Dinesh Akula : జర్నలిజంలో 30 వసంతాలు పూర్తి చేసిన దినేష్ ఆకుల
- By Sudheer Published Date - 07:22 PM, Wed - 10 January 24

డా. ప్రసాద్ మూర్తి
|| హ్యాట్సాఫ్ యూ దినేష్ జీ! ||
ప్రతిభ, పట్టుదల, అపార పరిజ్ఞానం, నిరంతర పరిశ్రమ ఎవరినైనా తాము ఎంచుకున్న రంగంలో విశిష్ట స్థానానికి ఎదగడానికి పునాదిరాళ్లుగా పనిచేస్తాయి. పాత్రికేయ రంగంలో చిన్నతనంలోనే ప్రవేశించి, అంచెలంచెలుగా ఎదిగి, అనేక భాషల్లో తన ప్రజ్ఞా పాటవాలతో, అలుపెరుగని కృషితో తనదైన ముద్ర వేసిన అపురూపమైన అద్భుతమైన జర్నలిస్టు దినేష్ ఆకుల. నిజాయితీ నిబద్ధత కలిగిన ప్రతిభావంతులకు భాష ఒక అడ్డంకి కాదని నిరూపించిన జర్నలిస్టు దినేష్. ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తెలుగు, బంగ్లా భాషలలో మీడియా రంగంలో ఎన్నో బాధ్యతలను నిర్వహించి తనను తాను ఒక అద్వితీయ పాత్రికేయునిగా మలుచుకున్నారు దినేష్. ప్రస్తుతం హ్యాష్ టాగ్ యు అనే డిజిటల్ న్యూస్ ప్లాట్ ఫామ్ కి ఫౌండర్ సీఈవోగా తన సేవలను కొనసాగిస్తున్న దినేష్ గారు సరిగ్గా 30 సంవత్సరాల క్రితం అంటే జనవరి 1994లో ఆయన తన పాత్రికేయ ప్రస్థానాన్ని సెంట్రల్ క్రానికల్ లో రిపోర్టర్ గా ప్రారంభించారు. అంటే ఆయన మీడియా రంగంలో అడుగుపెట్టి నేటికి 30 సంవత్సరాలు పూర్తవుతుంది. పాత్రికేయ వృత్తిలో నీతి నియమాలు, నిజాయితీ నిబద్ధత కొరవడుతున్న ఈ రోజుల్లో, దినేష్ గారి లాంటి నిబద్ధతగల నిజాయితీపరులైన జర్నలిస్టుల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
వన్ అండ్ ఓన్లీ దినేష్ :
మీడియా రంగంలో మొదటి అడుగు వేసింది మొదలు తన క్రియేటివ్ సామర్థ్యం, పరిశీలనా దృక్పథం, అవగాహనా నైపుణ్యం, పరిశోధనా ప్రావీణ్యం, ప్లానింగ్ మరియు మానిటరింగ్ శక్తితో అతి తక్కువ కాలంలోనే సాటిలేని మేటి జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్నారు దినేష్. ఎక్కడో ఛత్తీస్గఢ్లోని రాయపూర్ లో తన మీడియా ప్రస్థానాన్ని ప్రారంభించి ఎన్నో మీడియా సంస్థల్లో కీలక పాత్ర పోషించి, తాను పనిచేసిన ప్రతి సంస్థకీ ఎనలేని వన్నెతెచ్చిన మచ్చలేని జర్నలిస్టు ఆయన. బహుభాషా కోవిదునిగా రిపోర్టింగ్ లో, స్క్రిప్ట్ రైటింగ్ లో, కోఆర్డినేషన్లో, ప్లానింగ్ లో, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో, రాజకీయ సామాజిక కార్యక్రమాల, ప్రకృతి విలయాల కవరేజ్ లో, న్యూస్ బులిటెన్ లు, గ్రాఫిక్స్ డిజైనింగ్, ప్రోగ్రామింగ్, ఎలక్షన్ కవరేజ్ మొదలైన రంగాలలో తనదైన వినూత్న పంథాను ప్రవేశపెట్టి ఎక్కడున్నా దటీజ్ దినేష్ ఆకుల అనిపించుకున్నారు. దేశ విదేశాలలో పర్యటించి అనేక సందర్భాలలో తన విశిష్టమైన న్యూస్ కవరేజ్ తో అత్యాధునిక జర్నలిస్టుగా ఆయన పేరు తెచ్చుకున్నారు.
