Typhoon Yagi: భారత్‌కు మరో తుఫాను ముప్పు.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!
చైనాను వణికిస్తున్న సూపర్ టైఫూన్ యాగీ ప్రభావం భారత్‌పై కూడా పడవచ్చని భారత వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- By Gopichand Published Date - 12:18 PM, Sat - 7 September 24

Typhoon Yagi: శతాబ్దపు అతిపెద్ద తుఫాను వచ్చింది. దీని పేరు యాగీ (Typhoon Yagi). ఈ తుఫాను మొదట ఫిలిప్పీన్స్‌లో 16 మందిని బలితీసుకుంది. ఇప్పుడు అది చైనా వైపు కదులుతోంది. ఇండో పసిఫిక్ మహాసముద్రం నుంచి ఉద్భవించిన ఈ తుఫాను చైనా దక్షిణ తీరాన్ని తాకింది. దీంతో గంటకు దాదాపు 350 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. చైనా రెడ్ అలర్ట్‌లో ఉంది. హైనాన్ ప్రావిన్స్‌ను ఖాళీ చేయమని చైనా ప్రభుత్వం స్థానికులను ఆదేశించింది.
దాదాపు 5 లక్షల మందిని ప్రావిన్స్ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టైఫూన్ యాగీ నిన్న హైనాన్‌లోని వెన్‌చాంగ్ నగరాన్ని తాకింది. దాని కారణంగా వచ్చిన గాలులు చాలా విధ్వంసం సృష్టించాయి. ప్రస్తుతం హైనాన్ ప్రావిన్స్‌లో జనజీవనం స్తంభించింది. స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. రైలు, రోడ్డు, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా నివేదిక ప్రకారం.. తుఫాను నిరంతరం ఊపందుకుంటుంది. హైనాన్, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సుల గుండా బీబు గల్ఫ్ వైపు వెళుతుంది.
Also Read: Terror Attack Plot : న్యూయార్క్‌లో యూదులపై ఉగ్రదాడికి స్కెచ్.. పాకిస్తానీయుడి అరెస్ట్
భారత్‌పై తుఫాను ప్రభావం
చైనాను వణికిస్తున్న సూపర్ టైఫూన్ యాగీ ప్రభావం భారత్‌పై కూడా పడవచ్చని భారత వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్ణాటక, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో వచ్చే వారం రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయి. ఈ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 15 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
మరో 2 తుఫానులు సిద్ధంగా ఉన్నాయి
టైఫూన్ యాగీ కాకుండా.. మరో రెండు తుఫానులు ప్రపంచంలో విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి. భారతదేశంలోని గుజరాత్ జిల్లాలోని కచ్‌ను ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతం నుండి ఉద్భవించిన ఆసనా తుఫాను అరేబియా సముద్రాన్ని చేరుకోగానే భయంకరమైన రూపాన్ని సంతరించుకుని పాకిస్తాన్ వైపు కదులుతోంది. ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన తుపాను ‘షాన్‌షాన్’ జపాన్‌లోకి కూడా ప్రవేశించింది. టైఫూన్ యాగీని 10 సంవత్సరాలలో అత్యంత శక్తివంతమైన టైఫూన్ అని పిలుస్తారు. అయితే ఇది జూలై 2014లో వచ్చిన టైఫూన్ రామసున్ కంటే కొంచెం బలహీనంగా ఉంది. ఈ తుపాను కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోంది. ఇది భారతదేశంలోని వాతావరణంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది.