VIPs – Ayodhya : వీఐపీలు శ్రీరాముడి ప్రతిష్ఠాపనోత్సవానికి రావొద్దన్న రామజన్మభూమి ట్రస్ట్.. ఎందుకు ?
VIPs - Ayodhya : అయోధ్యలోని నవ్య భవ్య రామమందిరంలో జనవరి 22న శ్రీరాముడి ప్రతిష్ఠాపనోత్సవం జరగబోతోంది.
- Author : Pasha
Date : 13-10-2023 - 8:03 IST
Published By : Hashtagu Telugu Desk
VIPs – Ayodhya : అయోధ్యలోని నవ్య భవ్య రామమందిరంలో జనవరి 22న శ్రీరాముడి ప్రతిష్ఠాపనోత్సవం జరగబోతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ కీలక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాయబారులతో సహా వీఐపీ ప్రోటోకాల్‌లను కలిగిన వారు జనవరి 22న కాకుండా ఇతర రోజుల్లో అయోధ్యకు రావాలని కోరారు. ఆ రోజున శ్రీరాముడి ప్రతిష్ఠాపనోత్సవానికి ప్రధాని మోడీ హాజరవుతున్నందున ఆయన భద్రతా ఏర్పాట్లలో మొత్తం యంత్రాంగం బిజీగా ఉంటుందని, ఈ తరుణంలో ఇతర వీఐపీలకు తగినంత భద్రత కల్పించే అవకాశాలు ఉండకపోవచ్చని ఆయన చెప్పారు. ఎవరికీ అసౌకర్యం కలుగకూడదనే ఉద్దేశంతోనే ఆ ఒక్కరోజు అయోధ్య సందర్శనకు దూరంగా ఉండాలని వీఐపీలను కోరుతున్నట్లు పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
శ్రీరాముడి ప్రతిష్ఠాపనోత్సవం జరిగిన తర్వాత జనవరి 26 నుంచి ఫిబ్రవరి 22 వరకు దేశంలోని ప్రతి రాష్ట్ర ప్రజలు అయోధ్యను సందర్శనకు వస్తారని తెలిపారు. తమతమ రాష్ట్రాల ప్రజలు అయోధ్యకు వచ్చినప్పుడు.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నాయకులు వారితో కలిసి రామయ్యను దర్శించుకోవాలని చంపత్ రాయ్ కోరారు. ‘‘అయోధ్యకు వచ్చే ప్రజలకు భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తాం. కానీ అది హోటల్ రేంజ్ లో ఉండదు. రాముడు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు దుంపలు కూడా తిన్నారు. మేం దాని కంటే మంచి ఫుడ్ ఇస్తాం’’ అని ఆయన వెల్లడించారు. శ్రీరాముడి ప్రతిష్ఠాపనోత్సవ ఏర్పాట్ల కోసం నవంబర్ 5న అన్ని రాష్ట్రాల నుంచి విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రతినిధులను అయోధ్యకు పిలిపించామని చంపత్ రాయ్ చెప్పారు. అయోధ్య రామాలయంలోని పూజారులు, ఇతర ఉద్యోగుల జీతాలను మే నెలలోనే 40 శాతం దాకా పెంచామని తెలిపారు. ప్రధాన అర్చకుడి జీతం నెలకు రూ.25 వేల నుంచి రూ.32,900కు, సహాయ అర్చకుల జీతం నెలకు రూ.20 వేల నుంచి రూ.31 వేలకు (VIPs – Ayodhya) పెంచారు.