Pitbull : యజమానిపై పెంపుడుకుక్క దాడి; తీవ్ర గాయాలతో మృతి
పిట్ బుల్ డాగ్స్.. చూడటానికి చాలా డేంజరస్ గా ఉంటాయి. వాటిని శిక్షణ లేని వ్యక్తులు పెంచుకోవడం చాలా ప్రమాదకరమని చెబుతుంటారు.
- By Hashtag U Published Date - 09:00 PM, Thu - 14 July 22
పిట్ బుల్ డాగ్స్.. చూడటానికి చాలా డేంజరస్ గా ఉంటాయి. వాటిని శిక్షణ లేని వ్యక్తులు పెంచుకోవడం చాలా ప్రమాదకరమని చెబుతుంటారు. డేంజరస్ అని తెలిసినా పెంచుకున్న పిట్ బుల్ డాగ్ ..ఇంటి యజమానిపై దాడి చేసి చంపేసింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఉన్న బెంగాలీ తోలా ప్రాంతంలోని ఖైజర్‌బాగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుశీలా త్రిపాఠి 83 ఏళ్ల వృద్ధురాలు..ఆమె రిటైర్డ్ స్కూల్ టీచర్. ఖైజర్ బాగ్‌లోని ఇంట్లో చిన్న కుమారుడితో కలిసి ఉంటోంది. వారికి రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. అందులో ఒక కుక్క పిట్ బుల్. మంగళవారం ఉదయం ఇంటి మేడపై ఉన్న సుశీలా త్రిపాఠిపై అది దాడి చేసింది. ఆమెను కరిచి చంపింది. రక్తపు మడుగుల్లో పడి ఉన్న సుశీలను.. ఇంటి పని మనిషి గమనించి వెంటనే ఆమె కుమారుడికి సమాచారం ఇచ్చింది. ఆస్పపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు వెల్లడించారు.ఈ ఘటన నేపథ్యంలో లక్నో మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన అధికారుల బృందం బుధవారం ఆ ఇంటికి వెళ్లింది. అయితే ఇంటికి తాళం వేసి ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.ఆ పిట్ బుల్ డాగ్‌ను పెంచుకునే లైసెన్స్ ఉందా లేదా అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నరు.
మెడ నుండి పొత్తికడుపు దాకా..
పోస్టుమార్టం నివేదిక ప్రకారం సుశీల శరీరంపై మెడ నుంచి పొత్తికడుపు వరకు మొత్తం 12 బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఇరుగుపొరుగు వారి కథనం ప్రకారం, ‘ఉదయం 6 గంటల సమయంలో, కుక్కలు సుశీల పై దాడి చేయడంతో సుశీల సహాయం కోసం కేకలు వేశారు. అయితే వారు ఆమెను రక్షించడం కోసం ఆమె ఇంటికి పరుగులు తీసినప్పటికీ ఇంటికి లోపలి నుండి తాళం వేసి ఉండటంతో తాము ఏమీ చేయలేక పోయామని పేర్కొన్నారు. సుశీల త్రిపాఠి కుమారుడికి సమాచారం అందించగా, అతను ఇంటికి వచ్చేసరికే కుక్క మహిళను తీవ్రంగా గాయపరిచిందని స్థానికులు చెబుతున్నారు