Hospitals Refund: కరోనా చికిత్స పేరుతో పేషంట్లను అడ్డంగా దోచిన హైదరాబాద్ లోని 44 ఆసుపత్రులకు షాక్…
కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో కార్పోరేట్ ఆసుపత్రుల మొదలు చిన్నా, చితక ఆసుపత్రులన్నీ కూడా కోవిడ్ ట్రీట్ మెంట్ పేరుతో లక్షల్లో పేషెంట్లను బాదేశాయి.
- By Hashtag U Published Date - 07:59 PM, Tue - 24 May 22

కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో కార్పోరేట్ ఆసుపత్రుల మొదలు చిన్నా, చితక ఆసుపత్రులన్నీ కూడా కోవిడ్ ట్రీట్ మెంట్ పేరుతో లక్షల్లో పేషెంట్లను బాదేశాయి. తాజాగా హైదరాబాద్ పరిసరాల్లోని ఆసుపత్రులు అధిక ఛార్జీలు వసూలు చేశారనే ఫిర్యాదులపై రాష్ట్ర ఆరోగ్య శాఖ చర్యలకు దిగింది. ఇందులో భాగంగా మొత్తం 44 ఆసుపత్రులకు పేషంట్లకు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా, నోటీసులు జారీ చేశాయి. ఇందులో భాగంగా ఏకంగా రూ.1.61 కోట్ల మొత్తం రోగుల కుటుంబాలకు తిరిగి ఇచ్చారు.
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో అధిక ఛార్జీలు వసూలు చేసిన తెలంగాణలోని అనేక ప్రైవేట్ ఆసుపత్రులను రోగులకు డబ్బును తిరిగి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కోరింది. ఆర్‌టిఐ ద్వారా లభించిన సమాచారం ప్రకారం, డిపార్ట్‌మెంట్ అందుకున్న 87 ఫిర్యాదులపై విచారణ చేసి, రోగులకు రీఫండ్ చేయాలని ఆదేశించింది. అయితే ఈ మొత్తం రీఫండ్ రూ. 1.61 కోట్లుగా నమోదైంది.
సికింద్రాబాద్‌కు చెందిన RTI కార్యకర్త రాబిన్ జాకీస్ దాఖలు చేసిన RTIకి ప్రతిస్పందనగా రిపోర్టు బయటపడింది, జూన్ 22, 2021 నాటికి రోగులకు మొత్తం రూ. 1,61,22,484 తిరిగి ఇచ్చినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని నాలుగు ఆసుపత్రులు ఒక్కొక్కటి రూ. 10 లక్షలకు పైగా తిరిగి ఇవ్వగా, కూకట్‌పల్లిలోని ఓమ్నీ ఆసుపత్రి మొత్తం రూ. 27.41 లక్షలు రిటర్న్ చేసి అగ్రస్థానంలో ఉంది. జాబితాలో రెండో స్థానంలో నిలిచిన ఉప్పల్‌లోని టీఎక్స్ హాస్పిటల్ రూ.10.85 లక్షలు, హైటెక్ సిటీలోని మెడికోవర్ ఆస్పత్రి రూ.10.82 లక్షలు తిరిగి ఇచ్చాయి. 10 లక్షలను తిరిగిచ్చిన హాస్పిటల్ జాబితాలో సెంచరీ నాల్గవ స్థానంలో నిలిచింది.
ఇక హైదరాబాద్‌లోని ఎనిమిది ఆసుపత్రులు రోగులకు రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు తిరిగిచ్చాయి. కూకట్‌పల్లిలోని ప్రతిమ ఆస్పత్రి, ఎల్‌బీనగర్‌లోని అంకురా ఆస్పత్రి, దియా ఆస్పత్రి, సచివాలయం సమీపంలోని మెడికోవర్ ఆస్పత్రి, ఆర్‌సీపురంలోని ఎన్ కేర్ ఆస్పత్రి, హైటెక్ సిటీలోని కేర్ ఆస్పత్రి, బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ నర్సింగ్‌హోమ్, గచ్చిబౌలిలోని సన్‌షైన్ హాస్పిటల్స్ ఈ మేరకు తిరిగి ఇచ్చిన జాబితాలో ఉన్నాయి.
టీఎక్స్ ఆసుపత్రికి చెందిన కాచిగూడ బ్రాంచ్, మియాపూర్‌లోని అర్చన హాస్పిటల్ కూడా ఒక్కొక్కటి రూ.3.99 లక్షలు తిరిగి ఇచ్చాయి, నారపల్లిలోని అంకురా హాస్పిటల్‌లు రూ.3.85 లక్షలు తిరిగి ఇచ్చాయి. లక్డీకాపూల్‌లోని లోటస్ హాస్పిటల్, నాగోల్‌లోని సుప్రజ హాస్పిటల్‌లు వరుసగా రూ.3.41 లక్షలు, రూ.3.2 లక్షలు తిరిగి ఇచ్చాయి.
ఈ ఆసుపత్రులు రూ. 3 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని వాపసు చేసినప్పటికీ, ఎక్కువ ఛార్జీలు వసూలు చేసినట్లు గుర్తించిన తర్వాత రోగులకు డబ్బును తిరిగి ఇచ్చే ఆసుపత్రుల జాబితాలో మరిన్ని ఆసుపత్రులు ఉన్నాయి. ఈ జాబితాలో మొత్తం 44 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నట్లు ఆర్టీఐ వెల్లడించింది
ఇదిలా ఉంటే జూన్ 2, 2021 న, కోవిడ్ -19 మొదటి వేవ్ సమయంలో రోగులకు అధిక ఛార్జీలు వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల నుండి రూ. 3 కోట్లను రికవరీ చేసినట్లు తెలంగాణ ప్రజారోగ్య. కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాస్ రావు తెలంగాణ హైకోర్టుకు తెలియజేయడం విశేషం. అయితే, జూన్ 22, 2021 వరకు ప్రైవేట్ ఆసుపత్రులు రూ. 1.61 కోట్లు మాత్రమే వాపసు చేశాయని ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా బయటపడింది.
ప్రైవేట్ ఆసుపత్రులపై మొత్తం 174 ఫిర్యాదులు అందాయని, 139 షోకాజ్ నోటీసులు అందజేశామని శ్రీనివాసరావు అదే రోజు కోర్టుకు తెలిపారు. 22 ఆస్పత్రుల లైసెన్సులను డిపార్ట్‌మెంట్ రద్దు చేసిందని, కోర్టుకు నివేదించింది.

List of 44 Hospitals