Vankaya Pachipulusu : వంకాయతో పచ్చిపులుసు.. ఎప్పుడైనా ట్రై చేశారా..
ముందుగా వంకాయలు, పచ్చిమిరప కాయలకు పొట్టలో గాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకుని పక్కనపెట్టుకోవాలి. కొత్తిమీర, బెల్లం కూడా..
- By News Desk Published Date - 10:48 PM, Wed - 18 October 23
Vankaya Pachipulusu : ఇంట్లో ఏదైనా నాన్ వెజ్ వండితే.. అందులోకి కన్ఫర్మ్ గా ఏదైనా రసం లేదా పచ్చిపులుసు ఉండాల్సిందే. పచ్చిపులుసు అంటే కూరగాయలతో చేసేది కాదండోయ్.. ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చితో పచ్చిపులుసు చేసుకుని.. చికెన్ ఫ్రై నంచుకుని తింటే.. ఎంతో హాయిగా ఉంటుంది. ఈ పచ్చిపులుసు సరే.. వంకాయతో ఎప్పుడైనా పచ్చిపులుసు ట్రై చేశారా ? వంకాయతోనా.. పచ్చిపులుసా ? అనుకుంటున్నారా. ఒక్కసారి చేసుకుని తింటే.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. వంకాయ పచ్చిపులుసు ఎలా తయారు చేసుకోవాలో అందుకు ఏయే పదార్థాలు కావాలో తెలుసుకుందాం.
వంకాయ పచ్చిపులుసుకు కావలసిన పదార్థాలు
నిగనిగలాడే వంకాయలు – పావుకిలో
పచ్చిమిరప కాయలు – 4 లేదా 5
ఉల్లిపాయలు మీడియం – 2
ఉప్పు – రుచికి కావలసినంత
కారం – అర స్పూన్
బెల్లం – కొద్దిగా
చింతపండు – ఒక నిమ్మకాయ సైజంత
కొత్తిమీర- కొద్దిగా
వంకాయ పచ్చిపులుసు తయారీ విధానం
ముందుగా వంకాయలు, పచ్చిమిరప కాయలకు పొట్టలో గాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకుని పక్కనపెట్టుకోవాలి. కొత్తిమీర, బెల్లం కూడా తరిగిపెట్టుకోవాలి. చింతపండును నీటిలో వేసి గుజ్జు తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు గాట్లు పెట్టుకుని ఉంచిన వంకాయలను పొయ్యి లేదా బొగ్గులపై కాల్చుకోవాలి. వీటిని నీటిలో వేసి తొక్క తీసుకుని.. మసి లేకుండా కడిగి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలను కూడా కాల్చుకుని తొక్కతీసుకుని పెట్టుకోవాలి.
వెడల్పాటి గిన్నెలో వంకాయ గుజ్జు, పొట్టుతీసిన పచ్చిమిరప కాయలు, ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, బెల్లం, కొత్తిమీర, ఉప్పు, కారం వేసి మొత్తం గుజ్జయ్యేలా చేతితో కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కావలసినంత వేసుకుని కలుపుకోవాలి. మీకు కావాలంటే పోపు (తాలింపు) పెట్టుకోవచ్చు. ఇష్టం లేకపోతే అలాగే వేడి వేడి అన్నంలో వేసుకుని తినొచ్చు. పులుపు, తీపి, కారం రుచులు తెలుస్తూ.. అక్కడక్కడా ఉల్లిపాయ ముక్కలు తగులుతూ.. కాల్చిన వంకాయ గుజ్జుతో చేసిన పచ్చిపులుసుతో అన్నం తింటుంటే ఉంటుందండీ.. ఆహా అంటారు.
Related News
Carrot Milk Shake : క్యారెట్ మిల్క్ షేక్.. పక్కా కొలతలతో ఇలా చేయండి..
ఇంట్లోనే హెల్దీగా ఉండే క్యారెట్ మిల్క్ షేక్ ను తయారు చేసుకోవచ్చు. తీపి కోసం పంచదార శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. పంచదార వేయకుండానే ఈ మిల్క్ షేక్ ను తయారు చేసుకోండి..