దినేష్ ఆకుల ప్రస్థానం:
ఛత్తీస్ గఢ్ లోని రాయపూర్ లో సెంట్రల్ క్రానికల్ లో 1994 జనవరిలో రిపోర్టర్ గా దినేష్ తన ప్రస్థానాన్ని ప్రారంభించి, మార్చి 2000 సంవత్సరం వరకు పనిచేశారు. మార్చి 2000 నుంచి పది నెలల పాటు హైదరాబాదులో ఈనాడు టెలివిజన్లో బహుభాషలలో తన స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్ సేవలను అందించి దేశవ్యాప్తంగా విలేకరులను అనుసంధానించి పోస్ట్ ప్రొడక్షన్ బాధ్యతను ఎంతో దక్షతగా నిర్వహించారు. డిసెంబర్ 2000 నుంచి జనవరి 2000 వరకు రాయపూర్ లో హెచ్ టి మీడియా గ్రూప్ కు స్టాఫ్ రిపోర్టర్ గా వ్యవహరించి ఎంతో విలువైన సేవలను అందించారు. ఆ కాలంలో ఆయన బాల్యవివాహాల మీద అందించిన రిపోర్టింగ్, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన పాలసీని రూపకల్పన చేసేందుకు దోహద పడింది. ఆ సందర్భంగా దినేష్ గారు పొలిటికల్ మరియు బ్యూరోక్రసీ వార్తలను అత్యంత సమర్థంగా నిర్వహించి ఎంతో మంచి పేరు సాధించుకున్నారు. 2003 జనవరి నుంచి 2007 డిసెంబర్ వరకు ఐదు సంవత్సరాల పాటు ఆయన ఏబీపీ న్యూస్ నెట్వర్క్ కు చత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్ బ్యూరో ఇన్ ఛార్జిగా విశేషమైన సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో నక్సలైట్ కార్యకలాపాలు, బాల్యవివాహాలు, బాల కార్మికులు, ఆదివాసీల స్థితిగతులు, రైతులు ఆత్మహత్యలు మొదలైన ఎన్నో కీలక రంగాలలో దినేష్ గారు చేసిన కృషి మీడియా రంగంలో మరుపురాని సంచలనం. ఆ సందర్భంగా చత్తీస్గడ్ ముఖ్యమంత్రి అజిత్ జోగి క్యాష్ ఫర్ ఎమ్మెల్యే స్కామ్ ని బట్టబయలు చేసి ఆయన సృష్టించిన సంచలనం ఎప్పటికీ మరువలేనిది. ఆ సందర్భంగా ఆయన అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యు బుష్ హైదరాబాద్ సందర్శించినప్పుడు, ఆఫ్గనిస్తాన్ ప్రెసిడెంట్ హమీద్ ఖర్జాయి ఆంధ్రప్రదేశ్ పర్యటించినప్పుడు విశేషమైన కవరేజ్ ని అందించి ఎనలేని గుర్తింపు పొందారు. అదే సమయంలో 2004 నుంచి కొనసాగిన ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ విశేషాలను ఆయన అద్భుతంగా కవర్ చేసి తన సత్తా చాటుకున్నారు. క్రికెట్ కి సంబంధించిన చాలా విశేషమైన ఘట్టాలను ఆయన అద్భుతంగా కవర్ చేసిన నేపథ్యం ఉంది. అనేక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికలను ఆయన తనదైన శైలిలో కవర్ చేశారు. దక్షిణ భారతాన్ని అతలాకుతలం చేసిన సునామీ బీభత్సాన్ని ఆయన కవర్ చేసిన తీరుతెన్నులు మరువలేనివి. హైదరాబాదులో వెలుగు చూసిన యుథినేసియా కేసుకు చెందిన వార్తా కథనాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. 2005లో తమిళనాడు కర్ణాటక వరద బీభత్సాన్ని, 2006లో బిజెపి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాలు, కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలపై ఆయన ఎంతో నేర్పుగా పరిశోధనాత్మకంగా నివేదికలను ఇచ్చారు. అదే సందర్భంలో రెండు నెలల పాటు కలకత్తాలో స్టార్ ఆనందో అనే స్టార్ న్యూస్ బెంగాలీ ఛానల్ కు రిపోర్టింగ్ సెక్షన్ లో విశేష సేవలు అందించారు.
