Electric Bike Explodes: తమిళనాడులో పేలిపోయిన విద్యుత్ బైకు.. తండ్రీ కూతుళ్లు మృతి
పెట్రోల్ ఖర్చు తగ్గించుకుందామనుకుని ఇప్పుడు చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొంటున్నారు. ఇప్పటివరకు వాటితో ఎలాంటి సమస్యా లేకపోయింది.
- By Hashtag U Published Date - 11:01 AM, Sun - 27 March 22

పెట్రోల్ ఖర్చు తగ్గించుకుందామనుకుని ఇప్పుడు చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొంటున్నారు. ఇప్పటివరకు వాటితో ఎలాంటి సమస్యా లేకపోయింది. కానీ ఇప్పుడు ఆ వాహనాలు కూడా పేలుతాయన్న నిజం విని వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. తమిళనాడులోని విద్యుత్ వాహనం పేలి ఇంటికి నిప్పంటుకుంది. ఈ ఘటనలో తండ్రీ కుమార్తెలు.. ఊపిరాడక మృతి చెందారు.
వేలూరులోని చిన్న అల్లాపురంలో మొదలియార్ వీధి వీళ్లది. మృతుల పేర్లు.. దురై వర్మ… మోహన ప్రీతి. ఇద్దరూ నిద్రపోతున్న వేళ జరిగిందీ దుర్ఘటన. కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ కొన్న దురై వర్మ.. శుక్రవారం రాత్రి ఇంటి దగ్గరే దానికి ఛార్జింగ్ పెట్టారు. తరువాత నిద్రపోయారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఆ బైక్ పేలిపోయింది. దానికి నిప్పంటుకోవడంతో ఆ మంటలు పక్కనే ఉన్న పెట్రోల్ వాహనానికి కూడా వ్యాపించడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది.
మంటలు ఎంతకీ తగ్గకపోగా ఇల్లంతా వ్యాపించడంతో దురై వర్మ, ఆయన కుమార్తె మోహన ప్రీతి ఇద్దరూ భయపడ్డారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. బాత్ రూమ్ నుంచి నీళ్లు తెచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయనకు ఊపిరందలేదు. దీంతో మంటల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి బాత్రూంలోకి వెళ్లారు. కానీ ఆ పొగ అప్పటికే ఇల్లంతా వ్యాపించేసింది. దీంతో ఊపిరాడక ఇద్దరు తండ్రీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. నిజానికి మంటల్ని చూసిన ఇంటి చుట్టుపక్కల వాళ్లు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. కానీ వాళ్లు వచ్చేలోపే.. ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
విద్యుత్ బైకు పేలడంతో వాటి వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. నిజానికి ఛార్జింగ్ పెట్టి వాటిని అలా వదిలేయకూడదు. ఎంతసేపు ఛార్జ్ చేయాలో అంతసేపే చేయాలి. తరువాత ఛార్జింగ్ ప్లగ్ తీసేయాలి. వీటి విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా, మరిచిపోయినా.. ఇలాంటి దారుణాలు చోటుచేసుకునే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.