Pray Only To Allah: మమ్ముట్టి కోసం మోహన్ లాల్ పూజలకు వక్రభాష్యం.. సంచలన డిమాండ్
ముస్లింగా ఉన్నవాళ్లు అల్లాను(Pray Only To Allah) మాత్రమే ప్రార్థించాలి’’ అని అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
- By Pasha Published Date - 11:09 AM, Thu - 27 March 25

Pray Only To Allah: కేరళకు చెందిన ప్రముఖ నటుడు మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్. ఆయన ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈనేపథ్యంలో మమ్ముట్టి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఈనెల (మార్చి) ప్రారంభంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ శబరిమలలో ప్రత్యేక పూజలు చేశారు. ఈవిషయాన్ని మీడియాతోనూ మోహన్ లాల్ చెప్పారు. అంతేకాదు.. శబరిమలలో నిర్వహించిన ఈ పూజలకు సంబంధించిన రసీదు కూడా బయటికి లీకైంది. అందులో మమ్ముట్టి పేరు మహ్మద్ కుట్టి అని రాసి ఉంది. దీన్ని చూసి ఓ వర్గం ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ముస్లిం వర్గానికి చెందిన మమ్ముట్టి పేరుతో హిందూ ఆలయంలో ఎందుకు పూజలు చేశారని పలువురు ప్రశ్నించడం మొదలుపెట్టారు.
Also Read :Ram Navami 2025: శ్రీరామ నవమి రోజున అయోధ్యలో కార్యక్రమాలివీ..
మమ్ముట్టి క్షమాపణ చెప్పాలి : జర్నలిస్ట్ ఒ.అబ్దుల్లా
‘‘ఈవిధంగా మీపేరుతో పూజలు నిర్వహించడాన్ని ఒక ముస్లింగా మీరు సమర్ధిస్తారా ?’’ అని మమ్ముట్టిని ఓ వర్గం వారు నిలదీశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగానూ నెటిజన్ల నడుమ వాడివేడి చర్చ జరిగింది. దీనిపై క్షమాపణ చెప్పాలని మమ్ముట్టిని జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు ఒ.అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఈమేరకు ఒక ఆడియో క్లిప్‌ను అబ్దుల్లా విడుదల చేశారు. ‘‘తన పేరుతో శబరిమలలో పూజలు జరిపించాలని మోహన్ లాల్‌ను మమ్ముట్టి కోరారా ? ఒకవేళ అదే నిజమైతే.. అది ఇస్లామిక్ ధర్మానికి వ్యతిరేకమైన చర్య. ముస్లింగా ఉన్నవాళ్లు అల్లాను(Pray Only To Allah) మాత్రమే ప్రార్థించాలి’’ అని అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
Also Read :Heroine Private Video Leak : సోషల్ మీడియాలో నటి ప్రైవేటు వీడియో లీక్
మమ్ముట్టి కోసం పూజలు చేయిస్తే తప్పేంటి : మోహన్ లాల్
ఈ అంశంపై తాజాగా మోహన్ లాల్ స్పందించారు. ‘‘మమ్ముట్టి నాకు సోదరుడి లాంటి వారు. ఆయన పేరుతో పూజలు చేయిస్తే తప్పేంటి ? ఇప్పుడు మమ్ముట్టి బాగానే ఉన్నారు. చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చాయంతే. ఆందోళన చెందాల్సిన అవసరమేం లేదు’’ అని మోహన్ లాల్ వెల్లడించారు. ‘‘నేను మమ్ముట్టితో కలిసి 50కిపైగా సినిమాలు చేశాను. మేం ప్రతివారం ఒకసారి కలుస్తూనే ఉంటాం. రెండు,మూడు రోజులకోసారి మేం కాల్ చేసుకొని మాట్లాడుకుంటాం. మేం మంచి స్నేహితులం’’ అని ఆయన తెలిపారు. మరోవైపు మమ్ముట్టి ప్రస్తుతం రంజాన్ ఉపవాసాలను పాటిస్తున్నట్లు ఆయన టీమ్ వెల్లడించింది. మమ్ముట్టి ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేసింది.