Romantic Relationships : నానో షిప్స్, లవ్ బాంబింగ్, కుషనింగ్ పేర్లతో ఎన్నో రిలేషన్‌షిప్స్.. ఏమిటివి ?
బ్రెడ్ క్రంబింగ్ అనే రిలేషన్‌షిప్(Romantic Relationships) విషయానికొస్తే.. దీన్ని పాటించే వాళ్లు ఇతరులను కవ్వించి వదిలేస్తారు.
- By Pasha Published Date - 05:11 PM, Thu - 22 May 25

Romantic Relationships : కాలం గడుస్తున్న కొద్దీ సమాజం మారుతోంది. ఆధునిక భావజాలం ముసుగులో సమాజంలోని మానవ సంబంధాలు పెడదోవ పడుతున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం వరకు సహ జీవనాన్ని మహా పాపంలా చూసేవారు. ఇప్పుడు సాక్షాత్తూ కీలకమైన వ్యవస్థలే సహ జీవనానికి కొన్ని పరిమితులను విధిస్తున్నాయి. కొన్ని రకాల సహ జీవనాలపై తమకు అభ్యంతరం లేదని అంటున్నాయి. ఈవిధంగా లభిస్తున్న సడలింపులు సమాజాన్ని ఎవరూ ఊహించని విపత్కర మార్గంలోకి ఈడ్చుకెళ్తున్నాయి. భావితరాల జీవితాలను ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి. నైతిక విలువల పతనానికి కారణం అవుతున్నాయి. ఈవిధంగా ఇటీవలి కాలంలో పుట్టుకొచ్చిన వివిధ రకాల కొత్తకొత్త రిలేషన్‌షిప్‌ల గురించి ఈ కథనంలో మనం తెలుసుకుందాం..
Also Read :India Vs Pakistan : ‘సిందూరం’ పవర్‌ను చూపించాం.. పాక్‌కు చుక్కనీళ్లూ ఇవ్వం : ప్రధాని మోడీ
లవ్ బాంబింగ్
లవ్ బాంబింగ్ అనే రిలేషన్‌షిప్ కొందరు ఫాలో అవుతున్నారు. బాంబింగ్ అంటేనే పవర్ ఫుల్‌గా జరుగుతుంది. అందుకే అతి ప్రేమను చూపడాన్ని లవ్ బాంబింగ్ అని పిలుస్తారు. ఇందులో భాగంగా లవర్ కోసం భారీగా గిఫ్టులు కొంటారు. లవర్‌ను అనుక్షణం వెంటాడుతారు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. అందుకే ఈ తరహా ధోరణితో పెద్దగా సంబంధాలు బలపడవు.
బ్రెడ్ క్రంబింగ్
బ్రెడ్ క్రంబింగ్ అనే రిలేషన్‌షిప్(Romantic Relationships) విషయానికొస్తే.. దీన్ని పాటించే వాళ్లు ఇతరులను కవ్వించి వదిలేస్తారు. వారితో సీరియస్‌గా బంధాన్ని కోరుకోరు. ప్రత్యేకించి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా ఇష్టమైన వారితో ఛాట్‌లో మునిగి తేలేవారు బ్రెడ్ క్రంబింగ్ చేస్తుంటారు. టైంపాస్ కోసమే రిలేషన్‌షిప్స్ కంటిన్యూ చేస్తారు. పదాల వరకే పరిమితం అవుతారు.
బెంచింగ్
బెంచింగ్ రిలేషన్‌షిప్ విషయానికొస్తే.. ఎదుటి వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. కానీ అస్సలు ఉండరు. ఇంకోవైపు వేరే భాగస్వామి కోసం వెతుకుతూ ఉంటారు. ఇలాంటి ధోరణి చాలామందిలో ఉంటుంది. ఈ తరహా సంబంధాల్లో ఉండేవాళ్లు అలర్ట్‌గా ఉండాలి. నమ్మకద్రోహం జరిగినా కోపతాపాలకు పోకూడదు. కెరీర్‌కు మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలి. అసలు ఈవిధమైన గ్యారంటీ లేని సంబంధాలతో టైం వేస్ట్ చేసుకోకుంటేనే బెటర్.
కుషనింగ్
కుషనింగ్ రిలేషన్‌షిప్ విషయానికొస్తే.. ఈ కేటగిరీలోని వారు ఒక వ్యక్తితో రిలేషన్‌షిప్‌ను కంటిన్యూ చేస్తుంటారు. అయితే అదే టైంలో మరొకరిని ప్రేమిస్తున్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న బంధం తెగిపోతే ఏమవుతుందో అనే భయంతో ఏమీ చెప్పలేక కుమిలిపోతుంటారు.
ఆర్బిటింగ్
ఆర్బిటింగ్ రిలేషన్‌షిప్ విషయానికొస్తే.. పక్కవారి జీవితంలోకి తొంగి చూడటాన్నే ఆర్బిటింగ్ రిలేషన్‌షిప్ అంటారు. ఇలా చేయడం ఒక్కోసారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎవరితోనైనా కొంతకాలం ప్రేమను కొనసాగించి దూరమైతే.. ఆ తర్వాత కూడా సదరు వ్యక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడమే ఆర్బిటింగ్ రిలేషన్‌షిప్. ఇందులో భాగంగా చాలామంది సోషల్ మీడియా ద్వారా తమ మాజీ ప్రేమికులను ట్రాక్ చేస్తుంటారు.
నానో షిప్స్
నానోషిప్స్ రిలేషన్‌షిప్ విషయానికొస్తే.. నానో అంటేనే చాలా తక్కువ కాలం అని అర్థం. అతి తక్కువ రోజులే ఇతరులతో రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉంటే దాన్నే నానోషిప్స్ అంటారు. అయితే నేటితరంలో అత్యధికులు సుస్థిరమైన బంధాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.