Robo Hand: బయోనిక్ హ్యాండ్ వచ్చేసింది.. యాప్ తో ఆపరేట్ చేసేలా రోబోటిక్ చేయి!
రజనీకాంత్ " రోబో " సినిమా గుర్తుందా? అందులో రోబోకు ఉన్న చేయి ఎలా ఉంది? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.
- By Hashtag U Published Date - 10:30 AM, Wed - 17 August 22

రజనీకాంత్ ” రోబో ” సినిమా గుర్తుందా?
అందులో రోబోకు ఉన్న చేయి ఎలా ఉంది? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.
అచ్చం అలాంటి కృత్రిమ చెయ్యిని బ్రిటన్ లోని కొవీ ( Covvi) కంపెనీ ఐదు నెలల క్రితం అభివృద్ధి చేసింది. ఈ కృత్రిమ చేయిని “బయోనిక్ హ్యాండ్” అని పిలుస్తారు. ఇది అచ్చం మనిషి చేయిలాగే పని చేస్తుంది. మెదడు నుంచి వచ్చే ఆదేశాలను స్వీకరించి అర్ధం చేసుకోగలదు. తాజాగా ఈ బయోనిక్ హ్యాండ్స్ విక్రయాలను అమెరికా, చైనా, ఆస్ట్రేలియా మార్కెట్లలో ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా 27 మంది డిస్ట్రిబ్యూటర్ల ద్వారా బయోనిక్ హ్యాండ్ విక్రయాలు నిర్వహిస్తున్నారు.త్వరలో ప్రతినెలా
100 బయోనిక్ హ్యాండ్స్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో కొవీ ( Covvi) కంపెనీ ముందుకు సాగుతోంది.
ఎంతోమంది ఈ బయోనిక్ హ్యాండ్ కోసం ముందస్తు ఆర్డర్లు ఇస్తున్నారు. ఇలా దీన్ని కొనుగోలు చేసిన ఓ ప్రముఖ వ్యక్తి పేరు.. “జెస్సికా స్మిత్’. ఆమె ఆస్ట్రేలియా స్విమ్మర్. వికలాంగులతో నిర్వహించే పారా ఒలింపిక్స్ లోనూ ఈమె ఆడారు. తాజాగా బయోనిక్ హ్యాండ్ ను కొన్నప్పటి నుంచి తన ఆత్మ విశ్వాసం స్థాయి పెరిగిందని
జెస్సికా స్మిత్ అంటున్నారు. దీనివల్ల నలుగురిలో ఎక్కడికి వెళ్లినా.. అత్యాధునిక టెక్నాలజీని వాడుకుంటున్న వ్యక్తిగా తనను అందరూ చూస్తున్నారని చెప్పారు. బాల్యం నుంచి యవ్వనం దాకా ప్రతి దశలోనూ తాను ధరించిన కృత్రిమ అవయవాల వల్ల శారీరకంగా నరకయాతన అనుభవించాల్సి వచ్చిందని స్మిత్ గుర్తు చేసుకున్నారు. సరికొత్త బయోనిక్ హ్యాండ్ ను NetApp (NTAP.O) ద్వారా కంట్రోల్ చేయొచ్చని కొవీ ( Covvi) కంపెనీ వెల్లడించింది. ఇదే యాప్ నుంచి చేయికి సందేశాలు పంపే వెసులుబాటు కూడా ఉంటుందని వివరించారు. ఈ బయోనిక్ చేయిలో ఇన్ బిల్ట్ గా బ్లూ టూత్ టెక్నాలజీ ఉంది. దీని సాయంతో ఎప్పటికప్పుడు ఈ హ్యాండ్ ను అప్ డేట్ చేయొచ్చు.
కృత్రిమ కిడ్నీ..
కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా? తరచూ డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోందా? కిడ్నీ మార్పిడికి దాత కోసం ఎదురు చూస్తున్నారా? నరకప్రాయం అనిపించే డయాలసిస్ వద్దని అనుకుంటున్నారా? మీ సమస్యలన్నీ తీరే రోజు ఎంతో దూరం లేదంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్త షువో రాయ్. ఎందుకంటారా?…. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మూత్రపిండాల మాదిరిగానే పని చేసే కృత్రిమ కిడ్నీ సిద్ధమైంది కాబట్టి!! శరీరంలో ఏదైనా కొత్త అవయవం చేరితే రోగ నిరోధక వ్యవస్థ వెంటనే దాన్ని నిరోధించే ప్రయత్నం చేస్తుందనే విషయం మనకు తెలిసిందే. కానీ షువోరాయ్ తయారు చేసిన కృత్రిమ కిడ్నీతో మాత్రం ఈ సమస్య రాదు. ఎందుకంటే ఇందులో రోగి కణాలనే వాడతారు. స్థూలంగా ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకదాంట్లో నానోస్థాయి రంధ్రాలున్న ఫిల్టర్లు ఒక కట్టలా ఉంటాయి. సిలికాన్‌తో తయారైన ఈ ఫిల్టర్లు రక్తం ప్రవహించే వేగాన్ని ఉపయోగించుకొని రక్తంలోని విషపదార్థాలు, చక్కెరలు, లవణాలను తొలగిస్తాయి. ఫిల్టర్‌లోని రంధ్రాలు కచ్చితమైన సైజు, ఆకారంలో ఉండటం వల్ల రక్త కణాలపై ఒత్తిడి తగ్గుతుంది. లేదంటే రక్తం గడ్డకట్టి రోగికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక రెండో భాగంలో బయో రియాక్టర్ ఉంటుంది. ఇందులో మూత్రపిండాల కణాలే ఉంటాయి. శుద్ధి చేసిన రక్తంలో తగుమోతాదులో నీళ్లు, అవసరమైన లవణాలు, చక్కెరలు ఉండేందుకు బయో రియాక్టర్‌లోని మూత్రపిండ కణాలు ఉపయోగపడతాయి. ఫిల్టర్ల ద్వారా శుద్ధి అయిన రక్తాన్ని పరిశీలించి.. ఏయే పదార్థాలు ఎంత మోతాదులో ఉన్నాయో గుర్తించడం నియంత్రణకు అవసరమైన పనులు చేసేందుకు ఒక మైక్రో కంట్రోలర్‌ను వాడతారు. గతేడాది షువో రాయ్ బృందం సిద్ధం చేసిన కృత్రిమ కిడ్నీ పరికరం నిమిషానికి లీటర్ రక్తాన్ని శుద్ధి చేయగలదని పరీక్షల్లో తేలింది. ఈ పరికరంలో వాడే బయో రియాక్టర్లను 1999 నుంచి జంతువుల్లో విజయవంతంగా పరీక్షిస్తున్నారు.