Hijab Issue : హిజాబ్ వివాదం ముదరకుండా కర్ణాటక ప్రభుత్వం ప్లాన్
స్కూళ్లు, కాలేజీలకు ఇంతవరకు పరిమితమైన హిజాబ్ వివాదం.. శాంతి భద్రతల సమస్యగా మారకుండా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తయింది.
- Author : Hashtag U
Date : 22-02-2022 - 10:50 IST
Published By : Hashtagu Telugu Desk
స్కూళ్లు, కాలేజీలకు ఇంతవరకు పరిమితమైన హిజాబ్ వివాదం.. శాంతి భద్రతల సమస్యగా మారకుండా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తయింది. శివమొగ్గలో భజరంగ దళ్ కార్యకర్త హత్యకు గురయిన అనంతరం మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ సమస్యపై విద్యా సంస్థల వద్ద ఎవరూ గుమికూడకుండా ఆంక్షలు పెట్టింది. బెంగళూరు సహా ఇతర జల్లాల్లో ఇవి మార్చి ఎనిమిదో తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి.
బయటవారెవరూ విద్యా సంస్థల వద్దకు రాకుండా నిషేధించడం ఇందులో ముఖ్యమైనది. అక్కడ ఎవరూ చేరకుండా వారి మధ్య మాటామాట పెరగకుండా ఉండడానికే ఈ రూల్స్ తీసుకొచ్చింది. మరోవైపు కర్ణాటక హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. హిజాబ్ ధరించిన వారిపై కఠినంగా వ్యవహరించబోమని ఇప్పటికే ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వారికి ఇబ్బంది కలిగించే చర్యలు ఉండబోవని పేర్కొంది.
హిజాబ్ ధరించడం రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు కిందకు వస్తుందా, రాదా చెప్పాలని హైకోర్టును కోరింది. అసలు ఇది ముస్లిం మతంలో తప్పనిసరిగా పాటించాల్సిన ఆచారమా, కాదా అన్నది తేల్చాలని కూడా అడిగింది. ఈ అంశాలన్నింటినీ విచారించాల్సిన అవసరం ఉందా అని ఒక దశలో ధర్మాసనం ప్రశ్నించింది. వీటన్నింటిపైనా వాదనలు కొనసాగనున్నాయి.
తీర్పు వెలువడే వరకు కళాశాల నిబంధనల మేరకే దుస్తులు ధరించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉన్నాయి. విద్యార్థినుల చదువులపై ప్రభావం చూపుతున్న ఈ వివాదం మరింత జటిలం కాకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ముఖ్యంగా ఇది రాజకీయ సమస్యగా మారితే ఊహించని ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.