క్రిస్మస్ కేక్ కథ.. గంజి నుండి ఫ్రూట్ కేక్ వరకు ఎలా మారింది?
నేటి కాలంలో మనం రుచి చూసే రిచ్ ఫ్రూట్ కేక్ (ఇందులో రమ్, దాల్చినచెక్క, జాజికాయ, చెర్రీస్, కిస్‌మిస్, బాదం ఉంటాయి) వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది.
- Author : Gopichand
Date : 24-12-2025 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
Christmas Cake: క్రిస్మస్ పండుగ అనగానే క్రిస్మస్ ట్రీ తర్వాత అందరికీ గుర్తొచ్చేది కేక్. ఈ పండుగలో కేక్ అనేది ఒక ప్రధానమైన తీపి పదార్థం. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే మొదటి క్రిస్మస్ కేక్ అసలు కేక్ కాదని, అది ప్లమ్ పారిడ్జ్ (Plum Porridge- ఒక రకమైన గంజి) అని మీకు తెలుసా? క్రిస్మస్ కేక్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇక్కడ ఉంది.
క్రిస్మస్ కేక్ చరిత్ర
నేటి కాలంలో మనం రుచి చూసే రిచ్ ఫ్రూట్ కేక్ (ఇందులో రమ్, దాల్చినచెక్క, జాజికాయ, చెర్రీస్, కిస్‌మిస్, బాదం ఉంటాయి) వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. పాత కాలంలో క్రిస్మస్ వేడుకలను డిసెంబర్ 6 నుండి జనవరి 6 వరకు అంటే నెల రోజుల పాటు జరుపుకునేవారు. శీతాకాలం కావడం వల్ల ప్రజలు ఈ పండుగను ఎక్కువ కాలం ఎంజాయ్ చేసేవారు.
Also Read: క్రిస్మస్ పండుగ.. డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు?
ఆ సమయంలో ‘అడ్వెంట్’ (క్రిస్మస్‌కు ముందు చేసే ఉపవాసం) సమయంలో ప్రజలు చాలా తేలికపాటి, సాధారణ ఆహారాన్ని తీసుకునేవారు. ఉపవాసం పూర్తయిన తర్వాత వారు ‘ప్లమ్ పారిడ్జ్’ తయారు చేసేవారు. ఇందులో గోధుమ రవ్వ లేదా దాలియా, మసాలా దినుసులు, తేనె, ఎండిన రేగు పండ్లు కలిపి వండేవారు. ఇది కేవలం రుచికరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసేది.
గంజి నుండి కేక్‌గా మార్పు
16వ శతాబ్దంలో ఈ రేగు పండ్ల గంజి కొత్త రూపాన్ని సంతరించుకుంది. గంజిలో ఓట్స్ లేదా రవ్వకు బదులుగా గుడ్లు, పిండి, మసాలాలు, వెన్న కలపడం ప్రారంభించారు. దీనివల్ల అది గంజిలా కాకుండా కేక్ లాగా మారడం మొదలైంది. అప్పట్లో ధనవంతులు తమ కేకుల్లో డ్రై ఫ్రూట్స్, షుగర్ కోటెడ్ మిశ్రమాలను కలిపి అందంగా అలంకరించేవారు. క్రమక్రమంగా ఇది ‘క్రిస్మస్ కేక్’గా గుర్తింపు పొందింది. 18, 19వ శతాబ్దాలలో పారిశ్రామిక విప్లవం రావడం వల్ల ప్రజలు పనుల్లో బిజీ అయిపోయారు. దీనితో నెల రోజుల పాటు జరిగే క్రిస్మస్ వేడుకలు కాస్తా కేవలం డిసెంబర్ 25కే పరిమితం అయ్యాయి.