Constitution Framers Words On UCC : యూసీసీపై రాజ్యాంగ నిర్మాతలు ఏమన్నారో తెలుసా?
Constitution Framers Words On UCC : యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)పై మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సరిగ్గా ఏడాది తర్వాత (1948 నవంబర్ 23న) మొదటిసారిగా రాజ్యాంగ సభలో చర్చ జరిగింది.
- By Pasha Published Date - 10:14 AM, Sat - 8 July 23

Constitution Framers Words On UCC : యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ).. ఇప్పుడు అంతటా దీనిపైనే చర్చ జరుగుతోంది..
దీని గురించి చర్చ జరగడం ఇదే తొలిసారేం కాదు..
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సరిగ్గా ఏడాది తర్వాత (1948 నవంబర్ 23న) యూసీసీపై మొదటిసారిగా రాజ్యాంగ సభలో చర్చ జరిగింది.
ముంబై రాజ్యాంగ సభ సభ్యుడు, కాంగ్రెస్‌కు చెందిన మీను మసాని అప్పట్లో యూసీసీ అంశాన్ని ప్రతిపాదించారు. దీంతో ఆ టాపిక్ పై విస్తృతమైన చర్చ జరిగింది.
ఆ సభలో పలువురు రాజ్యాంగ నిర్మాతలు ఏమన్నారో ఒకసారి చూద్దాం..
1948లో అప్పట్లో యూసీసీ ప్రతిపాదనకు రాజ్యాంగ సభలో జరిగిన చర్చలో మహిళా సభ్యుల నుంచి గణనీయమైన మద్దతు లభించింది. రాజ్యాంగ పరిషత్‌లో 15 మంది మహిళా సభ్యులు ఉండేవారు. ఈ 15 మందిలో హన్సా మెహతా ఒకరు. ఆమె ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ సభ్యురాలుగా యూసీసీకి సపోర్ట్ కోసం ఆనాడు లాబీయింగ్ చేశారు. డాక్టర్ భీంరావ్ అంబేద్కర్, రాజ్‌కుమారి అమృత్ కౌర్, మీను మసాని, కన్హయ్యలాల్ మాణిక్‌లాల్ మున్షీ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌లు UCC అమలును గట్టిగా సమర్థించారు. దానికి అనుకూలంగా గట్టిగా వాదించారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో సహా దాదాపు మొత్తం కాంగ్రెస్ కూడా UCCకి మద్దతుగా నిలిచిందని తెలుపుతూ ఓ జాతీయ మీడియా విశ్లేషణాత్మక కథనాన్ని (Constitution Framers Words On UCC) ప్రచురించింది.
Also read : Mukesh Ambani Diwali Gift : 36 లక్షల మంది షేర్ హోల్డర్లకు ముకేశ్ అంబానీ దీపావళి గిఫ్ట్!
యూసీసీని వ్యతిరేకించిన మొదటి వ్యక్తి ఆయనే
రాజ్యాంగ సభలో UCCని వ్యతిరేకించిన మొదటి వ్యక్తి చెన్నైకు చెందిన మొహమ్మద్ ఇస్మాయిల్. యూసీసీలో సవరణలు చేయాలని అప్పట్లో ప్రతిపాదించిన వారిలో నజీరుద్దీన్ అహ్మద్, మెహబూబ్ అలీ బేగ్, బి పోకర్ సాహెబ్, అహ్మద్ ఇబ్రహీంతో పాటు ఇస్మాయిల్ కూడా ఉన్నారు. దీంతో పాటు ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదం ఇచ్చిన ఉర్దూ కవి మౌలానా హస్రత్ మొహానీ కూడా ఈ చర్చలో పాల్గొని యూసీసీని వ్యతిరేకించారు. యూనిఫాం సివిల్ కోడ్‌పై రాజ్యాంగ సభ చర్చల్లో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. యూసీసీని అప్పట్లో ప్రవేశపెట్టిన వారితో పాటు సమర్ధించిన వారు.. స్త్రీ పురుష సమానత్వం, జాతీయ ఐక్యత, న్యాయ వ్యవస్థ ఆధునికీకరణ అవసరాన్ని నొక్కిచెప్పారు. యూసీసీని వ్యతిరేకించిన వారు మత స్వయం ప్రతిపత్తి, మైనారిటీ హక్కులు, సాంస్కృతిక వైవిధ్యం యొక్క ప్రాముఖ్యతను లేవనెత్తారు.
Also read : Chemical Weapons Big Announcement : అమెరికా రసాయన ఆయుధాలు ఖతం.. ఏమిటీ కెమికల్ వెపన్స్, బయో వెపన్స్ ?
యూనిఫామ్ సివిల్ కోడ్‌పై ఎవరు.. ఏమి చెప్పారు ?
1. డాక్టర్ BR అంబేద్కర్ (రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్)
- లింగ సమానత్వాన్ని సాధించడానికి, వ్యక్తిగత చట్టాల వల్ల జరుగుతున్న వివక్షను తొలగించడానికి UCCకి మద్దతు ఇస్తున్నా అని రాజ్యాంగ సభ చర్చలో అంబేద్కర్ చెప్పారు. వివాహం, విడాకులు, వారసత్వ విషయాలలో మహిళలకు సమాన హక్కులను కల్పించే సమగ్ర సివిల్ కోడ్ ను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
2. జవహర్‌లాల్ నెహ్రూ (భారత తొలి ప్రధానమంత్రి)
- మతాల ఆధారంగా ఉన్న వ్యక్తిగత చట్టాల స్థానంలో UCCని తీసుకొస్తే అభ్యంతరం లేదని నెహ్రూ చెప్పారు. సామాజిక సంస్కరణ, సామాజిక ఉన్నతి జరగాల్సిన అవసరం ఉందన్నారు. బలమైన భారతదేశ నిర్మాణానికి యూసీసీ దోహదం చేస్తుందని చెబుతూనే.. లౌకికవాదం, వ్యక్తిగత హక్కులకు విఘాతం కలగకుండా చూడాలని నెహ్రూ అన్నారు.
3. సర్దార్ వల్లభాయ్ పటేల్ (భారత తొలి ఉప ప్రధాన మంత్రి)
- జాతీయ సమైక్యతను పెంపొందించేలా యూసీసీ ఉండాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు. వివిధ అంశాల విషయంలో మతపరమైన వ్యక్తిగత చట్టాలలో ఉన్న వైరుధ్యాలను తొలగించేలా యూసీసీ ఉండాలని చెప్పారు.
4. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ (రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడు)
- మహిళలకు సమాన హక్కులను అందించి.. స్త్ర్రీ, పురుషులకు సమ న్యాయం చేకూర్చేలా యూసీసీ ఉండాలని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. UCCని అమలు చేయడంలో ఎన్నో సవాళ్లు ఉంటాయని.. ఇందుకోసం భారతదేశ న్యాయ వ్యవస్థను ఆధునీకరించాలని సూచించారు.
5. మౌలానా అబుల్ కలాం ఆజాద్ (భారత తొలి విద్యాశాఖ మంత్రి)
- UCC అమలుతో మతపరమైన స్వేచ్చకు, మైనారిటీల హక్కులకు విఘాతం కలగొచ్చని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ సాంస్కృతిక, మతపరమైన వైవిధ్యాన్ని గౌరవిస్తూ అన్ని మతాల వ్యక్తిగత చట్టాలకు రక్షణ కల్పించాలన్నారు.