Gaza – Open Air Prison : గాజాను ‘ఓపెన్ ఎయిర్ జైలు’ అని ఎందుకు అంటారు ?
Gaza - Open Air Prison : పాలస్తీనాలో రెండు పాలనాపరమైన భూభాగాలు ఉన్నాయి. అవే వెస్ట్ బ్యాంక్, గాజా. ‘గాజా’ను ఉగ్ర సంస్థ హమాస్ పాలిస్తోంది.
- By Pasha Published Date - 02:57 PM, Wed - 11 October 23

Gaza – Open Air Prison : పాలస్తీనాలో రెండు పాలనాపరమైన భూభాగాలు ఉన్నాయి. అవే వెస్ట్ బ్యాంక్, గాజా. ‘గాజా’ను ఉగ్ర సంస్థ హమాస్ పాలిస్తోంది. ‘వెస్ట్ బ్యాంక్’ ను ‘ఫతా’ పార్టీ ఏలుతోంది. ‘ఫతా’ పార్టీ హింసా మార్గాన్ని నమ్మడం లేదు. కానీ హమాస్ సంస్థ మాత్రం.. పోరాటంతోనే ఇజ్రాయెల్ నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతోంది. అందుకే గాజాను ఇజ్రాయెల్ టార్గెట్ గా ఎంచుకుంటోంది. జెరూసలెం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో గాజా ఉంది. గాజాలో హమాస్ ఉగ్ర స్థావరాలు ఉన్నాయని ఇజ్రాయెల్ అంటోంది. గాజా ప్రాంతానికి ఒక వైపు సముద్రం, మరోవైపు ఇజ్రాయెల్ బార్డర్ ఉంది.
1967 అరబ్ యుద్ధంలో..
గాజా ప్రాంతం 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పులో విస్తరించి ఉంది. ఈ ఏరియాలోనే దాదాపు 22 లక్షల మంది పాలస్తీనియన్లు నివసిస్తున్నారు. వీరిలో 40శాతం మంది 15ఏళ్లలోపు వారే. ప్రపంచంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇదొకటి. 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటైనప్పుడు గాజా ప్రాంతం ఈజిప్టు నియంత్రణలో ఉండేది. 1967 అరబ్ యుద్ధంలో దీన్ని ఇజ్రాయెల్ కబ్జా చేసింది. అక్కడున్న పాలస్తీనావాసులను సముద్రపు మూల వైపునకు సైనిక బలంతో తరిమికొట్టింది. ఈవిధంగా ఇజ్రాయెల్ సైనిక చర్యలతో ఇళ్లు, భూములను కోల్పోయిన పాలస్తీనియన్లతో ఏర్పడిన సముద్రపు అంచులోని భూభాగమే గాజా. ఇక తాము ఆక్రమించుకున్న గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ సర్కారు యూదుల కోసం 21 కాలనీలను నిర్మించింది.
We’re now on WhatsApp. Click to Join
గాజాకు ఆయుధాలు చేరితే తమకు ముప్పు అని గ్రహించిన ఇజ్రాయెల్.. సముద్ర మార్గంలో భారీ కంచెను నిర్మించింది. ఇక ఇజ్రాయెల్ గాజా మధ్య కూడా భారీ గోడలను కట్టించింది. ఈవిధంగా ఓ వైపు సముద్ర కంచె, మరోవైపు ఇజ్రాయెల్ సరిహద్దు గోడల మధ్య గాజా ప్రాంతం ఉంది. భూభాగం ద్వారా, సముద్ర మార్గం ద్వారా ఎక్కడికి వెళ్లాలన్నా.. గాజావాసులు ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతిని తప్పకుండా పొందాలనే రూల్ పెట్టారు. ఈవిధమైన నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నందు వల్లే గాజాను ‘బహిరంగ జైలు’ అని పిలుస్తుంటారు. అయితే గాజాకు సంబంధించిన విద్యుత్ ప్లాంట్లు, నీటి పంపిణీ ప్లాంట్లు ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాల్లోనే ఉన్నాయి. ఈ కారణంగా గాజాపై ప్రతీకార చర్యలను చేపట్టే ప్రతిసారీ.. విద్యుత్, నీటి పంపిణీని ఇజ్రాయెల్ ఆపేస్తుంటుంది. ఇక ఈజిప్టు నుంచి ఇజ్రాయెల్ కు నిత్యావసరాలు సప్లై అయ్యే రోడ్డు కూడా ఇజ్రాయెల్ ఆర్మీ ఆధీనంలోనే ఉంది. దీంతో గాజాకు వెళ్లే నిత్యావసరాల వాహనాలను కూడా ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తుంటుంది. వాటిలో ఏమైనా ఆయుధాలు ఉన్నాయా అనేది తనిఖీ (Gaza – Open Air Prison) చేస్తుంటుంది.