Jayalalitha Properties : జయలలిత వేల కోట్ల ఆస్తులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!
Jayalalitha Properties : ఆమె ఆదాయానికి మించి కూడబెట్టిన ఆస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి ఆభరణాలు, భూములు, ఇళ్ల పత్రాలు, అలాగే ఇతర విలువైన వస్తువులను అధికారికంగా
- Author : Sudheer
Date : 15-02-2025 - 9:25 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటి జయలలిత ఆస్తుల (Jayalalitha Properties) వ్యవహారం ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తోంది. ఆమె ఆదాయానికి మించి కూడబెట్టిన ఆస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి ఆభరణాలు, భూములు, ఇళ్ల పత్రాలు, అలాగే ఇతర విలువైన వస్తువులను అధికారికంగా తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. గత కొన్నేళ్లుగా బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో భద్రపరిచిన ఈ వస్తువులను శుక్రవారం అధికారుల సమక్షంలో తమిళనాడుకు తరలించారు.
జయలలిత అక్రమ ఆస్తుల కేసు ఆమె తమిళనాడు సీఎం గా ఉన్న సమయంలో వెలుగు చూసింది. 2004లో ఈ కేసును కర్ణాటకకు బదిలీ చేశారు. విచారణ అనంతరం ఆమె దోషిగా తేలినప్పటికీ, అప్పటికే ఆమె అనారోగ్యంతో మరణించడంతో కేసు ముదిరిపాకాన పడింది. ఈ ఆస్తుల వారసత్వంపై జయలలితకు బంధువులుగా పేర్కొంటున్న జె. దీపక్, జె. దీప అనే ఇద్దరు కోర్టుల్లో హక్కు కోసం పిటిషన్లు వేశారు. కానీ కర్ణాటక హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు వారి పిటిషన్లను కొట్టివేస్తూ, స్వాధీనం చేసుకున్న ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని తీర్పునిచ్చింది.
తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించిన ఆస్తుల వివరాలు చూస్తే.. జయలలిత సంపద ఎంతగా ఉన్నదో అర్థమవుతుంది. మొత్తం 27 కిలోల బంగారు, వజ్రాభరణాలు, 601 కిలోల వెండి, 10,000 చీరలు, 750 జతల చెప్పులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, 1672 ఎకరాల వ్యవసాయ భూములు, పలు ఇళ్ల దస్తావేజులు, 8,376 పుస్తకాలు, ఇతర విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తులన్నీ గత కొన్నేళ్లుగా భద్రపరిచారు. కేసు విచారణ సమయంలో అంటే దాదాపు రెండు దశాబ్దాల క్రితం జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.913.14 కోట్లు అని లెక్కగట్టారు. కానీ ప్రస్తుతం బంగారం, భూముల ధరలు భారీగా పెరిగాయి. తాజా అంచనాల ప్రకారం జయలలిత ఆస్తుల విలువ కనీసం రూ.4000 కోట్లకు చేరుకున్నట్టు అనధికారిక సమాచారం. ముఖ్యంగా, తామరై పత్రి, పోయెస్ గార్డెన్ బంగ్లా వంటి భవంతులు, లగ్జరీ ఐటెమ్స్ విలువ మరింత పెరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.