Ambedkar Jayanti : ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి.. బాల్యం నుంచి భారతరత్న దాకా కీలక ఘట్టాలివీ
అంబేడ్కర్(Ambedkar Jayanti) 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మౌలో రామ్‌జీ మలోజీ సక్పాల్, భీమాబాయిల దంపతులకు జన్మించారు.
- By Pasha Published Date - 05:16 PM, Sun - 13 April 25

Ambedkar Jayanti : డాక్టర్ బాబాసాహెబ్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేడ్కర్.. ఇది ఒక సర్వసాధారణ పేరు కాదు. మహోన్నత ఉద్యమ గీతం. వందల కోట్ల భారతీయుల గుండె చప్పుడు ఈ పేరు. భారతావనిలోని అణగారిన వర్గాలకు తన తిరుగులేని విజన్‌తో అభివృద్ధి బాటను ప్రసాదించిన దార్శనికుడు అంబేడ్కర్. అందుకే ఎప్పటికీ ఈ పేరు యావత్ భారతీయుల గుండెల్లో నిలిచి ఉంటుంది. ఏప్రిల్ 14న ఆ మహనీయుడి జయంతి. ఈసందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత జీవిత ప్రయాణంలోని కీలక ఘట్టాల గురించి తెలుసుకుందాం..
Also Read :Jana Reddy Vs Rajagopal Reddy: జానాపై రాజగోపాల్ ఫైర్.. ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది ?
అంబేడ్కర్ బాల్యం నుంచి భారతరత్న దాకా..
- అంబేడ్కర్(Ambedkar Jayanti) 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మౌలో రామ్‌జీ మలోజీ సక్పాల్, భీమాబాయిల దంపతులకు జన్మించారు. మౌ ప్రాంతం పేరును అంబేడ్కర్ నగర్‌గా మార్చారు.
- అంబేడ్కర్ తండ్రి రామ్‌జీ ఒక మిలిటరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు.
- 1904లో అంబేడ్కర్ కుటుంబం మౌ నుంచి ముంబైకి వెళ్లిపోయింది.
- 15 ఏళ్ల వయసులో 1906లో 9 ఏళ్ల రమా బాయితో అంబేడ్కర్‌కు పెళ్లయింది.
- 1907లో అంబేడ్కర్ పదోతరగతి పూర్తి చేశారు.
- 1912లో ముంబై యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. తర్వాత బరోడా రాజ్యంలో అంబేడ్కర్‌కు ప్రభుత్వం ఉద్యోగం వచ్చింది.
- 1913లో బరోడా మహారాజు సాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన ఉపకార వేతనంతో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య కోసం అంబేడ్కర్ వెళ్లారు.
- ‘భారతదేశంలో కులాలు’ అనే అంశంపై 1916లో కొలంబియా వర్సిటీకి ఒక వ్యాసాన్ని అంబేడ్కర్ సమర్పించారు.
- 1916లోనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో అంబేడ్కర్ చేరారు.
- బరోడా రాజు ఇచ్చే స్కాలర్‌షిప్ టైం ముగియడంతో.. 1917లో భారత్‌కు అంబేడ్కర్ తిరిగొచ్చారు.
- 1918లో ముంబైలోని ఒక కాలేజీలో ప్రొఫెసర్‌గా చేరారు.
- 1923లో అంబేడ్కర్ ముంబైలో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించారు.
- 1927లో ముంబై లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఆయన నామినేట్ అయ్యారు.
- 1930లో మొదటి రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు లండన్‌కు అంబేడ్కర్ వెళ్లారు.
- 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని అంబేడ్కర్ స్థాపించారు.
- 1942 నుంచి 1946 వరకు వైస్రాయి కౌన్సిల్‌లో లేబర్ మెంబర్‌గా అంబేడ్కర్ వ్యవహరించారు.
- 1947లో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక.. తొలి న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ఛైర్మన్‌గా అంబేడ్కర్ సేవలు అందించారు.
- అంబేడ్కర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది.
- 1956 డిసెంబర్ 6న అంబేడ్కర్ తుదిశ్వాస విడిచారు.
- వీపీ సింగ్ ప్రభుత్వం 1990లో అంబేడ్కర్‌కు ‘భారత రత్న’ ప్రకటించింది.
Also Read :AB Venkateswara Rao: రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వర రావు.. ఆ పార్టీలోకి ఎంట్రీ ?
అంబేడ్కర్ పుస్తకం వల్లే.. ఆర్‌బీఐ ఏర్పాటు
విద్యార్థి దశలో 32 ఏళ్ల వయసులో అంబేడ్కర్ రాసిన “ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ” పుస్తకం భారత ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా నిలిచింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ డిగ్రీ కోసం ఈ బుక్‌ను ఆయన రాశారు. 1923లో లండన్‌లో ఈ పుస్తకాన్ని అంబేద్కర్ వెలువరించారు. దీనిపై జరిగిన చర్చలు అనంతర కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు బాటలు వేశాయి. భారత రిజర్వు బ్యాంకు 1935 ఏప్రిల్ 1న ఏర్పాటైంది.