BJP MP Maharaj : గాజు సీసాలు, బాణాలు ఉంచుకోవాలన్న బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ పోస్ట్ లో ఆంతర్యమేంటి?
బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా బీజేపీ ఎంపీ సాక్షిమహరాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు మీ ఇళ్ల పై దాడికి పాల్పడవచ్చని..
- By Hashtag U Published Date - 10:23 AM, Mon - 25 April 22

బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా బీజేపీ ఎంపీ సాక్షిమహరాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు మీ ఇళ్ల పై దాడికి పాల్పడవచ్చని.. అందుకే ఇంట్లో గాజు సీసాలు, బాణాలు ఉంచుకోవాలని చెప్పారు. దీనిపై ఫేస్ బుక్ లో పోస్టే పెట్టడంతో ఇది వివాదంగా మారింది. ఉత్తరప్రదేశ్ కి చెందిన సాక్షిమహరాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మొన్నటికి మొన్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. రాత్రివేళ బీజేపీ నేతలు కాని, హిందూ సంస్థల వ్యక్తుల కాని ఎవరూ ఒంటరిగా సంచరించవద్దని.. దాడులు జరిగే ప్రమాదముందని చెప్పారు. దీంతో అప్పట్లో కొంతమంది ఇలాంటి వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పారు. ఎవరికైనా ప్రాణహాని ఉంటే పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
అన్నామలై లాగే సాక్షిమహరాజ్ కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో… అసలు బీజేపీ నేతల ఉద్దేశమేంటి? తమకు ప్రాణహాని పొంచి ఉంటే.. పోలీసులను ఎందుకు ఆశ్రయించడం లేదు అని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాక్షిమహరాజ్ చేసిన వ్యాఖ్యల్లో మరికొన్ని కీలకాంశాలు ఉన్నాయి. ఎవరైనా మీ ఇంటిపై దాడికి పాల్పడితే.. పోలీసులు మిమ్మల్ని రక్షించడానికి రారని.. గొడవలు జరిగే సమయంలో వాళ్లు ఎక్కడో ఒక చోట దాక్కుంటారని అన్నారు. దాడులకు పాల్పడేవారు వెళ్లిన తరువాత పోలీసులు వస్తారన్నారు. తరువాత వాటిపై కమిటీలు వేసినా.. అవి కాలయాపన చేస్తాయని.. అక్కడితో ఆ అంశం ముగుస్తుందన్నారు. అందుకే ప్రజలు తమకు తామే రక్షించుకోవాలన్నారు.
సాక్షిమహరాజ్ తన ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టుకు ఒక ఫోటోను జత చేశారు. అది రాళ్లు, కర్రలు పట్టుకుని కొంతమంది పరిగెడుతున్న ఫోటో. అయితే అది 2013లో బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరిగిన అల్లర్లకు సంబంధించింది. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.