YCP Support to NDA Alliance : ఏన్డీఏకు వైసీపీ మద్దతు ..
లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది. దీనికి వైసీపీ సానుకూలంగా స్పందించింది
- By Sudheer Published Date - 09:48 PM, Tue - 25 June 24

దేశ రాజకీయాల్లో మరో అసక్తికర అంశం చోటుచేసుకుంది. లోక్ సభ స్పీకర్ ఎన్నిక అంశంలో ఏన్డీఏకు వైసీపీ మద్దతు తెలిపింది. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి.. జనసేన , టీడీపీ తో కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించగా.. వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 151 స్థానాల నుంచి ఏకంగా 11 సీట్లకు పడిపోయింది. ఇక టీడీపీ జనసేన బీజేపీ కూటమి 164 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే లోక్‌సభలోకూడా ఎన్డీఏ కూటమి భారీ స్థానాలే సాధించింది. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఇందులో ఎన్డీఏ కూటమికి 21 సీట్లురాగా.. వైసీపీకి 4 సీట్లు వచ్చాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఇక కేంద్రంలో సొంతంగా బీజేపీ మెజార్టీ మార్కు సాధించకపోయినప్పటికీ .. మిత్ర పక్షాలతో కలిసి మోడీ అధికారాన్ని చేపట్టారు. అయితే తాజాగా మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి.. ఏపీలో వైసీపీ మద్దతు కోరింది. లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది. దీనికి వైసీపీ సానుకూలంగా స్పందించింది. అయితే జగన్ సానుకూలంగా స్పందించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ.. వైసీపీ ఓటమికి ప్రత్యక్షంగా కారణమైనప్పటికీ జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిని రేపుతోంది. సభ మర్యాదను కాపాడేందుకు జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా? లేక భవిష్యత్తులో బీజేపీతో దోస్తీ కొనసాగించేందుకు సానుకూలంగా స్పందించాడా? లేక తనపై ఉన్న కేసుల నుండి బయట పడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడా..? అనేది ఇప్పుడు చర్చగా మారింది.
ఇక భారత చరిత్రలో తొలిసారి లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుండటం ఆసక్తికరంగా మారింది. మాములుగా స్పీకర్ పదవిని అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మోదీ 2.0 పాలనతో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు కొనసాగాయి. కానీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు గెల్చుకున్న ప్రతిపక్షాలు డిప్యూటీ స్పీకర్ పోస్టు కావాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఈ అలా చేయకపోతే సభాపతి పదవికి తాము అభ్యర్థిని నిలబెడతామని స్పష్టం చేశాయి. ఈ క్రమంలో NDA కూటమి మిగతా పార్టీల మద్దతును కోరుతుంది.
Read Also : Lok Sabha Speaker : రేపే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. ఏ పద్ధతిలో జరగబోతోంది ?