Poet: అదానీ స్పాన్సర్ చేస్తున్న పురస్కారాన్ని తిరస్కరించిన తమిళ కవయిత్రి
న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ (New Indian Express Group) ప్రకటించిన ‘దేవి’
- By Maheswara Rao Nadella Published Date - 11:00 AM, Tue - 14 February 23

న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ప్రకటించిన ‘దేవి’ పురస్కారాలకు ఎంపికైన తమిళ కవయిత్రి (Poet) ఆ పురస్కారాన్ని తీసుకునేందుకు తిరస్కరించారు. కారణం.. ఆ అవార్డును ప్రదానం చేస్తున్నది అదానీ. దేశవ్యాప్తంగా పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళలకు న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపు ప్రతి సంవత్సరం ‘దేవి’ పురస్కారాలను ప్రదానం చేస్తోంది.
ఎప్పటిలానే ఈసారి కూడా వివిధ రంగాల్లో కృషి చేసిన 12 మంది మహిళలను అవార్డుకు ఎంపిక చేశారు. సాహిత్యం, దళిత సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను తమిళనాడుకు చెందిన ప్రముఖ కవయిత్రి (Poet) సుకీర్త రాణి కూడా వీరిలో ఉన్నారు. అయితే, ఈ అవార్డును అందుకునేందుకు ఆమె నిరాకరించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి అదానీ గ్రూప్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక ద్వారా అదానీ ఆర్థిక నేరాల గురించి తెలిసిందని, అందుకనే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదని సుకీర్త రాణి తెలిపారు.
సుకీర్త రాణి వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. రచయిత్రిగా, కవయిత్రిగా గుర్తింపు పొందారు. పలు పుస్తకాలు రాశారు. సమకాలీన రాజకీయాలను ఆమె కవితలు ప్రతిబింబిస్తాయి. రెండున్నర దశాబ్దాలుగా మహిళా హక్కులు, దళిత విముక్తి, మహిళా స్వేచ్ఛ, అణచివేతకు గురైన ప్రజల కోసం ఆమె రచనలు చేస్తున్నారు.
Also Read: CID AP: సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోండి