Feeling Anxious: మానసిక ఆందోళన ఆవహిస్తోందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!!
జీవనశైలిలో మార్పులు, తినే ఆహారం, మానసిక ఆందోళన, ఆర్థిక ఇబ్బందులు ఇలా వివిధ కారణాల వల్ల మనిషి అనారోగ్యానికి గురవుతున్నాడు.
- By Hashtag U Published Date - 08:30 AM, Sun - 25 September 22

జీవనశైలిలో మార్పులు, తినే ఆహారం, మానసిక ఆందోళన, ఆర్థిక ఇబ్బందులు ఇలా వివిధ కారణాల వల్ల మనిషి అనారోగ్యానికి గురవుతున్నాడు.
మానసిక ఒత్తిళ్ల వల్ల కుంగిపోయి
ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విలువైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకుంటే.. జీవిత సమస్యలకు పరిష్కారం దొరకదు అని గ్రహించలేకపోతున్నారు.
చాలా మందిలో అప్పుడప్పుడు కొంచెం ఆందోళనగా అనిపించడం అన్నది సాధారణం. ప్రతినిత్యం ఆందోళనతో గడుపుతుంటే మాత్రం ముప్పు ముంచుకొస్తుందని గ్రహించాలి. దీని నుండి బయటపడాల్సిన అవసరం ఉంది. అనేక మంది దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతుంటారు. ఆందోళన, ఉద్రిక్తత, భయము, ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. తొలుత ఆందోళనకు అసలు కారణం ఏమిటన్న విషయాన్ని గుర్తించటం మంచిది. తద్వారా ఆందోళన, ఒత్తిడిలను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కొన్ని చిట్కాలను పాటిస్తే మానసిక ఆందోళనల ఊబి నుంచి బయటపడొచ్చు. అవేంటో తెలుసుకుందాం..
* పదేపదే ఆలోచించవద్దు
కొన్ని కొన్ని విషయాలను పదే పదే ఆలోచించడం వల్ల అధిక ఒత్తిడికి గురై లేనిపోని ఆలోచనలు వచ్చే అవకాశాలుంటాయి. వరుసగా పనులు చేస్తుంటే ఒత్తిడికి గురవుతుంటారు. మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయాలను సైతం చూడడం, వినడం కాని చేయవద్దు. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా మానసికంగా బాగా కుంగిపోతాము. దీంతో ఆనారోగ్య సమస్యలు దరి చేరుతాయి. ఇలా అధిక ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ఆరోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
* కాఫీ,టీలు వద్దు
టెన్షన్ లో ఉన్నప్పుడు చాలామంది కాఫీ, టీ తాగుతుంటారు. దీనివల్ల టెన్షన్ మరింత పెరుగుతుంది. కాఫీ,టీలలో ఉండే కెఫీన్ వల్ల భయం, ఆందోళన చుట్టుముడుతుంది. దీనివల్ల మానసిక ఆందోళన మరింత తీవ్రతరం అవుతుంది.
* కంటి నిండా నిద్రపోండి
నిద్రలేమి తరుచుగా ఆందోళనతో ముడిపడి ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల మీ నరాలు దెబ్బతింటాయి. చిరాకు, ఉద్రేకం కలుగుతాయి. ఇవన్నీ మానసిక ఆందోళనకు ఊతం ఇస్తాయి. కంటి నిండా నిద్రపోతే ఆందోళన తగ్గించుకోవచ్చు.చాలా మంది రోజూకు నాలుగైదు గంటలు మాత్రమే పడుకుంటారు. మనం ప్రతి రోజు కనీసం ఆరు గంటలైన నిద్రించాలని నిపుణులు చెబుతున్నారు.
* మంచి ఆహారం
మనం తినే ఆహారం మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. చక్కెర అధికంగా ఉండే ఆహారం ఏమాత్రం మంచిది కాదు. దీని వల్ల ఆందోళన మరింత తీవ్రమవుతుంది. పండ్లు, కూరగాయలు , లీన్ ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఒత్తిడి ఆందోళనను తగ్గించుకోవచ్చు.
* ఒంటరితనం వద్దు
ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉండే సమయంలో వీలైనప్పుడు అందరితో కలిసిపోయేలా ఉండాలి. స్నేహితులతో మాట్లాడుతుండాలి. ఏవైనా సమస్యలుంటే వారితో షేర్ చేసుకుంటే కొంత కొంత ఒత్తిడి అనేది దూరమవుతుంది. చీకటిలో ఉండకుండా ఫ్రీగా ఉండటం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా నిద్రలేమి సమస్య కూడా అనారోగ్యానికి గురి చేస్తుంది.
* సినిమాలు చూడండి
ఇంట్లోనే ఉంటూ బంధువులు, స్నేహితులతో మాట్లాడడం, పజిల్స్ సాధించడం, స్టోరీబుక్స్ చదువుతూ ఉండాలి. వ్యాయామాలు చేయడం, ఇంట్లో వారికి పనుల్లో సాయం చేయడం, కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడడం, కుటుంబసభ్యులతో కలసి ఉండడం చేస్తూ ఉండాలి. మరీ ఎక్కువ ఒత్తిడికి గురైనపుడు గదిలో ఒంటరిగా ఉండకూడదు. అలాగే ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు సొంత వైద్యం చేసుకుని ఇబ్బంది పడకుండా అందుబాటులో ఉన్న సరైన వైద్యున్ని సంప్రదించి తగిన సహాయం పొందాలి.
* బైకాట్ మద్యపానం, ధూమపానం
మానసిక ఆందోళన ఉన్నప్పుడు
మద్యం తాగితే ఒక సహజ నిస్పృహ కలుగుతుంది. అయితే మద్యం మత్తు దిగిన తర్వాత ,మునుపటి కంటే ఎక్కువ మానసిక ఆందోళనగా ఉంటారు. అధిక మోతాదులో మద్యం సేవించటం వల్ల డిప్రెషన్‌కు దారి తీస్తుంది. ఆల్కహాల్ లాగానే, ధూమపానం ఆందోళనల నుండి ఉపశమనం కలిగించే సమయం తక్కువగా ఉంటుంది. తరువాత ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తాయి.
* వ్యాయామం , ధ్యానం
రెగ్యులర్ గా వ్యాయామం మీ శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. వ్యాయామాలు ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తాయి. ఇవి మానసిక స్థితిని పెంచడానికి సహాయపడతాయి. వీటి ప్రభావం ఒక్కోసారి గంటల తరబడి కొనసాగుతాయి. కాబట్టి సాధారణ ఉపశమనాన్ని పొందేందుకు ఇది గొప్ప మార్గం. ధ్యానం అస్తవ్యస్తమైన ఆలోచనల నుండి మనస్సును మరల్చటంలో సహాయపడుతుంది. నరాలను శాంతపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనను పోగొట్టటంలో ధ్యానం సహాయపడుతుంది. దీని వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.