Changur Baba : ఛాంగుర్ బాబా ఎవరు? ఇతడిపై ఈడీ ఎందుకు కేసు పెట్టింది?
Changur Baba : ఛాంగుర్ బాబాకు విదేశాల నుంచి వచ్చిన నిధులపై ఈడీ విచారణ చేపట్టింది. విదేశీ సహాయ నిధుల ద్వారా ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు కలిసి అనేక బ్యాంక్ ఖాతాల ద్వారా
- By Sudheer Published Date - 01:15 PM, Fri - 11 July 25

ఉత్తరప్రదేశ్‌కు చెందిన జమాలుద్దీన్ అలియాస్ ఛాంగుర్ బాబా (Changur Baba) ప్రస్తుతం తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. భిక్షాటన చేసి రంగురాళ్లు అమ్మిన స్థాయి నుంచి మతగురువుగా ఎదిగిన ఆయనపై ఇప్పుడు మతమార్పిళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పోలీసులు కేసులు నమోదు చేశారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) ఛాంగుర్ బాబాను అరెస్టు చేయగా, ఆయన నివసిస్తున్న బలరాంపూర్ జిల్లాలోని ఇంటిని ప్రభుత్వ యంత్రాంగం బుల్డోజర్‌తో కూల్చివేసింది. ఈ ఇంటి నిర్మాణం అక్రమమని అధికారులు చెబుతుండగా, అది ఆయన శిష్యురాలి పేరిట ఉందని, విదేశీ నిధులతో అక్రమంగా నిర్మించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
Jana Sena : టీవీ రామారావుపై జనసేన పార్టీ సస్పెన్షన్ వేటు!
ఛాంగుర్ బాబా జీవితం సామాన్య స్థాయి నుంచి ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్‌గా రెండుసార్లు సేవలందించిన ఆయన ముంబయిలో పరిచయాల ద్వారా గుర్తింపు పొందారు. స్థానికంగా ప్రార్థనా మందిరం ఏర్పాటు చేసి అనేక శిష్యులను సంపాదించుకున్నారు. బాబా అనుచరుల్లో ఒకరైన బబ్బు చౌదరి గతంలో ఆయనపై మతమార్పిళ్లకు సంబంధించి ఫిర్యాదు చేయడం, ఆ తరువాత కేసులు నమోదవడం ప్రారంభమయ్యాయి. విచారణలో భాగంగా పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించిన అనేక ఖాతాలను గుర్తించి, రూ.100 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రంగంలోకి దిగింది. ఛాంగుర్ బాబాకు విదేశాల నుంచి వచ్చిన నిధులపై ఈడీ విచారణ చేపట్టింది. విదేశీ సహాయ నిధుల ద్వారా ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు కలిసి అనేక బ్యాంక్ ఖాతాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మతమార్పిడుల పేరుతో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ కేసు మరింత కీలకంగా మారింది. ముంబయిలో నివసించే నీతూ రోహ్రా అలియాస్ నస్రీన్ కూడా ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించారని, ఆమె బాబాకు శిష్యురాలిగా మారి మతం మార్చుకున్నారని పోలీసులు పేర్కొన్నారు.
Shubman Gill: టీమిండియా వన్డే కెప్టెన్‌గా శుభమన్ గిల్?
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కేసుపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర శాంతిభద్రతలకు భంగం కలిగించేవారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఛాంగుర్ బాబా కుటుంబ సభ్యులతో పాటు సంబంధిత ముఠా సభ్యుల ఆస్తులను జప్తు చేస్తామని చెప్పారు. ఇప్పటికే బాబా కుమారుడు మెహబూబ్, శిష్యుడు నవీన్ రోహ్రా, నస్రీన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఇది మత మార్పిడి పేరుతో జరుగుతున్న ఆర్థిక నేరాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు నిదర్శనంగా నిలుస్తోంది.