Tamil Nadu CM Stalin : కేసీఆర్, ఉద్దవ్ ఠాక్రే బాటలో స్టాలిన్.. గవర్నర్ అధికారాలు ప్రభుత్వానికే దక్కేలా అడుగులు!
తమిళనాడులో ఎవరూ ఊహించని పరిణామం ఒకటి చోటుచేసుకుంది. గవర్నర్ కు ఉన్న అధికారాల్లో ఒకదానిని సొంతం చేసుకునేలా ముఖ్యమంత్రి స్టాలిన్ పావులు కదిపారు.
- By Hashtag U Published Date - 12:08 PM, Tue - 26 April 22

తమిళనాడులో ఎవరూ ఊహించని పరిణామం ఒకటి చోటుచేసుకుంది. గవర్నర్ కు ఉన్న అధికారాల్లో ఒకదానిని సొంతం చేసుకునేలా ముఖ్యమంత్రి స్టాలిన్ పావులు కదిపారు. విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారం గవర్నర్ కే ఉంటుంది. ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వానికే దక్కేలా తమిళనాడు ప్రభుత్వం శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టాలను సవరించేలా ఈ బిల్లు ఉంది.
తెలంగాణ, మహారాష్ట్రలోనూ గవర్నర్ల పాత్రపైనా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసంతృప్తితో ఉన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి మించిన అధికారాలు గవర్నర్లకు ఎలా ఇస్తారన్న విమర్శలున్నాయి. అందుకే తమిళనాడు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే అది ఉన్నత విద్యపై ప్రభావం చూపుతుందని సీఎం స్టాలిన్ ఆరోపించారు.
సాధారణంగా సెర్చ్ కమిటీ సిఫార్స్ చేసినవారిలో ఒకరిని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా గవర్నర్ నియమిస్తారు. కానీ తమిళనాడులో అలా జరగడం లేదు. అందుకే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లో సెర్చ్ కమిటీ విధానాన్నే అవలంభిస్తున్నప్పుడు తమిళనాడులో మాత్రం దీనికి వ్యతిరేకంగా గవర్నర్ ఎలా వ్యవహరిస్తారని స్టాలిన్ వాదిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై మాజీ చీఫ్ జస్టిస్ మదన్ మోహన్ పుంఛీ కమిషన్-2010 నివేదికను స్టాలిన్ ప్రస్తావించారు. యూనివర్సిటీల ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్లను తొలగించాలని గతంలో ఈ కమిషన్ చెప్పింది.
డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీ ఆమోదించిన దాదాపు 10 బిల్లులు తమిళనాడు రాజ్ భవన్ లో ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. వీటిలో అఖిళ భారత వైద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్ కు రాష్ట్ర మినహాయింపునకు సంబంధించిన బిల్లు కూడా ఉంది. పైగా యూనివర్సిటీల వీసీల పోస్టులకు సెర్చ్ కమిటీ చేసిన సిఫార్స్ లను తమిళనాడు గవర్నర్ కొన్నాళ్లుగా తిరస్కరిస్తున్నారు. అందుకే స్టాలిన్ కేసీఆర్, ఉద్దవ్ ఠాక్రే రూట్ లో వెళుతున్నారు.