Chicken Fry: ఆంధ్రా స్టైల్ చికెన్ ఫ్రై.. ఇలా చేస్తే లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?
- By Sailaja Reddy Published Date - 10:00 AM, Sat - 2 March 24

మామూలుగా చాలా మందికి ఆదివారం వచ్చింది అంటే చాలా చికెన్ ఐటమ్ ఉండాల్సిందే. ఆదివారం రోజున పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ రోజున ఎక్కువ శాతం మంది మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు.. మాంసాహారంలో ముఖ్యంగా చికెన్ ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే చికెన్ తో ఎప్పుడు ఒకే రకమైన రెసిపీలు కాకుండా అప్పుడప్పుడు కొత్త కొత్తగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే మీరు ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేయాలని అనుకుంటున్నారా. అయితే ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై ను ఇలా చేస్తే లొట్టలు వేసుకుని మరి తినేస్తారు.
కావాల్సిన పదార్థాలు:
కిలో చికెన్, తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, మిరియాలు, యాలకులు, సోంపు, లవంగాలు, ఎండు మిరపకాయలు, నువ్వుల నూనె, ఉల్లిపాయ, పచ్చి మిరపకాయలు, కరివేపాకు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర.
తయారీ విధానం :
ఇందుకోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో కేజీ చికెన్ వేసి దానిలో 1 టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, 4 టీస్పూన్ల కారం వేసి బాగా కలపి దీన్ని 15 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత ఒక బాణలిని స్టవ్ పై పెట్టి నూనె వేయకుండా రెండున్నర చెంచాల ధనియాలు, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా సోంపు గింజలు, ఒక చెంచా మిరియాలు, మూడు యాలకులు, నాలుగు లవంగాలు, రెండు చిన్న చిన్న దాల్చినచెక్క ముక్కలు, పది ఎండుమిర్చి వేసి వేయించాలి. వేగిన తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. తర్వాత అన్నింటినీ మిక్సీలో వేసి నీళ్లు లేకుండా గ్రైండ్ చేసి పౌడర్ లా తయారు చేసుకోవాలి. తర్వాత బాణలిలో ఆరు చెంచాల ఆయిల్ వేసి కాగ నివ్వాలి. దీంట్లో నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయల ముక్కలు బంగారు రంగులోకి మారిన తర్వాత కొన్ని కరివేపాకులు, పక్కన పెట్టిన చికెన్ ను వేయాలి. ఆ తర్వాత రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాల తర్వాత చికెన్ లో నాలుగు చెంచాల గ్రైండ్ చేసిన మసాలా వేసి మిక్స్ చేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత చికెన్ లో మిగిలిన మసాలా, ఉప్పు వేయాలి. ఇప్పుడు మంట తగ్గించి చికెన్ ను 15 నిమిషాల పాటు వేయించాలి. అంతే వేడివేడి ఆంధ్రా స్టైల్ చికెన్ ఫ్రై రెడీ.