కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం.. సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం
అలర్జీలు, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యల కోసం వాడే స్టెరాయిడ్లు, మరియు ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే కంటి చుక్కల మందులు... దీర్ఘకాలం వాడితే కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. దీనివల్ల కంటి నాడికి దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుందని చాలామంది రోగులకు తెలియకపోవడం గమనార్హం.
- Author : Latha Suma
Date : 23-01-2026 - 5:00 IST
Published By : Hashtagu Telugu Desk
. విచ్చలవిడిగా స్టెరాయిడ్ల వాడకంపై వైద్యుల ఆందోళన
. గ్లాకోమా అవగాహన నెల సందర్భంగా డాక్టర్స్ హెచ్చరిక
. డయాబెటిక్ రోగులకు ఉచిత గ్లాకోమా పరీక్షలు
Steroids : భారతదేశం అంతటా స్టెరాయిడ్ల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతుండటం తరచుగా వైద్యుల పర్యవేక్షణ లేకుండా వీటిని వాడుతుండటంపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ‘సెకండరీ గ్లాకోమా’ అనే ప్రమాదకరమైన కంటి సమస్యకు ప్రధాన కారణమవుతోందని ఇది శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అలర్జీలు, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యల కోసం వాడే స్టెరాయిడ్లు, మరియు ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే కంటి చుక్కల మందులు… దీర్ఘకాలం వాడితే కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. దీనివల్ల కంటి నాడికి దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుందని చాలామంది రోగులకు తెలియకపోవడం గమనార్హం. అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా, ‘డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్’ దేశవ్యాప్తంగా డయాబెటిక్ రోగులకు ఉచిత గ్లాకోమా పరీక్షలను అందిస్తోంది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 15, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. అపాయింట్‌మెంట్ల కోసం 95949 01868 కు కాల్ చేయవచ్చు.
గ్లాకోమాతో బాధపడుతున్న సుమారు 1.2 నుండి 1.3 కోట్ల మంది ప్రజలకు భారతదేశం నిలయంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లాకోమా బాధితులలో ఇది దాదాపు ఆరవ వంతు. ప్రపంచవ్యాప్తంగా 7.5 నుండి 8 కోట్ల మంది గ్లాకోమాతో బాధపడుతుండగా ఈ సంఖ్య 2040 నాటికి 11 కోట్లు దాటుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా శాశ్వత అంధత్వానికి గ్లాకోమా ప్రధాన కారణమైనప్పటికీ భారతదేశంలో ఇది చాలా వరకు గుర్తించబడకుండా పోతోంది. దేశంలో 85–90% గ్లాకోమా కేసులు గుర్తించబడకుండా పోవడం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఈ వ్యాధి నిశ్శబ్దంగా ముదిరిపోతుంది. లక్షణాలు కనిపించే సమయానికి కంటి నాడికి కోలుకోలేని నష్టం జరిగిపోతుంది. ఆలస్యంగా గుర్తించడం వల్ల నివారించగలిగే దృష్టి లోపం జీవన ప్రమాణాలు తగ్గడం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి.
చూపు బాగుంటే కళ్లు ఆరోగ్యంగా ఉన్నాయని గ్లాకోమా కేవలం వృద్ధులకే వస్తుందని కంటి ఒత్తిడి సాధారణంగా ఉంటే గ్లాకోమా లేనట్లే అని భావించడం అపోహ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్, హైపర్‌టెన్షన్ (బీపీ), థైరాయిడ్ సమస్యలు, అధిక మయోపియా ఉన్నవారు. దీర్ఘకాలం స్టెరాయిడ్లు వాడేవారు లేదా చిన్నతనంలో కంటికి దెబ్బ తగిలిన వారు.. అధిక రిస్క్‌లో ఉంటారు. వీరు ఏటా తప్పనిసరిగా కంటి స్క్రీనింగ్ చేయించుకోవాలి. గ్లాకోమా అవగాహన నెలలో భాగంగా నిపుణులు సాధారణ కంటి పరీక్షల ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు. 40 ఏళ్లు పైబడిన వ్యక్తులు ప్రతి ఒకటి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి సమగ్ర పరీక్ష చేయించుకోవాలి. అధిక రిస్క్ ఉన్నవారు ఏటా పరీక్షలు చేయించుకోవాలి. కేవలం విజన్ టెస్టులు (దృష్టి పరీక్షలు) సరిపోవు కంటి ఒత్తిడి మరియు కంటి నాడి ఆరోగ్యాన్ని అంచనా వేయడం చాలా ముఖ్యం.