Ananthagiri Hills: తెలంగాణ ఊటీ.. మన ‘అనంతగిరి’
అసలే కరోనా.. హాయిగా ఫ్యామిలీతో అలా బయటకు వెళ్లి, ఎంజాయ్ చేద్దామనుకున్నా గడప దాటలేని పరిస్థితి.. కనీసం స్వేచ్ఛగా గట్టిగా గాలిని సైతం పీల్చుకోని ప్యాండమిక్ స్టేజ్..
- By Balu J Published Date - 07:53 PM, Fri - 28 January 22

అసలే కరోనా.. హాయిగా ఫ్యామిలీతో అలా బయటకు వెళ్లి, ఎంజాయ్ చేద్దామనుకున్నా గడప దాటలేని పరిస్థితి.. కనీసం స్వేచ్ఛగా గట్టిగా గాలిని సైతం పీల్చుకోని ప్యాండమిక్ స్టేజ్.. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికే పరిమితమయ్యామని తెగ ఫీల్ అవుతున్నారా.. అయితే డోన్ట్ వర్రీ.. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోండి ఎంచక్కా రోజంతా ఎంజాయ్ చేయొచ్చు. కేవలం హైదరాబాద్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి వెళ్తే చాలు కొత్త లోకంలో విహరించవచ్చు.
రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘అనంతగిరి కొండలు’ ప్రకృతి అందాలకు నెలవు. దాదాపు 3,763 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అడవి అందాలతో అబ్బుర పరుస్తోంది. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఉన్న ఈ ప్రాంతంలోని కొండలు, అడవి అందాల మధ్య 1300 సంవత్సరాల చరిత్ర గల ‘అనంత పద్మ నాభస్వామి ఆలయం’ అందరినీ ఆకర్షిస్తోంది. అనంతగిరిని ‘తెలంగాణ ఊటీ’గా చెప్పవచ్చు. ఈ కొండల పైనుండి నీరు ఒస్మానాసాగర్ మరియు అనంత సాగర్‌కు ప్రవహిస్తాయి. ఇక్కడి అడవులు తెలంగాణ రాష్ట్రంలోనే దట్టమైనవి. హైదరాబాదు నుండి ప్రవహిస్తున్న మూసీ నదికి అనంతగిరి కొండలే జన్మస్థానం.

ఆలయ చరిత్ర
దట్టమైన అనంతగిరి హిల్స్ లోని మరొక ప్రధాన ఆకర్షణ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం. ఇది దాదాపు 400 ఏళ్ళ క్రితానికి చెందినది. మహారుషి ముచికుందునికి శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభుని రూపంలో దర్శన మిచ్చిన ప్రదేశమిది. పద్మనాభుడు లింగాకృతిలో ఉన్న దేవాలయం జగత్తులో ఇదొక్కటేనని పండితులు చెబుతుంటారు. మూసీ నది దేవాలయానికి సమీపంలోనే పుట్టింది. చాలా మంది మొదటగా ఈ ఆలయాన్ని సందర్శించిన తరువాత ట్రెక్కింగ్ కి బయలుదేరతారు.
ట్రెక్కింగ్, సైక్లింగ్
ట్రెక్కింగ్ అనంతగిరి హిల్స్ మొదటి సారి ట్రెక్కింగ్ అనుభవాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారికి అనువైన ప్రదేశం. ట్రెక్కింగ్ లో అందమైన ప్రకృతి పర్యాటకుల మనస్సు దోచుకుంటుంది. అనంతగిరి ప్రాంతం లో ఎన్నో చిన్న చిన్న కొండలు ఉన్నాయి. ఇవి అన్నీ ట్రెక్కింగ్ లో సందర్శించే అవకాశం కలదు. పర్యాటకుల తాకిడి పెరగడంతో ఇక్కడ స్లైకింగ్ చేసే అవకాశం ఉంది. కేవలం వందరూపాయలు లోపు చెల్లిస్తే చాలు సైకిల్ పై అనంతగిరి కొండల్లో తిరగేయొచ్చు. అనంతగిరిలో దట్టమైన అడవులు ఉండటంతో తరచుగా షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. ఇక్కడ బాలీవుడ్ సినిమాల మొదలుకొని టాలీవుడ్ వరకు ఎన్నో సినిమాలు షూటింగ్ జరుపుకుంటాయి. అంజి, దేవిపుత్రడు, జయం సినిమాల మొదలుకొని ప్రస్తుతం ‘కొండపొలం’ లాంటి ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకోవడం విశేషం.

మూసీ పుట్టుక
ఆలయానికి దిగువన ఉన్న లోతైన లోయలో భవనాశి అనే పుష్కరిణి ఉంది. అక్కడికి వెళ్లడానికి సుమారు వందమెట్లు దిగి వెళ్లాలి. ఈ పుష్కరిణినే మూసీనది జన్మస్థానంగా చెబుతారు. ఈ నది ఓ చిన్నపాయగా ప్రారంభమై హైదరాబాద్ నగరంలో ప్రవహించి అనంతరం నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తోంది.
ఇలా చేరుకోవచ్చు
హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుండి ప్రతి అర గంటకు వికారాబాద్ వెళ్లే బస్సులుంటాయి. వాటితో పాటు తాండూరు, కర్ణాటక వెళ్లే సర్వీసులు సైతం అక్కడి నుంచే వెళ్తాయి. అనంతగిరి వెళ్తే తాండూరులోని కోట్ పల్లి ప్రాజెక్టును కూడా వీక్షించవచ్చు.
