What’s App Income : వాట్సాప్ గురించి ఈ లెక్కలు తెలిస్తే.. షాకవ్వడం ఖాయం
వాట్సాప్ ను అత్యధికంగా వాడుతున్నవారిలో.. భారతీయులే అధికంగా ఉన్నారు. ఏకంగా 54 కోట్లమంది మనోళ్లు వాట్సప్ ను వాడుతున్నారు. ఇంటర్నెట్ వాడేవారిలో 69 శాతం..
- By News Desk Published Date - 08:00 AM, Thu - 23 November 23
What’s App Income : వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వాడేవారెవరికైనా ఈ యాప్ గురించి తెలియకుండా ఉండదు. ఉదయం నిద్రలేవగానే గుడ్ మార్నింగ్ నుంచి.. ప్రతి చిన్న విషయాన్నీ వాట్సాప్ లోనే పంచుకుంటున్నాం. మనం మాత్రమే కాదు.. యావత్ ప్రపంచం దీనికి అంతలా అడిక్ట్ అయిపోయింది. 2009లో కేవలం రూ.1.17 కోట్ల పెట్టుబడితో ఒక మిత్రబృందం ప్రారంభించిన ఈ యాప్.. సంవత్సరాలు గడిచే కొద్దీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయింది.
ఒక్కరోజు.. కాదు కాదు.. ఒక్క 10 నిమిషాలు వాట్సాప్ సేవలు నిలిచిపోతే కొన్ని కోట్ల వ్యాపారాలు తలకిందులయ్యేంతగా వృద్ధి చెందింది వాట్సాప్. అలాంటి వాట్సాప్ కు ఒక్కరోజు ఇన్ కమ్ ఎంత వస్తుంది ? ఎన్నికోట్ల మంది.. ఎంత సమయం మేర దీనిని వాడుతున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 270 కోట్లమంది వాట్సాప్ ను వాడుతుండగా.. ఒక నెలకు కనీసం 230 కోట్లసార్లు ఈ యాప్ ను ఓపెన్ చేస్తున్నారు. రోజుకు సగటున 17.5 కోట్లమంది యూజర్లు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని పంపుతుండగా.. 5 కోట్ల వ్యాపార సంస్థలు వాట్సాప్ ద్వారానే తమ వ్యాపార కలాపాలను సాగిస్తున్నాయి.
180 దేశాల్లో, 60 వేర్వేరు భాషల్లో వాట్సాప్ తన సేవల్ని అందిస్తుంది. దీని యూజర్లలో 73 శాతం మంది ఆండ్రాయిడ్ ఫోన్లను, 22 శాతం మంది ఐఓఎస్ ఫోన్లను వాడుతున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లోని ఉచిత యాప్స్ లో ఆదరణపరంగా.. ఇది 2వ స్థానంలో ఉండగా.. డౌన్ లోడ్స్ ప్రకారం 8వ స్థానంలో ఉంది.
వాట్సాప్ ను అత్యధికంగా వాడుతున్నవారిలో.. భారతీయులే అధికంగా ఉన్నారు. ఏకంగా 54 కోట్లమంది మనోళ్లు వాట్సప్ ను వాడుతున్నారు. ఇంటర్నెట్ వాడేవారిలో 69 శాతం మంది వాట్సప్ ను వాడుతుండగా.. ఈ యాప్ యూజర్లలో 70 మంది రోజులో ఒక్కసారైనా దీన్ని చూస్తున్నారు. ఇది ప్రారంభమైన తొలి 24 గంటల్లోనే.. వాట్సాప్ 100 కోట్ల సందేశాలను డెలివరీ చేసి యావత్ ప్రపంచాన్నీ షాకయ్యేలా చేసింది.
2009 అక్టోబర్ లో వాట్సప్ వ్యవస్థాపకులైన బ్రియాన్ ఆక్టన్, జాన్ కౌమ్, వారిమిత్రులు క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.1.17 కోట్లు పెట్టుబడి పెట్టగా.. 2014లో ఫేస్ బుక్ దీనిని రూ.1.23 లక్షల కోట్లకు కొనుగోలు చేసింది. ఈ మేరకు 1.4 లక్షల కోట్ల విలువైన షేర్లను వాట్సప్ కు ఇచ్చింది.
వాట్సాప్ ఫేస్ బుక్ చేతికివచ్చేనాటికి 40 కోట్లుగా ఉన్న వాట్సప్ యూజర్ల సంఖ్య 2017 నాటికి 130 కోట్లకు చేరింది. చైనా, ఇరాన్, సిరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, క్యూబా, ఉత్తరకొరియా ఈ 6 దేశాలు వాట్సాప్ ను నిషేధించాయి.
2021లో వాట్సాప్ కొత్త నిబంధనల కారణంగా 17 శాతం యూజర్లు దానిని తమఫోన్ల నుంచి తీసేశారు. 100 కోట్ల యూజర్లకోసం.. పనిచేసే వాట్సాప్ లో ప్రస్తుతం పనిచేస్తున్నవారి సంఖ్య కేవలం 55 మంది మాత్రమే అంటే నమ్మాల్సిందే.
ఒక్కరోజులో వాట్సప్ ఒక్కరోజులో 14 వేలకోట్ల సందేశాలను డెలివరీ చేస్తోంది. గంటకు 583 కోట్లు, నిమిషానికి 9.7 కోట్లు, సెకనుకు 16 లక్షల సందేశాలు వాట్సాప్ ద్వారా వెళ్తున్నాయి. వాట్సాప్ రోజువారీ ఆదాయం అక్షరాలా రూ.197.5కోట్లు, వార్షిక ఆదాయం రూ.72,102 కోట్లు.