రాబాద్ బోయగూడలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టింబర్ డిపోలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.
- By Hashtag U Published Date - 08:39 AM, Wed - 23 March 22

సికింద్రాబాద్ బోయగూడలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టింబర్ డిపోలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో కట్టెల మండిలో మొత్తం 15 మందికి పైగా కార్మికులున్నట్లు డిపో యాజమాన్యం తెలిపింది. మంటల నుంచి సురక్షితంగా ఇద్దరు కార్మికులు బయటపడ్డారు.
మృతులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. టింబర్ డిపో, స్క్రాప్ గోదాం కావడం వల్ల మంటలు త్వరగా వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇవాళ(బుధవారం) వేకువజామున 4 గంటలకు బోయగూడ కట్టెల మండిలో ఈ ప్రమాదం సంభవించింది.