Semiya Veg Cutlets : సేమియా వెజ్ కట్‌లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
సేమియా(Semiya)తో మనం స్వీట్, పాయసం, ఉప్మా, కేసరి.. ఇలా రకరకాలు చేసుకొని తింటాం. సేమియా వెజ్ కట్‌లెట్స్(Semiya Veg Cutlets) అనే స్నాక్స్ ని ఈజీగా చేసుకోవచ్చు.
- By News Desk Published Date - 10:30 PM, Thu - 13 July 23

సాయంత్రం(Evening) అయితే చాలు ఏ కొత్త రకమైన స్నాక్స్(Snacks) చేసుకుందామా అని అనిపిస్తుంది ఈ రోజుల్లో అందరికి. ఇక వర్షాకాలం అయితే సరదాగా సాయంత్రం వర్షం(Rain) పడుతుంటే వేడివేడిగా ఏదో ఒక వంటకం చేసుకొని తినాలనిపిస్తుంది. సేమియా(Semiya)తో మనం స్వీట్, పాయసం, ఉప్మా, కేసరి.. ఇలా రకరకాలు చేసుకొని తింటాం. అయితే సేమియా మరియు అటుకులు కలిపి సాయంత్రం సమయంలో ఇంటిలో స్నాక్స్ తయారుచేసుకోవచ్చు. సేమియా వెజ్ కట్‌లెట్స్(Semiya Veg Cutlets) అనే స్నాక్స్ ని ఈజీగా చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి.
సేమియా వెజ్ కట్‌లెట్స్ తయారీకి కావలసిన పదార్థాలు..
* మందపాటి అటుకులు ఒక కప్పు
* ఉడికించిన బంగాళాదుంపలు రెండు
* సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు
* సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి
* క్యారెట్ తురుము కొద్దిగ
* క్యాప్సికం తరిగినది ఒకటి
* చాట్ మసాలా కొద్దిగ
* కారం పొడి కొద్దిగ
* కొత్తిమీర కొద్దిగ
* నిమ్మరసం కొద్దిగ
* మైదా పావు కప్పు
* నీరు తగినంత
* శనగపిండి అర కప్పు
* సేమియా 150 గ్రాములు
సేమియా వెజ్ కట్‌లెట్స్ తయారు చేయు విధానం..
అటుకులను పావుగంట సేపు నానబెట్టి వడకట్టాలి. దీనిని మెత్తగా మెదిపి బంగాళదుంపలను ఉడికిన వాటిని కూడా కలపాలి. ఉల్లిపాయలు, క్యాప్సికం, క్యారెట్, కొత్తిమీర, జీలకర్ర, చాట్ మసాలా, మిరియాల పొడి, ఉప్పు వేసి గట్టిగా పిండినట్లు కలపాలి. అరచేతికి నూనె రాసుకొని కట్‌లెట్స్ లు లాగా చేయాలి. ఇంకొక గిన్నెలో మైదా లో కొద్దిగా ఉప్పు, నీరు పోసుకొని పలుచగా కలపాలి. ఒక ప్లేటులో శనగపిండిని కొద్దిగా నీటితో బజ్జిలకు కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇంకొక ప్లేటులో దోరగా వేంచిన సేమియాలను పెట్టుకొని ఉంచుకోవాలి.
అటుకుల మిశ్రమాన్ని కట్‌లెట్స్ లాగా తయారు చేసిన దానిని ముందుగా మైదాలో ముంచి ఆ తర్వాత శనగపిండిలో, సేమియాలో ముంచాలి. నూనెను పొయ్యి మీద కాగబెట్టాలి. కాగిన తరువాత కట్‌లెట్స్ ను చిన్న మంట మీద వేగనివ్వాలి. రంగు మారిన తరువాత మంట పెద్దదిగా చేసి ఒక నిముషం ఉంచి తియ్యాలి. అంతే వేడి వేడి సేమియా వెజ్ కట్‌లెట్స్ రెడీ. వీటికి చట్నీ లేదా సాస్ పెట్టుకొని తినవచ్చు.
Also Read : Banana Before Bed: పడుకునే ముందు అరటిపండు తినడం వల్ల కలిగే లాభాలు ఇవే?