SBI : వడ్డీ రేట్లు తగ్గించి షాక్ ఇచ్చిన SBI
SBI : ఈ తగ్గింపు ‘అమృత్ వృష్టి’ పథకానికి మాత్రమే పరిమితం అని, ఇతర రెగ్యులర్ ఎఫ్‌డీ పథకాలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.
- By Sudheer Published Date - 02:02 PM, Sat - 14 June 25

దేశీయంగా అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ప్రత్యేక ఎఫ్‌డీ పథకం *‘అమృత్ వృష్టి’పై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా మార్పులు జూన్ 15, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కెనరా బ్యాంకుల్లాంటి ప్రైవేట్ బ్యాంకులు తమ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించాయి. ఇప్పుడు ఎస్‌బీఐ కూడా అదే బాటలోకి వెళ్లింది. అయితే ఈ తగ్గింపు ‘అమృత్ వృష్టి’ పథకానికి మాత్రమే పరిమితం అని, ఇతర రెగ్యులర్ ఎఫ్‌డీ పథకాలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.
Basmati Rice Export: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం.. భారత్‌కు కోట్ల రూపాయల నష్టం?!
ఈ స్కీమ్‌లో 444 రోజుల పాటు డిపాజిట్ పెట్టేవారికి వడ్డీ రేటు సాధారణ పౌరులకు 6.60%గా, సీనియర్ సిటిజెన్లకు 7.10%, సూపర్ సీనియర్ సిటిజెన్లకు (80 ఏళ్లు పైబడినవారు) 7.20%గా ఉంది. ప్రారంభంలో ఈ స్కీమ్ వడ్డీ రేటు 7.25% ఉండగా, మధ్యలో 6.85%కి తగ్గించి, ఇప్పుడు మరోసారి తగ్గించి 6.60%కి చేరింది. సీనియర్ సిటిజెన్లకు గతంలో 7.75% వడ్డీ లభించగా, ఇప్పుడు కేవలం 7.10% మాత్రమే అందుతుంది. దీని వల్ల ముఖ్యంగా పెన్షన్ ఆధారిత వృద్ధులు కొంత మేర నిరుత్సాహానికి గురవుతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పథకంలో రూ. 5 లక్షలు జమ చేస్తే 444 రోజుల తర్వాత సాధారణ పౌరులకు రూ. 40,000 – 41,000, సీనియర్ సిటిజెన్లకు రూ. 43,000 – 44,000, సూపర్ సీనియర్ సిటిజెన్లకు రూ. 44,000 – 45,000 వరకూ వడ్డీ లభించవచ్చు. అయితే, వడ్డీ తగ్గింపులతో ఖాతాదారులపై ప్రభావం పడినప్పటికీ, ప్రస్తుతం ఇతర సాధారణ ఎఫ్‌డీలపై ఎస్‌బీఐ 3.30% నుంచి 6.70% వరకు వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజెన్లకు 3.80% నుంచి 7.30% వరకు వడ్డీ లభిస్తోంది. ఇది చూస్తే, ‘అమృత్ వృష్టి’పై వడ్డీ తగ్గింపును మిశ్రమంగా చూడవచ్చు. కొందరికి ఇది ఇబ్బంది అయితే, కొందరికి స్టెబుల్ ఎంపికగానే ఉంటుంది.