Transgenders : ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు… తమిళనాడు హైకోర్టు సూచన
ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సముచిత స్థానం లభించనుంది. వారికి జాబ్స్‌లో ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది.
- By Hashtag U Published Date - 12:01 PM, Thu - 3 March 22

ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సముచిత స్థానం లభించనుంది. వారికి జాబ్స్‌లో ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. ఫిజికల్ ఫిట్‌నెస్ వంటి విషయాల్లో కొంత రిలాక్సేషన్ ఇవ్వాలని కూడా సిఫార్సు చేసింది. వయసు ఇతర విషయాల్లో బీసీలు, ఇతర వర్గాలకు ఇచ్చే మినహాయింపులను కూడా వర్తింపజేయాలని తెలిపింది.
ఇక నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్లలో ట్రాన్స్‌జెండర్ల కోటా అంటూ ప్రత్యేకంగా కొన్ని పోస్టులను కేటాయించే అవకాశం ఉంది. రిజర్వేషన్ల పర్సెంటేజ్‌ను కూడా క్లియర్‌గా చెబుతారు. తమిళనాడులో పోలీసు కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా ఈ సూచనలు చేసింది. ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు ఇవ్వవచ్చంటూ గతంలో సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడిన విషయాన్ని గుర్తు చేసింది.
సుప్రీంకోర్టు చెప్పినదానిని తమిళనాడు ఇచ్చిన నోటిఫికేషన్‌లో అమలు చేయలేదని, అందువల్ల ఆ ఆదేశాలకు అనుగుణంగా ఇకపై ఉద్యోగాల ప్రకటనలు ఉండాలని తెలిపింది. కొంతమంది ట్రాన్స్‌జెండర్లు తమ అప్లికేషన్‌లలో జండర్ అన్న దగ్గర మహిళలు అని రాస్తున్నారు. దాంతో వారికి మహిళల కోటాలో ఉద్యోగాలు ఇవ్వడాన్ని పరిశీలిస్తున్నారు.
ఇకపై వారు ట్రాన్స్‌జెండర్ కోటా అని రాయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
ఏవో సాకులు చెప్పి వారికి రిజర్వేషన్లు తిరస్కరించకూడదని, అందరి మాదిరిగానే రిలాక్సేషన్లు ఇచ్చి, అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ట్రాన్స్ జెండర్లకు కూడా ఇకపై ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. ఇప్పటికే సరైన ఉపాధి అవకాశాలు లేక.. కుటుంబం పరంగా, సమాజం పరంగా అవమానాలను ఎదుర్కొంటున్న ట్రాన్స్ జెండర్లకు ఇకనైనా వారి కాళ్లపై వారు నిలబడడానికి అవకాశాలు పెరుగుతాయి.