Kerala: కేరళలో గవర్నమెంట్ Vs గవర్నర్
పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ ధన్‌కర్‌ల మధ్య జరుగుతున్న వివాదం సద్దుమణగక ముందే అలాంటిదే కేరళలో చోటుచేసుకుంది.
- By Hashtag U Published Date - 10:33 AM, Sun - 20 February 22

పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ ధన్‌కర్‌ల మధ్య జరుగుతున్న వివాదం సద్దుమణగక ముందే అలాంటిదే కేరళలో చోటుచేసుకుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్‌ల మధ్య పొరపొచ్చాలు నెలకొన్నాయి. బడ్జెట్ సమర్పణ రోజున సంప్రదాయంగా చేసే గవర్నర్ ప్రసంగాన్ని ప్రభుత్వమే రూపొందిస్తుంది. దానిని ముందుగా గవర్నర్‌కు సమర్పిస్తే దానిని ఆమోదించాల్సి ఉంటుంది. దానినే ఆయన అసెంబ్లీలో చదువుతారు. ప్రభుత్వం సమర్పించిన ప్రసంగ పాఠాన్ని ఆమోదించడానికి గవర్నర్ అరిఫ్ ఖాన్ తిరస్కరించారు.
స్వయంగా ముఖ్యమంత్రి విజయన్ కలిసి చెప్పినా వినలేదు. గవర్నర్ అడిషనల్ పర్సనల్ అసిస్టెంట్ నియామకంలో తలెత్తిన వివాదమే దీనికి కారణం. బీజేపీ నాయకుడు, మలయాళం దినపత్రిక జన్మభూమి మాజీ సంపాదకుడు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన హరి ఎస్ కర్తాను నియమించాలని గవర్నర్ ప్రతిపాదించారు. దీనిని ప్రభుత్వం పరిశీలించి.. ఆ నియామకాన్ని వ్యతిరేకిస్తూ అసమ్మతి లేఖను రాసింది.
రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నవారిని ఇలాంటి పదవుల్లో నియమించకూడదంటూ ప్రభుత్వం తెలిపింది. ఈ డీసెంట్ నోట్‌ను చూసి గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లేఖను రాసిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం సెక్రటరీ కె.ఆర్.జ్యోతిలాల్‌ను తొలగించాలని గవర్నర్ పట్టుబట్టారు. దానికి ప్రభుత్వం అంగీకరించి బదిలీ చేసింది. అయినా సరే ప్రసంగ పాఠంపై సంతకం చేయడానికి గవర్నర్ మాత్రం అంగీకారం తెలపలేదు.