2008 ఫిబ్రవరి నుంచి మూడు నెలలపాటు స్టార్ న్యూస్ న్యూఢిల్లీ ఏరియా పొలిటికల్ కరస్పాండెంట్ గా కేంద్ర ప్రభుత్వ అధికార పార్టీ కాంగ్రెస్ కార్యక్రమాలను, విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యకలాపాలను విశేషంగా కవర్ చేశారు. 2008 నుంచి 2010 వరకు రెండు సంవత్సరాల పైగా దినేష్ గారు టీవీ9 చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ గా దాదాపు 5 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న టీవీ9 గ్రూప్ కి చెందిన ఐదు చానల్స్ కి చీఫ్ కోఆర్డినేటర్ గా వ్యవహరించి తన అద్భుతమైన ప్లానింగ్ కెపాసిటీతో ఆ సంస్థకే గుండెకాయలా వ్యవహరించారు. వివిధ భాషల్లో రిపోర్టర్లను, స్టింగర్లను ఏర్పాటు చేసి అన్ని రకాల న్యూస్ మేనేజ్మెంట్లో తన అద్వితీయమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి సంస్థ యాజమాన్యం దృష్టినే కాక టీవీ9 అభిమానుల అందరి ప్రేమను చూరగొన్నారు. 2010 జూన్ నుంచి ఆరు నెలల పాటు టీవీ9 ఇన్ పుట్ ఎడిటర్ గా ప్లానింగ్ లోను, అసైన్మెంట్ డెస్క్ లోను ఓవరాల్ ఇన్చార్జిగా తన విశేషమైన సేవలను అందించారు. రిపోర్టర్ల కార్యక్రమాలు, ఎడిటోరియల్ స్టాఫ్ పని విధానాలు, కంటెంట్ రూపకల్పన, నిర్దేశిత కార్యక్రమాల నిర్వహణ, ఛానల్ సమస్త అంశాలను కోఆర్డినేట్ చేసే అత్యంత కీలకమైన బాధ్యతను ఆయన అత్యంత సమర్థంగా నిర్వహించి, అతి తక్కువ కాలంలోనే తెలుగు మీడియా రంగంలో ప్రజ్ఞా విశేషాలు గల పాత్రికేయునిగా పేరు సంపాదించారు. అనేక కార్యక్రమాల రూపకల్పనలో, ఛానల్ రీచ్ పెంచడంలో, ఛానల్ స్థాయిని, గుర్తింపును గణనీయంగా పెంచడంలో ఆయన అనుసరించిన వ్యూహాత్మక నిర్ణయాలు టీవీ9 అభివృద్ధిలో అత్యంత కీలకమైనవిగా చెప్పుకోవాలి. 2010 నుంచి 2014 వరకు నాలుగు సంవత్సరాలు పైగా టీవీ9 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఆయన అద్భుతమైన ప్రతిభా నైపుణ్యాలతో ఛానల్ కు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఎన్నికల కవరేజ్లో 3d హోలోగ్రామ్ టెక్నాలజీని మొదటిసారి ప్రాంతీయ మీడియా రంగంలో ఆయన ఆధ్వర్యంలోనే ప్రవేశ పెట్టడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆన్లైన్ గ్రాఫిక్స్ అత్యంత ఆధునికంగా వినూత్నంగా ప్రయోగాత్మకంగా ఆయన మలిచిన తీరు ఎప్పటికీ ఆ ఛానల్ కు పెట్టని కోటలుగా చెప్పుకోవాలి. ఆయన సమర్థవంతమైన సారధ్యంలో టీవీ9 లో 30 మినిట్స్ లాంటి ఎన్నో ప్రజాదరణ కలిగిన కార్యక్రమాలు కొనసాగాయి. ఎన్నో కొత్త కార్యక్రమాలకు ఆయన రూపకల్పన చేశారు. ఆయన సారధ్యంలో వార్తా కథనాలు, అనేక కార్యక్రమాలు ఎన్నో అవార్డులు గెలుచుకున్నాయి. టీవీ9 న్యూస్ ఛానల్ కి ఆరు సంవత్సరాల ఎనిమిది నెలలపాటు దినేష్ ఆకుల అందించిన ప్రయోగాత్మక, సంచలనాత్మక, క్రియాశీలక సేవలు కారణంగా ఆ ఛానల్ అద్వితీయ స్థానానికి చేరుకుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టీవీ9 ఛానల్ సాధించిన ప్రగతిలో దినేష్ ఆకుల స్థానం విడదీయరానిది అని చెప్పాలి.
2014 నుంచి 2016 వరకు సుమారు ఏడాదిన్నర పాటు ఆయన ఎక్స్ ప్రెస్ టీవీ న్యూస్ ఛానల్ కి ఎక్స్ప్రెస్ టీవీ వెబ్సైట్ కి, తెలుగు ఇంగ్లీష్ భాషలలో ఛానల్ హెడ్ గా వ్యవహరించి ఆయన నిర్వహించిన పాత్ర అనన్యసామాన్యమైనదిగా చెప్పవచ్చు. ఆ ఛానల్ డిజిటల్ ప్లాట్ ఫామ్, యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్స్ వంటి అనేక వేదికలను ఆయన ఎంతో సమర్థవంతంగా నిర్వహించి ఆ ఛానల్ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు.
