Karnataka CM : కర్ణాటకలో సీఎంను మార్చే యోచనలో బీజేపీ.. ఆర్ఎస్ఎస్ ఏం చెప్పిందంటే..?
కర్ణాటకలో బీజేపీ.. పార్టీ పరంగా ఇప్పటికీ పటిష్టంగా లేదు. అందుకే నాలుగుసార్లు పవర్ లోకి వస్తే.. అందులో ఒకసారి.. ఆపరేషన్ కమలను అమలు చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్, జనతాదళ్ నాయకులు..
- Author : Hashtag U
Date : 25-04-2022 - 10:45 IST
Published By : Hashtagu Telugu Desk
కర్ణాటకలో బీజేపీ.. పార్టీ పరంగా ఇప్పటికీ పటిష్టంగా లేదు. అందుకే నాలుగుసార్లు పవర్ లోకి వస్తే.. అందులో ఒకసారి.. ఆపరేషన్ కమలను అమలు చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్, జనతాదళ్ నాయకులు.. బీజేపీ గుర్తుపై పోటీ చేస్తే అప్పుడు ఆ సీట్లను సొంతం చేసుకుని ఇప్పుడు పవర్ ఉండగలుగుతోంది. కానీ మళ్లీ పవర్ లోకి రావాలంటే ఈ జిమ్మిక్కులు చాలవు. పూర్తిస్థాయిలో ఓటర్ల మనసు చూరగొనాల్సిందే. అందుకే ప్రభుత్వ వ్యతిరేకతను రూపుమాపడానికి, పార్టీని పటిష్టంగా చేయడానికి సీఎంను మార్చాలని భావిస్తోందని తెలుస్తోంది.
మిషన్ 150 పేరుతో ముందుకెళతామని అలా యడియూరప్ప ప్రకటించారో లేదో.. వెంటనే ఆయనను సీఎం సీటు నుంచి దింపేసింది అధిష్టానం. తరువాత ఆయనకు సన్నిహితుడిగా పేరు పడ్డ బొమ్మైని తీసుకువచ్చారు. ఆరోపణలు లేకుండానే ఎనిమిది నెలలుగా ఆయన పాలిస్తున్నారు. కానీ ఇంకా ఐదు మంత్రిపదవులను భర్తీ చేయలేదు. అధిష్టానం కూడా వీటి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అంతా సజావుగానే ఉన్నా.. ఇవేవీ మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా లేవు. అందుకే సీఎంను మారిస్తే.. బండి పరిగెడుతుందని హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం.
ఆర్ఎస్ఎస్ మాత్రం సీఎంను, కొందరు మంత్రులను మార్చాలని బీజేపీ హైకమాండ్ కు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. మరికొందరు మాత్రం.. పరిపాలనను ఇప్పుడిప్పుడే వేగవంతం చేస్తున్న సీఎంను మార్చకుండా.. సమర్థులకు ఉపముఖ్యమంత్రులుగా బాధ్యతలిస్తే సరిపోతుందని చెబుతున్నారు. మరి బీజేపీ పెద్దలు ఏం చేస్తారో ఈ నెలాఖరుకు తేలిపోతుంది.