UP Elections 2022 : యూపీలో మరో మంత్రి బీజేపీకి గుడ్ బై
యూపీ బీజేపీ మంత్రులు రాజీనామా పర్వం కొనసాగుతోంది. మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేసి 24 గంటల తిరగకముందే మరో మంత్రి దారా సింగ్ చౌహాన్ బుధవారం మంత్రివర్గానికి రాజీనామా చేశాడు.
- Author : CS Rao
Date : 12-01-2022 - 4:44 IST
Published By : Hashtagu Telugu Desk
యూపీ బీజేపీ మంత్రులు రాజీనామా పర్వం కొనసాగుతోంది. మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేసి 24 గంటల తిరగకముందే మరో మంత్రి దారా సింగ్ చౌహాన్ బుధవారం మంత్రివర్గానికి రాజీనామా చేశాడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదవికి రాజీనామా చేసిన రెండో ఉత్తరప్రదేశ్ మంత్రి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, మంగళవారం ఉత్తరప్రదేశ్ కార్మిక మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మంత్రివర్గం నుంచి తప్పుకోవడంతో పాటు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి గుడ్ బై చెప్పాడు. రాష్ట్రంలోని మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఇదే బాట పట్టి బీజేపీని వీడారు.తాజాగా రాజీనామా చేసిన దారా సింగ్ చౌహాన్ అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా యోగి క్యాబినెట్లో పనిచేశాడు. వెనుకబడిన తరగతులు, దళితులను యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన రాజీనామా చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దారా సింగ్ చౌహాన్ రాజీనామా చేయడం గమనార్హం. ఎన్నికలకు ముందు కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారం రాజీనామా చేయడంతో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత 24 గంటల్లో స్వామికి సన్నిహితంగా ఉండే మరో నలుగురు ఎమ్మెల్యేలు రోషన్ లాల్ వర్మ, బ్రిజేష్ ప్రజాపతి, భగవతి సాగర్, వినయ్ షాక్యా తమ రాజీనామాలను ప్రకటించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేష్ సైనీ, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే హరి ఓం యాదవ్ బుధవారం బీజేపీలో చేరడం గమనార్హం.