UPSC Chairman : యూపీఎస్సీ ఛైర్మన్ అనూహ్య రాజీనామా.. కారణం అదేనా ?
మహారాష్ట్ర క్యాడర్ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది.
- By Pasha Published Date - 01:00 PM, Sat - 20 July 24

UPSC Chairman : మహారాష్ట్ర క్యాడర్ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది. ఇలాంటి వారిని సివిల్ సర్వీసెస్‌కు ఎలా ఎంపిక చేశారనే ప్రశ్నలను అందరూ లేవనెత్తుతున్నారు. ఈ వివాదం నేపథ్యంలో అనూహ్యంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆయన గతేడాది ఏప్రిల్ నెలలోనే యూపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. మరో ఐదేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడంపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది.
We’re now on WhatsApp. Click to Join
రెండువారాల కిందటే రాష్ట్రపతికి రాజీనామా లేఖ
వాస్తవానికి 2029 మే 15 వరకు మనోజ్ సోనీ(UPSC Chairman) పదవీకాలం ఉంది. దాదాపు రెండువారాల కిందటే ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించినట్లు తెలిసింది. అయితే, దీన్ని ఇంకా ఆమోదించలేదని సమాచారం. 2017లో యూపీఎస్సీలో సభ్యుడిగా చేరిన ఆయన.. గతేడాది మే నెలలో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. మనోజ్ సోనీ ఎందుకీ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు ? అనేది తెలియరావడం లేదు. తనను యూపీఎస్సీ ఛైర్మన్ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని గతంలోనే ఓసారి మనోజ్ సోనీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెబుతున్నారు. ఇకపై ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలని ఆయన కోరుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read :Singer Jayaraj : ప్రముఖ కవి జయరాజ్‌కు గుండెపోటు.. నిమ్స్‌లో అత్యవసర చికిత్స
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు
మనోజ్ సోనీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు. 2005లో ఆయన వడోదరలోని ప్రసిద్ధ ఎంఎస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా సేవలు అందించారు. యూపీఎస్సీ ఛైర్మన్ పదవిని చేపట్టడానికి ముందు ఆయన గుజరాత్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వరుసగా రెండుసార్లు వీసీగా సేవలు అందించారు. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఏటా సివిల్స్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తుంటుంది.