Zepto : చెన్నైలో ఐటీ ఉద్యోగినిపై జెప్టో డెలివరీ బాయ్ అత్యాచారయత్నం
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ యువతిపై అత్యాచారయత్నం చేసి పారిపోయిన జెప్టో డెలివరీ బాయ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.
- By Kavya Krishna Published Date - 11:28 AM, Sun - 22 June 25

Zepto : సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ యువతిపై అత్యాచారయత్నం చేసి పారిపోయిన జెప్టో డెలివరీ బాయ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన చెన్నై నగరంలోని కుబేరన్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధిత యువతి మడిపాక్కం ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ డెలివరీ సేవలు ఎక్కువైపోతున్న తరుణంలో, వినియోగదారుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తేలా చేసింది ఈ దారుణం. వివరాల్లోకి వెళితే… బాధితురాలు జెప్టో యాప్ ద్వారా వస్తువులు ఆర్డర్ చేసింది. ఆ ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి గోపినాథ్ అనే డెలివరీ బాయ్ బాధితురాలికి చేరుకున్నాడు. డెలివరీ అనంతరం అతడు తన మొబైల్ ఫోన్ చార్జింగ్ అయిపోయిందని చెప్పి, కొద్దిసేపు చార్జింగ్ పెట్టుకోవడానికి ఆమె ఇంట్లోకి అనుమతి కోరాడు.
అనుమానించని బాధితురాలు అతడిని ఇంట్లోకి అనుమతించింది. అదే సమయంలో ఇంట్లో ఎవరూ లేని పరిస్థితిని గమనించిన గోపినాథ్, ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. యువతి బహిరంగంగా కేకలు వేయడంతో గోపినాథ్ భయంతో పరారయ్యాడు.
తర్వాత బాధితురాలు జెప్టో సంస్థకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో ఆమె నేరుగా పోలీసులను ఆశ్రయించింది. కేజీఎం కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆధారాల ఆధారంగా గోపినాథ్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. అతని మీద ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై జెప్టో సంస్థ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వినియోగదారుల భద్రత కోసం సంస్థలు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ కేసు మరోసారి ఇంటికి వచ్చే డెలివరీ బాయ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.
US attacks Iran Nuclear Sites: ఇరాన్‌పై 3 అణు కేంద్రాలపై బాంబుల వర్షం