1400 Jobs Cut : స్పైస్‌జెట్‌లో 1400 జాబ్స్ కట్.. కారణం అదే ?
1400 Jobs Cut : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్ త్వరలో 1400 మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అవుతోంది.
- Author : Pasha
Date : 12-02-2024 - 3:52 IST
Published By : Hashtagu Telugu Desk
1400 Jobs Cut : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్ త్వరలో 1400 మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అవుతోంది. సంస్థ ఖర్చులను తగ్గించుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లీట్ ఖర్చులను తగ్గించడానికి, సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికే ఉద్యోగ కోతల దిశగా స్పైస్‌జెట్ అడుగులు వేస్తోంది. ‘‘స్పైస్‌జెట్ ఇప్పటికే అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. చట్టపరమైన పోరాటాలు చేస్తోంది. అందుకే సంస్థలో ఉన్న అదనపు సిబ్బందిని తొలగించి, కొంత మేరకు ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ వారం చివరి నాటికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది’’ అని స్పైస్‌జెట్ అధికారి ఒకరు ప్రకటించారు. ‘‘ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో 9000 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 10 నుంచి 15 శాతం మందిని తొలగించే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే సంస్థకు ఏడాదికి రూ.100 కోట్ల వరకు ఆదా అవుతుంది’’ అని చెప్పారు. ‘‘స్పైస్‌జెట్ దాదాపు అన్ని శాఖల్లోనూ అదనంగా ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు(1400 Jobs Cut) సిద్ధమవుతోంది. ఇప్పటికే మేనేజ్మెంట్, కన్సల్టెన్సీ సిబ్బంది సంస్థలో అదనంగా ఉన్న ఉద్యోగుల జాబితాను తయారు చేస్తున్నారు’’ అని మరో అధికారి పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join
- ప్రస్తుతం స్పైస్‌జెట్ వద్ద 10 లీజుకు తీసుకున్న విమానాలు, 30 వరకు ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి.
- 2023లో స్పైస్‌జెట్ 83.90 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. దేశంలో దీని మార్కెట్ వాటా 5.5 శాతంగా ఉండడం గమనార్హం.
- ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్లోలో భారత్ ఒకటి. ముఖ్యంగా దేశీయ విమానాలు పెద్దఎత్తున రాకపోకలు కొనసాగిస్తున్నాయి.
- స్పైస్‌జెట్ ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన సెక్యూరిటీలు జారీ చేసి రూ.2,250 కోట్లు సమీకరించాలని నిర్ణయించుకుంది. మొదటి విడతగా రూ.744 కోట్లు సమీకరించినట్లు ఈ ఏడాది జనవరి 26న ప్రకటించింది.
- గవర్నమెంట్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ కింద ఇప్పటికే స్పైస్‌జెట్ రూ.1000 కోట్ల విలువైన నిధులను పొందింది. మరో రూ.500 కోట్లు కూడా సమకూర్చుకోవడానికి స్పైస్ జెట్ యత్నిస్తోంది.
- లీజుకు తీసుకున్న విమానాలకు స్పైస్‌జెట్ అద్దె చెల్లించలేదు. దీనితో లీజర్లు తమ విమానాలను తిరిగి తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం కోర్టు కేసులు కూడా వేశారు. ఇది స్పైస్‌జెట్‌కు పెద్ద సమస్యగా మారింది.