Travel Faster Than Light : కాంతి కంటే వేగంగా జర్నీ సాధ్యమేనట.. ఎలాగంటే!!
ఈ సృష్టిలో కాంతిదే అత్యధిక వేగం. కాంతి ప్రయాణానికి సమానంగా మనమూ ప్రయాణిస్తే… అప్పుడు కాలవేగం స్థిరమవు తుంది.
- By Hashtag U Published Date - 09:00 PM, Mon - 11 July 22

ఈ సృష్టిలో కాంతిదే అత్యధిక వేగం. కాంతి ప్రయాణానికి సమానంగా మనమూ ప్రయాణిస్తే… అప్పుడు కాలవేగం స్థిరమవు తుంది. అంటే కాలంలో మార్పు ఉండదు. ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం.. ద్రవ్యరాశి గల ఏ వస్తువూ కాంతికన్నా వేగంగా ప్రయాణించ లేదు. సాపేక్ష సిద్ధాంతాన్ని దాటుకొని కాంతి కంటే వేగంగా ప్రయాణిస్తే.. సుదూరాల్లోని పాలపుంతలకు వ్యోమగాములు వెళ్లి రావచ్చు. ఇది సాధ్యమే అని తాజాగా అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త ఎరిక్ లెంట్జ్ అధ్యయనంలో వెల్లడైంది. వార్ప్ బబుల్స్ గా పేరొందిన హైపర్ ఫాస్ట్ స్పేస్ జెట్ ద్వారా కాంతిని మించిన వేగంతో ప్రయాణం చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. అంతరిక్షంలో కాంతి వేగంతో ప్రయాణించే క్రమంలో.. మార్గం మధ్యలోని ఆటంకాలను తాకకుండా సురక్షితంగా దూసుకెళ్లడం వార్ప్ బబుల్స్ స్పేస్ జెట్ ప్రత్యేకత. కాంతిని మించిన వేగంతో ప్రయాణించడానికి .. దీని ఇంజిన్ కు అదనపు శక్తి ఉంటేనే అంతటి స్పీడ్ తో జర్నీ సాధ్యం అవుతుంది.
‘స్టార్ ట్రెక్’ అనే సైన్స్ ఫిక్షన్ లో..
‘స్టార్ ట్రెక్’ అనే సైన్స్ ఫిక్షన్ సినిమాలో మనుషులు కాంతి వేగంతో ప్రయాణిస్తూ సుదూర అంతరిక్ష లోకాల్లోకి వెళ్తుంటారు. అది వాస్తవికంగా సాధ్యం కావాలంటే.. ముందుగా ‘స్థలకాలాల’ నియమాలను చేధించాల్సి ఉంటుందని ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టెన్ పేర్కొన్నారు. అయితే, కాంతికన్నా వేగంగా ప్రయాణించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయవచ్చని మెక్సికోకు చెందిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త మిగ్యుల్ అల్కుబెర్రె 1994లో మొదటి సారి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్ స్వీకరించింది. ఇందుకోసం.. స్థలం-కాలం, గురుత్వాకర్షణ, క్వాంటం వ్యాక్యూమ్, ఇతర మూల భౌతిక విషయాలను లోతుగా అధ్యయనం చేస్తోంది.
‘టైమ్ ట్రావెల్’ అంటే?
కాలంలో ప్రయాణించడాన్ని స్థూలంగా ‘టైమ్ ట్రావెల్’గా చెప్పొచ్చు. దీని సాయంతో గతవారం జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను ప్రేక్షకుల మధ్య స్టేడియంలో ఇప్పుడు కూర్చొని చూడొచ్చు. దీనికోసం కాలచక్రంలో 168 గంటలు వెనక్కి ప్రయాణించాల్సి ఉంటుంది.