Start Up: చెత్తే బంగారమాయే.!
ఉద్యోగం కోసం చదువుకోవడం వేరు.. మన చదువు పది మందికి ఉపయోగపడాలని చదువుకోవడం వేరు.. ఈ కుర్రాడు రెండో దారిని ఎంచుకున్నాడు. మనసుకు నచ్చిన పని చేస్తున్నాడు.. పది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.. లక్షల్లో ఆదాయం సృష్టిస్తున్నాడు.
- By Hashtag U Published Date - 07:30 AM, Sun - 30 January 22

ఉద్యోగం కోసం చదువుకోవడం వేరు.. మన చదువు పది మందికి ఉపయోగపడాలని చదువుకోవడం వేరు.. ఈ కుర్రాడు రెండో దారిని ఎంచుకున్నాడు. మనసుకు నచ్చిన పని చేస్తున్నాడు.. పది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.. లక్షల్లో ఆదాయం సృష్టిస్తున్నాడు.
ఆశయం గొప్పగా ఉంటే సరిపోదు.. దాన్ని ఆచరణలో పెట్టాలి.. ప్రాణం పెట్టి పనిచేయాలి. అలాంటి వారిని విజయం వెతుక్కుంటూ వచ్చి వరిస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉధాహరణగా నిలుస్తున్నాడు తిరుపతికి చెందిన యువకుడు చందన్ కగ్గనపల్లి. పుట్టిన ఊరిని పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ 25 ఏళ్ల యువకుడు చేస్తున్న పని ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టింది. రైతులను, ప్రజలను సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేసేలా చేసింది.
పర్యావరణ హిత స్టార్టప్:
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుండి నిత్యం లక్షలాది భక్తులు తిరుపతి నగరానికి వస్తుంటారు. స్థానిక ప్రజలతో పాటు పర్యాటకుల ద్వారా ప్రతి రోజూ 40 టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్ధాలతో కూడిన చెత్త నగరంలో ఉత్పత్తి అవుతుంది. ఇది ఎంతైనా ఆందోళన కలిగించే అంశం. తిరుపతి నగరం ఎదుర్కొంటున్న ఈ సమస్యను కొంతైనా తీర్చేందుకు నడుం బిగించాడు “చందన్ కగ్గనపల్లి”.
నగరంలో పేరుకుపోతున్న చెత్తను నగరవాసులకు పనికొచ్చే విధంగా మార్చేందుకు 2020లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఊరికి చివర “Ecofinix” అనే వేస్ట్ మేనేజ్మెంట్ స్టార్టప్ ను ప్రారంభించాడు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కావడంతో సాంకేతికతను వినియోగించుకుంటూ వినూత్న రీతిలో ముందుకు సాగాడు. చెత్త నుండి సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేసి రైతులకు, తిరుపతి నగర ప్రజలకు కిలో రూ.4ల అందుబాటు ధరకు అందిస్తున్నాడు. సోషల్ మీడియాలో తన ఉత్పత్తుల గురించి క్యాంపెయిన్ లను నిర్వహిస్తూ నగరవాసులకు అవగాహన కల్పిస్తున్నాడు.
చెత్త నుండి సంపద సృష్టి:
ఈకోఫీనిక్స్ ప్లాంట్ లో తయారయ్యే ఎరువులు పూర్తిగా రసాయన రహితం కావడంతో రైతులు నాణ్యతతో కూడిన మంచి దిగుబడిని పొందగలుగుతారు. రైతులే కాకుండా నగర ప్రజలు కూడా తమ పెరట్లో, ఇంటి డాబాలపై వివిధ రకాల కాయగూరలు, పూల మొక్కలు వంటివి పెంచుకునేందుకు ఈ ఎరువులను వినియోగిస్తున్నారు. చందన్ ప్రస్తుతం తన ప్లాంట్ లో ప్రతి రోజూ 100 టన్నుల వ్యర్ధాలను ప్రాసెసింగ్ చేయగలుగుతున్నాడు. చెత్త నుండి సేంద్రియ ఎరువులతో పాటు సంపదను కూడా సృష్టిస్తున్నాడు. ఈ యువకుడి కృషిని గుర్తించిన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలు రాజమండ్రిలో మరో “వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్” ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించారు.
తల్లి ప్రోత్సాహం:
చిన్న వయసులోనే యువ పారిశ్రామిక వేత్తగా తనకు వచ్చిన ఈ గుర్తింపుకు ప్రధాన కారణం తన తల్లి రాధాదేవి అని చెబుతాడు చందన్. నచ్చిన పని చేసేందుకు తనకు పూర్తి స్వేచ్ఛనివ్వడమే కాకుండా ఆ పనిలో నిలదొక్కుకునేందుకు ఆమె అందించిన సహకారం, ప్రోత్సాహం వెలకట్టలేనిదని అంటాడు. ఆమె తనపై ఉంచిన నమ్మకమే పర్యావరణ హితమైన ఈ స్టార్టప్ ను ప్రారంభించేలా చేసిందని, తనతో పాటు మరో పది మందికి ఉపాధిని కల్పిస్తుందని చెబుతున్నాడు.