2016 నుంచి 2020 వరకు దాదాపు 4 సంవత్సరాలు పాటు ఆయన టీవీ5 గ్రూపు ఎడిటర్ గా నిర్వహించిన బాధ్యతలు అమూల్యమైనవి, అసాధారణమైనవి, అద్వితీయమైనవి అని చెప్పవచ్చు. ఆయన ఆధ్వర్యంలో టీవీ5 కన్నడ ఛానల్ ఏర్పాటు జరిగింది. రెండు భాషలలోనూ ఆయన తన ప్రతిభా ప్రావీణ్యాలతో టీవీ5 అత్యంత వేగవంతమైన సుస్థిర స్థానాన్ని సాధించడానికి చేసిన అనితర సాధ్యమైన కృషి ఎవరూ మరువలేరు. టీవీ ఫైవ్ సాధించిన ఘనత, గడించిన కీర్తి, ఆ చానల్ అభివృద్ధిలో దినేష్ ఆకుల స్థానం విశేషమైనది. ఆ తరువాత ఆయన 2020 ఏప్రిల్ నుండి ఇప్పటివరకు హ్యాష్ టాగ్ యు డిజిటల్ వార్తా వేదికకు ఫౌండర్ సీఈఓ గా విశేషమైన సేవలు అందిస్తున్నారు. హ్యాష్ టాగ్ యు వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్ దినేష్ గారి అనన్య సామాన్యమైన కార్య నిర్వహణ దక్షతలో అనతి కాలంలోనే మీడియాలో అశేష ప్రజాదరణ పొందుతూ సాటిలేని మేటి సంస్థగా ముందుకు కొనసాగుతోంది.
దినేష్ విజయ సోపానాలు:
దినేష్ గారు తన అద్భుత ప్రతిభా సంపత్తితో ఎన్నో విజయాలు, పురస్కారాలు సాధించారు. 2007లో ఆయన బ్రిటిష్ ప్రభుత్వం నుంచి షెవనింగ్ స్కాలర్షిప్ పొందారు. అమెరికా జర్నలిస్టుల విదేశాంగ విధానానికి అంతర్గతంగా ఆయన 2018లో ఐవీఎల్పి ఫెలోషిప్ అందుకున్నారు. జర్నలిజం లో గ్రాడ్యుయేషన్ చేసి, డిఫెన్స్ స్టడీస్ లో మాస్టర్ డిగ్రీ పొంది ఒక గొప్ప టీం లీడర్ గా జర్నలిజాన్ని అత్యాధునిక మార్గం వైపు నడిపించిన ఘనత దినేష్ గారిది. బ్రిటిష్ ప్రభుత్వ హై కమిషన్ నుంచి యంగ్ ఇండియన్ లీడర్ గా ఆయన గుర్తింపు పొందారు. దాదాపు డజను పైగా ఆయన న్యూస్ టెలివిజన్ అవార్డులను అందుకున్నారు. 2017లో జర్నలిజంలో అత్యున్నతమైన రామ్ నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ అవార్డును ఆయన కైవసం చేసుకున్నారు. ఇలా దినేష్ గారి ప్రస్థానంలో లెక్కకు మించిన మైలురాళ్లు ఎన్నో ఉన్నాయి.
ఒకటి రెండు సంవత్సరాలు కాదు దినేష్ ఆకుల అనే ఒక అద్భుత జర్నలిస్టు వెనుక ఇంత సుదీర్ఘ ప్రస్థానం ఉంది. ఇదంతా ఆయన నిర్విరామ కృషి, నిజాయితీ, నిబద్ధత, నిరంతర పరిశ్రమల కారణంగా సాధ్యమైందని చెప్పాలి. అందుకే దినేష్ ఆకుల వన్ అండ్ ఓన్లీ అంటే అతిశయోక్తి లేదు. ఇప్పటి తరానికి రానున్న తరానికి దినేష్ గారి వంటి మేధోసంపన్నులైన జర్నలిస్టుల ప్రస్థానం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమైనది. 30 సంవత్సరాలు పాటు సుదీర్ఘమైన తన ప్రస్థానాన్ని నిరంతరాయంగా కొనసాగించి మరింత ఉత్సాహంతో దూసుకు వెళ్తున్న దినేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులో ఆయన మరిన్ని మైలురాళ్లు దాటాలని, మరెన్నో విజయ సోపానాలు అధిరోహించాలని కోరుకుందాం. హాట్సాఫ్ యూ దినేష్ జీ.
Read Also : IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ టెస్ట్..ఫ్రీ ఎంట్రీ.. ఫ్రీ ఫుడ్