Rwandan Genocide : మూడు నెలల్లో 10లక్షల హత్యలు.. రువాండా నరమేథం అసలు కథ!
మూడునెలల వ్యవధిలో పదిలక్షలమంది అమాయకుల ప్రాణాల తీసిన మారణహోమానికి ఒక చిన్న సంఘటన ఆజ్యం పోసింది. అదేంటి? చదవండి..
- By Dinesh Akula Published Date - 01:03 PM, Sat - 5 February 22

అలగ్జాండర్ మంచివాడా? చెడ్డవాడా? ప్రపంచవిజేతగా చెప్పబడిన ఒక వీరుడిని కన్నభూమిగా గ్రీసుకు పేరుతెచ్చినందుకు గ్రీకులకు అతను మంచివాడు. అతని చేతిలో ఓటమిచెంది స్వాతంత్య్రాన్ని కోల్పోయిన ప్రజల దృష్టిలో అతను చెడ్డవాడు. ఒక హీరో.. ఒక విలన్. ఒక మంచి.. ఒక చెడు. ఇలా ప్రతీదాన్ని ఏదో ఒక మూసలోకి నెట్టేయడం మనకి అలవాటు. కానీ.. చాలా సందర్భాల్లో ఈ రకమైన విభజన చేయడం సాధ్యం కాదు. ఒక ప్రత్యేక సందర్భంలో ఆ క్షణానికి ఒకటి మంచిదయితే.. మరోసారి దానికి పూర్తిగా విరుద్ధమైనది మంచిగా కనబడుతుంది. ఆఫ్రికాలోని జాతుల మధ్య జరిగిన పోరాటం ఇందుకు మంచి ఉదాహరణ.
అనేక శతాబ్దాలుగా రువాండాలోని హుటూ, టుట్సీ, త్వా జాతులకి చెందిన ప్రజలు ఒకే మతం, సంస్కృతి, భాషలతో సహజీవనం చేస్తూ వచ్చారు. 1916లో జర్మనీ నుంచి రువాండానే స్వాధీనం చేసుకున్న బెల్జియం, జాతుల మధ్య వైషమ్యాలను సృష్టించి.. విభజించు పాలించు అనే సూత్రాన్ని అమలుచేయడం మొదలుపెట్టింది. టుట్సీలకు ఎక్కువ అవకాశాలచ్చి.. హుటూలను అణగదొక్కి వారిలో అసంతృప్తి కలగడానికి కారణమైంది. 1959లో రువాండాపై బెల్జియం పెత్తనం ముగిసిపోయింది. అధికారం మెజారిటీలైన హుటూల చేతికి వచ్చింది. దశాబ్దాలుగా టుట్సీల మీద ఉన్న కోపాన్ని చూపించే అవకాశం హుటూలకు వచ్చింది. టుట్సీలతో పాటు ఉదారవాదులైన హుటూలు కూడా ప్రాణభయంతో దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. ప్రవాసంలో ఉన్న టుట్సీలు 1988లో రువాండన్ పేట్రియాటిక్ ఫ్రంట్ RPF పేరుతో ఏకమై హుటూ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు. పొరుగునే ఉన్న యుగాండాని కేంద్రంగా చేసుకుని అధికారం కోసం సాయుధపోరాటం మొదలుపెట్టారు. ఐదేళ్ల పాటు జరిగిన ఈ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కొల్పోయారు.
1993లో ఐక్యరాజసమితి మధ్యవర్తిత్వం జరిపి రెండు వర్గాలూ అధికారం పంచుకునేలా రాజీసూత్రాన్ని ప్రతిపాదించింది.అతివాదులైన హుటూలు కొందరికి ఈ రాజీ ఫార్ములా నచ్చలేదు. అసలు టుట్సీ అనే పేరు వినబడకుండా చేసి తమ అధికారాన్ని కాపాడుకోవాలనుకున్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని నరమేధానికి ఆ విధంగా రంగం సిద్ధమైంది.
2004లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ ఒక ప్రకటన చేశాడు. ఒక దశాబ్దం క్రితం రువాండాలో జరిగిన దారుణాలకి అంతర్జాతీయ సమాజం బాధ్యత వహించాలని వ్యాఖ్యానించాడు. ప్రేక్షకపాత్ర పోషించిన అమెరికా తరఫున రువాండా ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాడు. అసలు రువాండాలో ఏం జరిగింది? ఆలస్యంగా అయినా అగ్రరాజ్యం ఒక చిన్నదేశానికి ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది? తెలుసుకోవాలంటే 10 సంవత్సరాలు వెనక్కు వెళ్లాలి.
