Jharkand Board 10th Result: వయస్సు అడ్డుకాదు… 56 ఏళ్లలో పదో తరగతి పాస్ అయిన గుమాస్తా
చదవాలనే పట్టుదల ఉంటే అందుకు వయసు అడ్డు రాదని నిరూపించారు ఈ వ్యక్తి. 56 ఏళ్ల వయసులో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. ఓ ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేస్తున్న ఆయన 47.2 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.
- By Kode Mohan Sai Published Date - 03:26 PM, Fri - 30 May 25

Jharkand Board 10th Result: చదువుకోవాలనే పట్టుదల ఉంటే వయస్సు ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించారు గంగా ఓరమ్ అనే వ్యక్తి. 56 ఏళ్ల వయస్సులో పదవ తరగతి పరీక్షను 47.2% మార్కులతో విజయవంతంగా పూర్తి చేశారు. ఇది కేవలం పరీక్ష ఫలితం మాత్రమే కాదు, ఓ జీవిత విజయానికి చిహ్నంగా నిలిచింది.
ఝార్ఖండ్ రాష్ట్రంలోని ఖుంఠీ జిల్లాలోని కలామతి గ్రామానికి చెందిన గంగా ఓరమ్, ప్రస్తుతం ఓ ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్తాగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. గత 16 సంవత్సరాలుగా నెలకు రూ. 9వేలు జీతంతో పనిచేస్తున్నా, పదో తరగతి అర్హత లేకపోవడంతో పర్మినెంట్ ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఈ నిరాశ గంగాను ఓ నిర్ణయం తీసుకునేలా చేసింది. చదవాలనే సంకల్పంతో బిర్సా హై స్కూల్లో ఫీజు చెల్లించి పదవ తరగతి చదివారు. ఈ ఏడాది జరిగిన బోర్డు పరీక్షల్లో 47.2 శాతం మార్కులతో పాస్ అయ్యారు. గంగా ఓరమ్ విజయంతో ఆయన భార్య, తల్లి, నలుగురు కుమార్తెలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా డీఈవో అపూర్వ పాల్ చౌదరీ గంగా ఓరమ్‌ను అభినందించారు. విద్యాశాఖ తరపున ఆయనను సత్కరించనున్నట్టు తెలిపారు. పదో తరగతి పాస్ అవడంతో ఇకపైనా పర్మినెంట్ ఉద్యోగం దక్కుతుందనే ఆశ గంగా ఓరమ్‌కి కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది.