Mother Love: కూతురిని పోషించుకోవడానికి మగవాడిలా వేషం మార్చుకున్న తల్లి.. 30 ఏళ్లుగా…!
బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడంలో తండ్రి కన్నా తల్లి పాత్రే ఎక్కువ. దానికోసం ఎలాంటి త్యాగానికైనా అమ్మ మనసు సిద్ధపడుతుంది.
- By Hashtag U Published Date - 12:27 PM, Fri - 13 May 22

బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడంలో తండ్రి కన్నా తల్లి పాత్రే ఎక్కువ. దానికోసం ఎలాంటి త్యాగానికైనా అమ్మ మనసు సిద్ధపడుతుంది. భర్త తోడు లేకపోతే ఆమె తన పిల్లలతో సమాజంలో బతకడం చాలా కష్టం. కాకుల్లా పొడుచుకుతినేవారితో ఇబ్బందులు పెరుగుతాయి. తోడేళ్లలాంటి కొందరు మగాళ్లు కాచుకుని ఉంటారు. వారందరి బారి నుంచి తనను తాను కాపాడుకుంటూ తన బిడ్డలను రక్షించుకోవడం మాటలు కాదు. కానీ తమిళనాడుకు చెందిన పెచ్చియామ్మాల్ ను మాత్రం ఈ విషయంలో మెచ్చుకోవాలి. అమ్మగా ఉంటే బిడ్డలను పోషించడానికి కష్టం అవుతుందని.. నాన్నగా వేషం మార్చుకుంది
పెచ్చియామ్మాల్ కు 20 ఏళ్ల వయసులోనే పెళ్లయ్యింది. కానీ ఆమె దురదృష్టమో.. విధి లీలో కాని.. వివాహం అయిన 15 రోజులకే ఆమె భర్త చనిపోయాడు. కానీ అప్పటికే ఆమె గర్భవతి. భర్త మరణంతో ఏమీ దిక్కుతోచలేదు. ఆ సమయంలో చనిపోవాలని భావించినా.. కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆ పని చేయనివ్వలేదు. అందుకే చిన్న చిన్న పనులు చేస్తూ తన పొట్టపోసుకునేది. కానీ చుట్టూ ఉన్న మగతోడేళ్ల బారి
నుంచి తనను తాను కాపాడుకోవడం కష్టమయ్యేది. అందుకే వేరే దారిలేక వేషం మార్చింది.
సమాజంలో ఒంటరిగా బతకడం కష్టం. అందులోనూ ఒంటరి మహిళల పరిస్థితి మరీ దారుణం. అందుకే పెచ్చియామ్మాల్ ముందు తనను తాను శారీరకంగా, మానసికంగా దృఢంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. సెలూన్ కి వెళ్లి మగవాడిలా క్రాఫ్ మార్చుకుంది. దీంతో ఆమె చూడడానికి అచ్ఛం మగవాడిలా కనిపించింది. ఆ తరువాత శారీరకంగా బలంగా తనను తాను మార్చుకుంది. అక్కడి నుంచి చొక్కా, లుంగీ వేసుకునే తిరిగేది. అదే వస్త్రధారణతో పనిలోకి వెళ్లేది.
పెచ్చియామ్మాల్ ను చూసినవారు ఆమెను మగవాడిగానే భావించేవారు. అందుకే పెద్దన్నగా పిలుచుకునేవారు. అక్కడే ఓ హోటళ్లో పనిచేయడంతో ఆమెకు ముత్తు మాస్టర్ అని పేరు వచ్చింది. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ఏళ్ల పాటు అదే వేషధారణతో ఉంది. తన కూతురిని అదే మొండి ధైర్యంతో పెంచింది. ఆమెకు పెళ్లి చేసింది. ఆ అమ్మాయి పేరు షణ్ముక సుందరి.
తన తల్లి గురించి షణ్ముక సుందరి చాలా గర్వంగా భావిస్తుంది. తనను పెంచి పెద్ద చేయడానికే అమ్మ ఇలా కష్టాలు పడిందని చెబుతుంది. పనికి వెళ్లి వచ్చేటప్పుడు మగవారి నుంచి ఎదురైన చేదు అనుభవాలే అమ్మను ఇలా మగవాడిలా వేషం మార్చుకునేలా చేశాయంది. అయితే సర్టిఫికెట్స్ లో పురుషుడి పేరు ఉండడంతో ఆమెకు పెన్షన్ రావడం లేదు. అమ్మ వయసురీత్యా పెద్దదైంది. అందుకే ఈ సమయంలో పింఛను వస్తే ఆసరాగా ఉంటుందని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. తన బిడ్డ కోసం ఏకంగా తన మనసును రాయిలా మార్చుకుని.. వేషాన్నీ మార్చుకున్న ఆ తల్లికి నిజంగా వందనం.