Sriram Akhand Jyoti : అయోధ్య రామమందిరంలో అఖండ జ్యోతి.. విశేషాలివీ..
Sriram Akhand Jyoti : అయోధ్య రామమందిరంలో జనవరి 22న బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగబోతోంది.
- By Pasha Published Date - 11:49 AM, Mon - 8 January 24

Sriram Akhand Jyoti : అయోధ్య రామమందిరంలో జనవరి 22న బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగబోతోంది. శ్రీరాముడి అభిషేక సమయంలో 5 కేజీల అఖండ జ్యోతిని వెలిగించనున్నారు. కంప్లీట్‌గా వెండితో తయారైన అఖండ దీపం అయోధ్యకు చేరుకుంది. దీనికి శ్రీరామ్ అఖండ జ్యోతి అని పేరు పెట్టారు. శైలేంద్ర సోని అనే భక్తుడు రూ.5లక్షల వ్యయంతో దీన్ని తయారు చేయించారు. అఖండ జ్యోతి నిర్మాణంలో 18 గేజ్ వెండి ప్లేట్‌ను వాడటం వల్ల అది బలంగా ఉంటుంది. ఈనెల 16 నుంచి 22 వరకు (వారం రోజుల పాటు) అయోధ్య రామమందిరంలో జరగనున్న రాంలల్లా పవిత్రోత్సవంలో శ్రీరామ్ అఖండ జ్యోతిని ఉపయోగించనున్నారు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా వారం పాటు ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. ఈ అఖండ జ్యోతిని ఒక్కసారి నెయ్యి నింపి వెలిగిస్తే.. 72 గంటల పాటు వెలుగుతుంది. దీని నుంచి వచ్చే పొగ కూడా ఆలయ ప్రాంగణంలోకి వెళ్లదు. ఆ పొగ కూడా అఖండ జ్యోతి లోపలికే వెళ్లేలా తయారుచేశారు. ఈ అఖండ జ్యోతి 25 సంవత్సరాల పాటు ఏమాత్రం పాడవ్వకుండా ఉండగలదని శైలేంద్ర సోని చెప్పారు. ఇది అయోధ్య రామాలయంలో ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ప్రతి రోజూ దీన్ని శుభ్రపరచి నిరంతరం వెలిగేలా చేస్తారని(Sriram Akhand Jyoti) తెలిసింది.
We’re now on WhatsApp. Click to Join.
14న అయోధ్యకు దివ్యాంగ కవి అక్బర్ తాజ్.. ఎవరాయన ?
ఈనెల 14న అయోధ్యలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి దివ్యాంగ కవి అక్బర్ తాజ్‌ను జగద్గురు సంత్ రామభద్రాచార్య ఆహ్వానించారు. అక్బర్ తాజ్ మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలోని హప్లా-దీప్లా గ్రామానికి చెందిన దివ్యాంగ కవి. ఆయన కవితలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా అక్బర్ తాజ్ శ్రీరాముని గుణగణాలను కీర్తిస్తూ పలు రచనలు చేశారు. శ్రీరాముడు అందరికీ చెందినవాడని అక్బర్ తాజ్ చెబుతుంటారు. 44 ఏళ్ల అక్బర్ తాజ్ దృష్టిలోపంతో బాధపడుతున్నారు. బ్రెయిలీ లిపిని కూడా అక్బర్ తాజ్ నేర్చుకోలేదు. అయినప్పటికీ అక్బర్ తాజ్ తన మనసులోని భావాలను ఇతరుల చేత రాయిస్తుంటారు. ఆయన దేశవ్యాప్తంగా పలు వేదికలపై తన హిందీ, ఉర్దూ రచనలను వినిపించారు. రామునిపై ఆయన చేసిన రచనలు ఆయనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. జనవరి 22న రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని అక్బర్ తెలిపారు.