Special Clinic For Transgenders: ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్స్
ట్రాన్స్‌జెండర్లు ఇప్పటికీ సమాజంలో ప్రతిచోటా వివక్షను ఎదుర్కొంటున్నారు.
- Author : Balu J
Date : 02-08-2022 - 2:17 IST
Published By : Hashtagu Telugu Desk
ట్రాన్స్‌జెండర్లు ఇప్పటికీ సమాజంలో ప్రతిచోటా వివక్షను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి వైద్య సేవలను పొందడంలో సమస్యలను ఎదుర్కొంటారు. వాళ్ల కష్టాలను గమనించిన వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజిఎం) ఆసుపత్రి ట్రాన్స్‌జెండర్లకు శారీరక మానసిక వైద్య సేవలను అందించడానికి ముందుకు వచ్చింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఎంజీఎం వారి కోసం ప్రత్యేక క్లినిక్‌ను ప్రారంభించింది. వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి మంగళవారం వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంజీఎంలోని 133, 134 ఓపీ గదుల్లో వైద్యులు ట్రాన్స్‌జెండర్లను చూస్తారు.
వారికి సైకలాజికల్ కౌన్సెలింగ్, హార్మోనల్ థెరపీ, సెక్స్ రీ-అసైన్‌మెంట్ సర్జరీ, బ్రెస్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్, నిపుణుల ద్వారా ఇతర వైద్య సేవలు అందిస్తారు. ఆసుపత్రి యాజమాన్యం హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది – 99631 64111. ట్రాన్స్‌జెండర్ రోగులు ఈ నంబర్‌కు కాల్ చేసి వారి పేరు, ఆరోగ్య సమస్యను తెలియజేయవచ్చు. సిబ్బంది క్లినిక్ సమయాలను తెలియజేస్తారు. తమిళనాడులో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంజీఎం తనవంతుగా చొరవ తీసుకుంది.