Peanut Milk : పల్లీల పాల గురించి తెలుసా? ఎలా తయారు చేస్తారు? ప్రయోజనాలు ఏంటి?
పల్లీల పాలు(Peanut Milk) కూడా దొరుకుతాయి. పల్లీల పాలను రోజూ జిమ్ చేసేవారు, వేగన్ డైట్ ను పాటించేవారు తాగుతారు.
- By News Desk Published Date - 09:30 PM, Mon - 23 October 23

మనం అందరం రోజూ ఆవు పాలు లేదా గేదె పాలు తాగుతుంటాము. అయితే పల్లీల పాలు(Peanut Milk) కూడా దొరుకుతాయి. పల్లీల పాలను రోజూ జిమ్ చేసేవారు, వేగన్ డైట్ ను పాటించేవారు తాగుతారు. పల్లీల పాలల్లో ప్రోటీన్లు, క్యాలరీలు, విటమిన్ ఇ, బి 6 , మెగ్నీషియం, పాస్ఫరస్ వంటివి మామూలు పాల కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ పాలతో మిల్క్ షేక్స్, పెరుగు, పాయసం వంటివి కూడా తయారుచేసుకోవచ్చు.
పల్లీల పాలను తయారుచేసుకోవడానికి పల్లీలను నీటితో శుభ్రంగా కడుగుకొని ఐదు గంటల వరకు నీళ్ళల్లో నానబెట్టాలి. తరువాత వాటిని కడిగి అది మెత్తగా అయ్యేవరకు నీళ్లు పోసి మిక్సి పట్టాలి దానిని వడగట్టుకుంటే పల్లీల పాలు రెడీ అయినట్లే. వడగట్టగా వచ్చిన పల్లీల ముద్దను కూరల్లో లేదా పచ్చడి లలో వేసుకోవచ్చు. బయట అయితే కెమికల్స్ కలిపి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేసి ప్యాకెట్స్ లో అమ్ముతారు. ఈ పల్లీల పాలను మామూలు పాల వలె వాడుకోవచ్చు కానీ వీటి ధర మామూలు పాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ పాలు బయట కూడా ఈజీగా లభించవు.
ఒక కప్పు పల్లీల పాలల్లో 65 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉండడానికి, లో బిపి ఉన్నవారికి, కండరాలు సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. పల్లీల పాలను రోజూ తాగడం వలన అది మన శరీరానికి అవసరమైన పది శాతం విటమిన్ బి6 ను అందిస్తుంది. ఇది మనకు వచ్చే గుండెకు సంబంధించిన సమస్యలను రావడాన్ని తగ్గిస్తుంది. పల్లీల పాలల్లో ఉండే ఫైబర్, విటమిన్ ఇ మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. బయట దొరకకపోతే ఒకసారి ఇంట్లోనే తయారుచేసుకొని తాగి చూడండి.
Also Read : Besan Flour : శనగపిండితోనే అందం.. ముఖం కాంతివంతంగా మారాలంటే..