అది 1994. 38 ఏళ్లుగా అధికారంలో ఉన్న హుటూ ప్రభుత్వ పాలనలో దేశం ఆర్ధికంగా చితికిపోయింది. ఆరోగ్యం, అక్షరాస్యత, అభివృద్ధి..ఏది లేదు. ఉన్నది అంతర్యుద్ధం మాత్రమే. అవినీతి, జాతిపరమైన ఉన్మాదంలో కూరుకుపోయిన పాలకులు, మరోవైపు జీవించే హక్కు తమకీ ఉందని చాటుకోవడానికి ఆర్పీఎఫ్ పేరుతో గెరిల్లా తీవ్రవాదులతో దేశం అల్లకల్లోలంగా ఉంది.ఐక్యరాజసమితి ప్రకటించిన అరుషా అక్కార్డ్స్ అనే ఒప్పందం ప్రకారం.. ప్రభుత్వంలోని మంత్రిపదవులను హుటూలు, టుట్సీలు సమానంగా పంచుకోవాలి. 20వ శతాబ్దం ప్రారంభంలో..రువాండాకు వచ్చిన విదేశీయులతో మంచిగా ఉన్న టుట్సీలు.. సామాజికంగా కాస్త అభివృద్ధి చెందారు. హుటూలు మాత్రం రోజుగడవని కార్మికులే. మూడున్నర దశాబ్దాల హుటూల పాలన సొంతజాతిని ఉద్ధరించలేకపోయింది. టుట్సీలతో కలిసి ఒప్పందం చేసుకుంటే వారికి బానిసలుగా మారిపోవాల్సి వస్తుందని హుటూలు భావించారు. దీంతో సైన్యంలోని కొందరు ప్రజలను రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. దేశాధ్యక్షుడు టుట్సీలకు తొత్తుగా మారిపోయాడనీ, హుటూ యువత కలిసి వచ్చి బృందాలుగా ఏర్పడాలని, విదేశాల నుంచి ఆయుధాలు తీసుకురావాలని అబద్ధాలను నూరిపోశారు.. సరిగ్గా ఇదే సమయంలో జరిగిన ఒక సంఘటన నరమేధానికి ఊపిరిలూదింది. అది 1994ఏప్రిల్ 16. రువాండా అధ్యక్షుడు ప్రయాణిస్తున్నవిమానం కూలిపోయింది. అతని మెతకవైఖరి నచ్చని హుటూలే అతన్ని హతమార్చారా? లేక అది టుట్సీ తీవ్రవాదుల పనా అన్నది ఎవరికీ తెలియలేదు. కానీ.. సైన్యంలో ఉన్న హుటూ అతివాదులకు ఈ సంఘటన కలిసివచ్చింది. తమ నాయకుణ్ణి చంపారనే ఆలోచనతో టుట్సీలను ఏరిపారేయడం మొదలుపెట్టారు.ప్రెసిడెంట్ మరణవార్త క్షణాల్లో దేశమంతా వ్యాపించింది.
దీంతో రంగంలోకి దిగిన హుటూ సైనికులు ఇంటింటికీ తిరుగుతూ లెక్కలు తీయడం మొదలుపెట్టారు. ప్రతీ ఇంటిని సోదాచేసి ప్రత్యర్ధుల తెగకు చెందిన వారిని గొడ్డళ్లతో నరకడం ప్రారంభించారు. వాస్తవానికి రువాండాలో నరమేధం మొదలవడానికి ముందునుండీ ఐక్యరాజసమితికి చెందిన సైనిక బలగాలు అక్కడి పరిస్ధితులను పర్యవేక్షిస్తున్నాయి. అధ్యక్షుడి హత్య జరిగిన వెంటనే జరగబోయేదేమిటో గ్రహించి.. యుఎన్‌ఓ దళాలు చొరవ చూపించే ప్రయత్నం చేశాయి. అప్పటివరకు విదేశీయుల్ని గౌరవించే అలవాటు ఉన్న హుటూలు వారిపై విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించమని వారికి తెలిసిన భాషలో చెప్పారు. ఈలోగానే హుటూల చేతిలో పదిమంది యుఎన్‌ఓ సైనికులు హతమయ్యారు. దీంతో.. ఐక్యరాజసమితి దళాలు క్షేమంగా వెళ్లిపోవడానికి అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు హుటూలు. మూడునెలలకుపైగా జరగిన నరమేథంలో 10లక్షలకుపైగా చనిపోయారు.1994 ఏప్రిల్ నెలలో మొదలైన హింసాత్మక ఘట్టం మూడు నెలల్లో ముగిసింది. ఈ లోగా మరణించిన వారి సంఖ్య 10లక్షలకుపైమాటే. వీరిలో హుటూలున్నారు. టుట్సీలున్నారు.
ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ సమాజం చేయలేని పని తుపాకులతో సాధ్యపడింది. టుట్సీల గెర్రిల్లా వ్యూహాల ముందు హుటూల మొరటుపద్ధతులు తలవంచాయి. ఆప్పీఎఫ్‌ను నడిపించిన కగామీ.. దేశానికి కొత్త అధ్యక్షుడయ్యాడు. టుట్సీలను ఊచకోత కోయించడంలో ప్రధాన పాత్ర పోషించినవారిపై కేసులు నమోదయ్యాయి. అప్పటివరకు గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్న పెద్దదేశాలు జూలు విదిల్చాయి. అజ్ఞాతంలో ఉంటూ హుటూ నేతల్ని పట్టుకోవడానికి సహకరిస్తామంటూ ముందుకొచ్చాయి. రువాండా మారణకాండకు కారణమైన వీరిని విచారించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టులో నిందితులను ప్రవేశపెట్టారు. బాధితులు ఒకొక్కరూ వచ్చి ఏం జరిగిందో చెప్తుంటే అక్కడున్న ప్రతీ ఒక్కరి కళ్లు చెమ్మగిల్లాయి.
అంతర్యుద్ధాన్ని అణచివేసిన హీరోగా మిగిలిన టుట్సీ తిరుగుబాటు నాయకుడు కగామే 2000 నుంచి ఏకఛత్రాధిపత్యంగా ఏలుతూనే ఉన్నాడు . అప్పటిదాకా జరిగిన నరమేధాన్ని ఆపడానికి పెద్దదేశాలేమీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదు. కారణం.. అక్కడ చమురుబావులు లేవు. వజ్రాలు లేవు. బంగారం లేదు. చివర్లో రువాండా చితిమంటలపై తెల్లదొరలు కార్చిన మొసలి కన్సీరు ఆవిరైపోయింది. రువాండా నిఘంటువులోనుంచి మానవత్వం అనే పదం శాశ్వతంగా మాయమైపోయింది.