Hindu youth hosts Iftar: ముస్లింలకు ఇఫ్తార్ పార్టీ ఇచ్చిన హిందూ పెళ్లికొడుకు
మంచితనం పరిమళించింది. అందుకే మతసామరస్యం వెల్లివెరిసింది. హిజాబ్, హలాల్, అజాన్ వంటి వివాదాలతో దద్దరిల్లిన కర్ణాటక గడ్డ.. ఓ హిందూ పెళ్లికొడుకు చేసిన పనితో పులకరించింది.
- By Hashtag U Updated On - 01:24 PM, Thu - 28 April 22

మంచితనం పరిమళించింది. అందుకే మతసామరస్యం వెల్లివెరిసింది. హిజాబ్, హలాల్, అజాన్ వంటి వివాదాలతో దద్దరిల్లిన కర్ణాటక గడ్డ.. ఓ హిందూ పెళ్లికొడుకు చేసిన పనితో పులకరించింది. దక్షిణ కన్నడ జిల్లాలోని బంత్వల్ తాలూకాలో విట్టల్ కు చెందిన హిందూ యువకుడు జె.చంద్రశేఖర్ చేసిన పనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా పెళ్లి చేసుకున్న వెంటనే ఆయన చేసిన పనే దీనికి కారణం.
చంద్రశేఖర్ ఈనెల 24న వివాహం చేసుకున్నారు. అయితే అందరికీ విందు ఇచ్చినా ఆయన స్నేహితుల్లో కొందరు ముస్లింలు మాత్రం దీనికి హాజరవ్వలేకపోయారు. ఎందుకంటే ఇది రంజాన్ మాసం కావడంతో వారంతా ఉపవాసాల్లో ఉన్నారు. దీంతో స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చే చంద్రశేఖర్.. తన ముస్లిం స్నేహితులు కూడా సంతోషంగా ఉండాలని తలచి.. వారికి మసీదులోనే ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశాడు.
చంద్రశేఖర్ చేసిన పనిని ఎవరూ ఊహించలేదు. హిజాబ్ వంటి వివాదాలతో వణికిపోయిన గడ్డపై మతసామరస్యానికి దోహదపడే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. అందుకే చంద్రశేఖర్ ను అందరూ అభినందిస్తున్నారు. పెళ్లి వేడుకలు అంటే అందరూ సంతోషంగా జరుపుకోవాలని.. అందుకే తన ముస్లిం స్నేహితులు కూడా ఆనందంగా ఉండడానికే ఇలా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశానన్నాడు ఈ కొత్త పెళ్లికొడుకు.
సమాజంలో వివిధ వర్గాలు సంతోషంగా కలిసి మెలిసి ఉండడానికి సహాయపడే ఇలాంటి మంచిపనికి శ్రీకారం చుట్టిన చంద్రశేఖర్ దంపతులను.. ఇఫ్తార్ పార్టీకి వచ్చినవారంతా నిండుమనసుతో ఆశీర్వదించారు. జలాలియా జూమా మసీద్ పెద్దలు ఈ కొత్త దంపతులను సత్కరించారు.
Related News

Iftar In Hindu Temple : హిందూ దేవాలయాల్లో ఇఫ్టార్ విందు
కేరళలోని హిందూ దేవాలయాల్లో ఇస్తోన్న ఇఫ్టార్ విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆ రాష్ట్రంలోని లక్ష్మీనరసింహమూర్తి ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఇప్టార్ విందుకు సుమారు 600 మంది హిందూ, ముస్లింలు హాజరయ్యారు. సహపక్తి విందును ఆరగించారు.