Human Speech:మనిషికి మాట్లాడే శక్తి ఎలా వచ్చింది? గుట్టువిప్పిన తాజా అధ్యయనం!!
భూమిపై ఉన్న ఇతర జీవ రాశుల కంటే భిన్నంగా మానవ జాతిని నిలబెట్టే అతి ముఖ్య అంశం.. మాట!! మాటే మంత్రంగా మారి.. మానవుడిని నాగరిక జీవిగా తీర్చిదిద్దింది.
- By Hashtag U Published Date - 01:30 PM, Sat - 13 August 22

భూమిపై ఉన్న ఇతర జీవ రాశుల కంటే భిన్నంగా మానవ జాతిని నిలబెట్టే అతి ముఖ్య అంశం.. మాట!! మాటే మంత్రంగా మారి.. మానవుడిని నాగరిక జీవిగా తీర్చిదిద్దింది. కోతి జాతి నుంచి మనిషి వచ్చాడని అంటారు. కోతులు , చింపాంజీలు ఇప్పటివరకు మాట్లాడటం నేర్చుకోలేకపోయాయి. మాటలను మనిషి మాత్రమే ఎలా నేర్చుకోగలిగాడు ? ఆ దిశగా అతడి స్వర పేటికలో జరిగిన మార్పులు ఏమిటి? అనే దానిపై జపాన్, ఆస్ట్రియా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో కొంగొత్త విషయాలు వెలుగుచూశాయి. అవేంటో తెలుసుకుందాం..
43 జాతుల కోతులు, చింపాంజీల స్వర పేటికల విశ్లేషణ..
అధ్యయనంలో భాగంగా 43 జాతుల కోతులు, చింపాంజీలకు చెందిన స్వర పేటికల నమూనాలను సేకరించి విశ్లేషించారు. కోతులు, చింపాంజీల కంటే మనుషుల స్వరపేటిక భిన్నమైనదని .. చాలా డిఫరెంట్ గా ఉందని వెల్లడైంది. మనిషి నోటి లోపల అత్యంత చివరన.. గొంతును అనుసందానిస్తూ ఉండే భాగంలో ప్రత్యేక నిర్మాణం ఉంది. అక్కడ రిబ్బన్ ఆకారంలో రెండు వైపులా పలుచటి ఓకల్ కార్డ్స్ (vocal cords) ఉంటాయి. ఇక స్వర పేటిక మధ్య భాగంలో చిన్న సైజులో ఓకల్ మేంబ్రేన్ ( vocal membrane) ఉంది. ఈ రెండింటి వల్ల మనుషుల గొంతుకు మాట్లాడే శక్తి వచ్చిందని పరిశోధకులు తెలిపారు. కోతులు, చింపాంజీల గొంతు నిర్మాణం ఈవిధంగా లేకపోవడం వల్ల అవి మూగజీవులుగా మిగిలాయని చెప్పారు.
కోతులు, చింపాంజీల స్వరపేటికలో
గాలి తిత్తి..
కోతులు, చింపాంజీల స్వరపేటిక లోపల దిగువ భాగంలో ఒక భిన్నమైన గాలి తిత్తి లాంటి నిర్మాణం ఉంది. దీని సహకారం వల్లే కోతులు, చింపాంజీలు కేకలు , వివిధ సౌండ్స్ ను క్రియేట్ చేస్తుంటాయి. ఆపదలో ఇతర జంతువుల నుంచి రక్షణ పొందేందుకు.. తోటి కోతులకు సమాచారాన్ని బదిలీ చేసేందుకు కొన్ని ప్రత్యేకమైన అలర్ట్ సౌండ్స్ ను చేసేందుకు గాలి తిత్తి ఉపయోగపడుతుంది. ఈ గాలి తిత్తికి సంకోచించే, వ్యాకోచించే గుణం ఉంటుంది. కోతులు, చింపాంజీలు సౌండ్స్ చేసినప్పుడు ఇది వ్యాకోచిస్తుంది. ఫలితంగా ఎంతసేపు ఏకధాటిగా కేకలు పెట్టినా వాటి గొంతుపై ఎలాంటి ఒత్తిడి పడదు. ఈ గాలి తిత్తి లేకపోవడంతో మనిషి గొంతు మరింత సౌకర్యవంతంగా మారింది. ఏ పదాలు.. ఎంత పిచ్ లో మాట్లాడాలి ? ఎలా మాట్లాడాలి ? అనేది మనిషి డిసైడ్ చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే గొంతుపై మనిషికి పూర్తి పట్టు ఉండేలా.. గొంతులో సౌకర్యవంతమైన నిర్మాణం ఉంది.
శిలాజ సాక్ష్యాలు ఇవి..
* మనిషి మాట్లాడటం ఎప్పుడు మొదలైందన్న విషయంలో, ప్రాచీన మానవ శిలాజాలు కొన్ని వివరాలను అందిస్తున్నాయి.
* నోటి ద్వారా కొన్ని శబ్దాలు చేయడానికి కండరాలను నియంత్రించే వ్యవస్థ అవసరం.
* మానవ శరీరంలోని ఛాతి భాగంలో, ఎన్నో నరాలు, కండరాలతో కూడిన అలాంటి వ్యవస్థ ఒకటి ఉంటుంది.
* కానీ మానవ జాతితో దగ్గరి సంబంధం ఉన్న కోతుల్లో ఇలాంటి వ్యవస్థ ఉండదు.
* మనుషుల వెన్నెముక కోతులతో పోలిస్తే కాస్త దృఢంగా, రొమ్ము భాగం కాస్త విశాలంగా ఉంటుంది.
* 6లక్షల ఏళ్లపాటు జీవించి, అంతరించిపోయిన నియాండర్తాల్ అనే మనిషిని పోలిన జాతిలో మాట్లాడటానికి అనువైన వ్యవస్థ ఉండేది. కానీ పది లక్షల ఏళ్ల క్రితం ఉన్న ఆదిమ మనిషి శరీరంలో ఈ వ్యవస్థ కనిపించదు.
* ఈ వివరాలను గమనిస్తే, మనిషి మాట్లాడటం ఎప్పుడు ప్రారంభమైందన్ని అంశంలో కాస్త స్పష్టత వస్తుంది.
జన్యువులది కూడా కీలక పాత్ర..
* ఎఫ్ఓఎక్స్‌పీ2 అని ఒక జన్యువు మాటలు రావడానికి తోడ్పడుతుంది.
* వానరాలలో కూడా ఈ జన్యువు ఉంటుంది. కానీ మనుషుల్లో కొన్ని మార్పులతో కూడి, ఈ జన్యువు ఉంటుంది.
* ఈ జన్యువులోని మార్పులు, చింపాంజీలు ఎందుకు మాట్లాడలేవు. మనిషి ఎలా మాట్లాడగలుగుతున్నారని వివరిస్తాయి.
* ఈ జన్యువు నియాండర్తాల్‌లో కూడా ఉండేది. దీన్నిబట్టి వారుకూడా ఒక విధమైన భాష ద్వారా సంభాషించుకునేవారని అర్థం చేసుకోవచ్చు. కానీ వారి భాష పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిందా లేదా అన్నది అస్పష్టం.
* ఎందుకంటే.. జన్యువుల ద్వారా మాట్లాడగలిగారా లేదా అనేది తెలుసుకోవచ్చు కానీ, భాషాసంపద గురించి తెలుసుకోలేం.