Electoral Bonds : రేపు ఎలక్టోరల్ బాండ్ల మరో లిస్టు.. ఈసీకి సుప్రీం ఆదేశం
Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని సమగ్రంగా అందించలేదంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
- Author : Pasha
Date : 15-03-2024 - 12:39 IST
Published By : Hashtagu Telugu Desk
Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని సమగ్రంగా అందించలేదంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) ఎందుకు ఇవ్వలేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై ఎస్‌బీఐకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను మార్చి 18 (సోమవారం)కి వాయిదా వేసింది. ఆలోగా తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఎస్‌బీఐని ఆదేశించింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను సోమవారం నాటికి ఈసీకి అందజేయాలని స్పష్టం చేసింది.
We’re now on WhatsApp. Click to Join
ఎన్నికల బాండ్లలోని(Electoral Bonds) సమాచారం అసంపూర్తిగా ఉందంటూ కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సీజేఐ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఎలక్టోరల్ బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లను ఎస్‌బీఐ తమకు సమర్పించలేదని కోర్టు దృష్టికి ఈసీ తీసుకెళ్లింది. దీంతో ఎస్‌బీఐపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘బాండ్ల నంబర్లు లేకపోవడంతో ఏయే కంపెనీ.. ఏయే రాజకీయ పార్టీలకు ఎంతమేర విరాళాలు ఇచ్చిందో స్పష్టంగా తెలియడం లేదు. అన్ని వివరాలను వెల్లడించాలని మేం తీర్పులోనే పేర్కొన్నా.. మీరు ఎందుకు ఇవ్వలేదు’’ అని ఎస్‌బీఐను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Also Read :Putin Fifth Term : రష్యాలో మొదలైన ఓట్ల పండుగ.. పుతిన్‌కు ఓటమా ? గెలుపా ?
ఎన్నికల బాండ్లపై మార్చి 11న ఇచ్చిన తీర్పును కొంత సవరించాలని ఈ పిటిషన్‌లో సుప్రీంకోర్టును కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. అందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అసలు విషయం ఏమిటంటే.. 2019 ఏప్రిల్ 12వ తేదీకి ముందు జారీ అయిన ఎలక్టోరల్ బాండ్లు, వాటిని ఎన్‌క్యాష్ చేసుకున్న రాజకీయ పార్టీల వివరాలను ఈసీ గతంలో రెండు సార్లు సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. 2019 ఏప్రిల్ 19 నుంచి ఫిబ్రవరి 15 వరకు గత ఐదేళ్లలో జారీ చేసిన బాండ్ల వివరాలను ఈసీకి అందజేయాలని ఎస్‌బీఐని ఇటీవల (మార్చి 11న) ఆదేశించిన సుప్రీం.. అంతకంటే ముందు నాటి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కూడా బహిర్గతం చేయాలని ఈసీకి కూడా సూచించింది. అయితే 2019 ఏప్రిల్‌కు మునుపటి ఎలక్టోరల్ బాండ్ల కాపీలు తమ వద్ద లేవని సుప్రీంకోర్టుకు ఈసీ తెలిపింది. తాము గతంలో సుప్రీంకు సమర్పించిన కాపీలను తిరిగి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. ఇందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. గతంలో ఈసీ ఇచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను స్కాన్ చేసి డిజిటలైజ్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఆ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లను ఈసీకి ఇవ్వాలని నిర్దేశించింది. 2019 ఏప్రిల్‌కు మునుపటి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను శనివారం (మార్చి 16న) సాయంత్రం 5 గంటల్లోపు వెబ్‌సైట్‌లో బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.