PM security breach: దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ
- Author : hashtagu
Date : 10-01-2022 - 1:12 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రత వైఫల్యానికి సంబంధించి దాఖలైన వాజ్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ ఘటనపై స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
ఈ కమిటీలో పంజాబ్ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంటుందని జస్టిస్ ఎన్.వి. రమణ వెల్లడించారు. ఇందులో చండీగఢ్ డీజీపీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఐజీ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. కమిటీ ఏర్పాటుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్, పంజాబ్ ప్రభుత్వం వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ వెల్లడించారు.
గతవారం పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ జిల్లాకు ప్రధాని మోదీ వెళుతుండగా నిరసనకారులు రహదారిని అడ్డుకోవడంతో ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాలపాటు ఫ్లైఓవర్‌పై ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ‘లాయర్స్ వాయిస్’ అనే సంస్థ వేసిన పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర హోంశాఖ, పంజాబ్ ప్రభుత్వం వేసిన కమిటీలు తక్షణమే తమ దర్యాప్తులను నిలిపివేయాలని ఆదేశించింది. తాజాగా సోమవారం మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం.. ఘటనపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలు వేసిన కమిటీల దర్యాప్తుపై స్టే అలాగే కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.